KCR BRS Postpone : కేసీఆర్ జాతీయ పార్టీ ఇప్పుడే కాదా ? మూడో సారి గెలవడమే ప్రస్తుత లక్ష్యమా ?
జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఏర్పాటుపై కేసీఆర్ పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ అంశంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
KCR BRS Postpone : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించాలనుకుంటున్న జాతీయ పార్టీపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు. గత నెల 19వ తేదీన ఢిల్లీలో ఆయన బీఆర్ఎస్‌ను ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. అయితే ఆ సమయంలో కేసీఆర్ సతీమణి ఆస్పత్రిలో చేరారు. దీంతో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చాలన్న తీర్మానం చేయాలనుకున్నా సాధ్యం కాదు. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ విషయంలో మరికొంత కాలం ఆగాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉన్నందున ఆ ఎన్నికలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
జాతీయ రాజకీయాలకే సమయం - పార్టీపై దృష్టి పెట్టని కేసీఆర్ !
ప్రస్తుతం కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాల కోసమే సమయం కేటాయిస్తున్నారు. తెలంగాణలో పార్టీ, పాలనా వ్యవహారాలన్నింటినీ కేటీఆర్ చూసుకుంటున్నారు. అయితే ఎక్కువగా అభివృద్ధి పనులు.. పాలనా పరమైన వ్యవహారాలకే సమయం కేటాయిస్తూండటంతో పార్టీ పరంగా అనేక సమస్యలు వస్తున్నాయి. పార్టీ నేతల మధ్య విభేదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఫలితంగా పలువురు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి వి అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో కేసీఆర్ ముందు పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మూడో సారి గెలిస్తే దేశవ్యాప్తంగా క్రేజ్ !
కేసీఆర్ ఢిల్లీలో జాతీయ స్థాయి నాయకునిగా నిలబడాలంటే ముందు హోంగ్రౌండ్‌లో విజయం సాధించాలి., పార్లమెంట్ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలు ముందు రానున్నాయి. అసెంబ్లీలోనే గెలిస్తేనే ఢిల్లీ వైపు పెట్టేగురికి బలం ఉంటుంది. లేకపోతే ఉండదు. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఓట్లు చీలి తాము గెలుస్తామని టీఆర్ఎస్ వర్గాలు అనుకుంటూ ఉండేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని భావిస్తున్నారు. ప్రజలు మార్పును డిసైడ్ అయితే ఏదో ఓ పార్టీకి గుంపగుత్తగా వేస్తారని ప్రస్తుతం పొలిటికల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ ముందుగా.. అధికారాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి సారించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మూడో సారి అధికార పీఠం దక్కితే కేసీఆర్‌కు తిరుగులేని నేతగా దేశవ్యాప్తంగా క్రేజ్ వస్తుంది.
జాతీయ రాజకీయాల్లో మోదీని ఢీకొట్టే నేతగా గుర్తింపు పొందితే ప్రజలూ అండగా నిలబడే చాన్స్ !
కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తారని ప్రజలు నమ్మితే కేసీఆర్‌కు ఏకపక్షంగా ఓట్లేస్తారు. ఆ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు వదులుకోరు. అయితే ఆయన ఇంట గెలవకపోతే అలాంటి ఆలోచన ప్రజలకు రాదు. ఇవన్నీ అంచనా వేసుకున్న కేసీఆర్ గల్లీలో మూడోసారి గెలిచిన తర్వాత ఢిల్లీపై గురి పెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అంటే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లేనని అనుకోవచ్చు.