(Source: ECI/ABP News/ABP Majha)
KCR Master Plan : ఎన్నికలకు ఆగస్టుకే అస్త్రశస్త్రాలతో కేసీఆర్ రెడీ - మరి కాంగ్రెస్, బీజేపీ సిద్ధమేనా ?
ఎన్నికల సమరానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. మరి ఇతర పార్టీలు రెడీ అయ్యాయా ?బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బెటర్పిరాయింపు నేతల కోసం బీజేపీ ఎదురు చూపులుకేసఆర్ స్పీడ్‌ను అందుకోలేకపోతున్నారా ?
KCR Master Plan : తెలంగాణ రాజకీయాలు ఏ క్షణమైనా ఎన్నికలు అన్నట్లుగా మారిపోతున్నాయి. నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు సన్నద్ధత పూర్తి చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నాయి. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందంజలో ఉన్నారు. మూడో సారి గెలిచి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఎన్నికలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగస్టు కల్లా… అభ్యర్థుల్ని ప్రకటించి ఇక ప్రచార బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. ఇందు కోసం అవసరమైన కసరత్తును ఫామ్ హౌస్ వేదికగా పూర్తి చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం… రాష్ట్రంలో పాతుకుపోయిన అధికారుల బదిలీలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రతీ రోజూ బదిలీల ఉత్తర్వులు వస్తున్నాయి. డీఎస్పీలు.. సీఐలు… అలాగే ఎన్నికల విధుల్లో భాగమయ్యే ఇతరుల పోస్టింగ్‌లను కేసీఆర్ స్వయంగా పరిశీలించి ఓకే చేస్తున్నారు.
సంక్షేమ పథకాల హామీలు శరవేగంగా అమలు
సంక్షేమ పథకాలను కేసీఆర్ పరుగులు పెట్టిస్తున్నారు. వీఆర్ఏలను ప్రభుత్వంలో భాగం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వికలాంగుల పెన్షన్ నాలుగు వేలకు పెంచారు. ముస్లింలకు రూ. లక్ష సాయం జీవో ఇచ్చారు. బీసీలకు సాయం పంపిణీ చేస్తున్నారు. ఇలా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ శరవేగంగా తీసుకుంటున్నారు. ఈ నెలలోనే మరి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నారు. జారీ చేసిన జీవోల అమలును కూడా ప్రారంభించబోతున్నారు. నిజానికి ఎన్నికల మూడ్ వచ్చేసిన సమయంలో .. తెలంగాణ సర్కార్ కు నిధుల కొరత పట్టి పీడిస్తోంది. కొన్ని పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. అయినప్పటికీ భూములు అమ్మి అయినా సరే లోటు రాకుండా కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
టిక్కెట్ల కసరత్తు దాదాపుగా పూర్తి
అదే సమయంలో పార్టీ టిక్కెట్లపై కసరత్తును దాదాపుగా పూర్తి చేశారు. అన్ని రకాలుగా సమాచారం సేకరించుకున్న తర్వాత కేసీఆర్ అభ్యర్థులను ఫైనల్ చేసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కనీసం పాతిక మంది సిట్టింగ్‌లకు సీట్లు ఉండవన్న సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ , కేసీఆర్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు వారితో వ్యవహరించిన విధానాన్ని బట్టి… టిక్కెట్లపై ఆశలు వదిలేసుకోమని సంకేతాలు ఇచ్చారు. ఆగస్టులోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తర్వాత అసంతృప్తిని ఎలా డీల్ చేయాలో తెలుసని ఆయన అనుకుంటున్నారని అంటున్నారు.
ఇంకా ఎన్నికల కసరత్తులోకి దిగని బీజేపీ, కాంగ్రెస్
బీఆర్ఎస్ కు ప్రత్యర్థులైన రెండు పార్టీలు జాతీయ పార్టీలు. నిర్ణయాలు దానికి తగ్గట్లుగానే ఆలస్యంగా నడుస్తాయి. రెండు పార్టీలు ఇంకా అభ్యర్థులపై దృష్టి పెట్టలేదు. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ కొంచెం దూకుడుగా ఉంది. అంతర్గతంగానైనా కొంత మేర కసరత్తు పూర్తి చేసుకున్నారు. ఎవరికి వారు తమ అనుచరులకు టిక్కెట్లిప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ లో లిస్ట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే విడుదలవుతుంది. బీజేపీ అయితే.. రెండు పార్టీల లిస్టులు వచ్చిన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిరాయింపు దార్లకు బీజేపీలో ఎక్కువ అవకాశాలు దక్కే చాన్సులు ఉన్నాయి అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో కాస్త ముందు ఉంది. బీజేపీ అంతర్గత సమస్యలతో ఇటీవల వెనుకబడినట్లుగా కనిపిస్తోంది.