Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
Kuppam Politics : కుప్పంలో వైసీపీ సరికొత్త వ్యూహం అమలుచేస్తుంది. వచ్చే ఎన్నికల్లో బరిలో ఆ సినీ నటుడిని దింపుతారని సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం మొదలైంది.
Kuppam Politics : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో రాబోయే ఎన్నికలకు వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తోంది. ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చేందుకు వైసీపీ నాయకులు సన్నహాలు ప్రారంభించేశారని ప్రచారం జరుగుతోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు ప్రణాళికలు చేస్తుంది. ఈసారి చంద్రబాబుకి ప్రత్యర్థిగా సినీనటుడు, తమిళస్టార్ విశాల్ కృష్ణ డిసైడ్ అయ్యారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతుంది. సినీరంగంలో తనదైన స్థానం సంపాదించుకుని, తెలుగు, తమిళ ప్రేక్షకుల మన్నలను పొందిన హీరో విశాల్ కృష్ణ. నటనలో కాదు. మానవత దృక్పథం కూడా ఎక్కువే. ఇప్పటికే సమాజ సేవ చేస్తూ అభిమానుల మనసును దోచుకున్నాడు విశాల్. ఆయన తండ్రి కృష్ణారెడ్డి తెలుగు వారు కావడంతో విశాల్ కృష్ణకు అత్యంత సన్నిహిత బంధువర్గం అంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అంతేకాకుండా విశాల్ కృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు వారి నుంచి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక విశాల్‌కృష్ణ తమిళనాడులో స్థిర పడినప్పటికీ ఆంధ్ర రాజకీయ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారని తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వైసీపీ తన వ్యూహాన్ని మార్చుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతే కాకుండా వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి తాను వీరాభిమానిని అంటూ అనేక సందర్భాల్లో విశాల్‌కృష్ణ చెప్పారు. తమిళ నటుడు అయినప్పటికీ వైసీపీ నాయకుల్లో ఆయనకు బంధువర్గం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.
వైసీపీ వ్యూహాలు
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏపీలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఏపీలో వైసీపీ అధికారం చేజిక్కించుకున్న తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంపై దృష్టి సారించింది. కంచుకోటగా చెప్పుకునే కుప్పంలో చంద్రబాబును ప్రజలకు దూరం చేసేందుకు అధికార పార్టీ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు అధికారపార్టీ ప్రజలకు చేరువ అయ్యేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. ఇదిలా ఉంటే జిల్లా యాత్రల పేరుతో టీడీపీ నాయకులు ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలంతా తమ పార్టీకే మద్దతుగా నిలుస్తున్నారని, టీడీపీ అంటే, లేదు లేదు తమకే మద్దతు ఇస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీని దెబ్బ తీసేందుకు వైసీపీ వ్యూహాలు అమలు చేయడమే కాకుండా, కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
ఇటీవల స్థానిక ఎన్నికల్లో వైసీపీ తన సత్తా చాటింది. మరోవైపు చిత్తూరు జిల్లా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో నారా చంద్రబాబును ఓడిస్తామని గట్టిగానే సవాల్ విసురుతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే కుప్పం స్థానికుడు అయ్యేందుకు ఓ ఇంటిని సైతం నిర్మిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ తరపున చంద్రబాబు ఢీకొనే అభ్యర్థి విషయంలో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ముందు నుంచీ పార్టీ కోసం కష్టపడిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వైపు తాజాగా సినీ నటుడు విశాల్ కృష్ణ పేరు కూడా వినిపిస్తుంది. ఎటువంటి రాజకీయ అనుభవం లేని విశాల్‌కృష్ణ అవసరం లేదని, తామే చాలని కొందరు వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారని సమాచారం. ఇందంతా ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకూ దీనిపై విశాల్ స్పందించలేదు. ఏది ఏమైనప్పటికీ విశాల్‌కృష్ణ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నాడా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సిఉంది.