Munugode Silence : మునుగోడులో ముగిసిన ప్రచారం - " పోల్ మేనేజ్‌మెంట్ " చాంపియన్లకే అడ్వాంటేజ్ !
మునుగోడులో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీలు దృష్టి పెట్టాయి.
Munugode Silence : మునుగోడు ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం ఆరు గంటలకు మైకులు మూగబోయాయి. స్థానికేతరులు అందరూ నియోజకవర్గాన్ని వదిలి పెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చు. మూడో తేదీన పోలింగ్ జరగనుంది. తెలంగాణ రాజకీయాలను మార్చేస్తుందని భావిస్తున్న ఉపఎన్నికలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. దానికి తగ్గట్లే రాజకీయ పరిణామాలూ హై టెన్షన్‌గా చోటు చేసుకుంటున్నాయి.
"పోల్ మేనేజ్‌మెంట్‌లో" ఎవరు కింగ్ అయితే వారికే అడ్వాంటేజ్ ?
ప్రజాస్వామ్యంలో ఓటుకు నోటు అనేది ఇప్పుడు అన్నిరాజకీయ పార్టీలు పాటిస్తున్న సిద్ధాంతం. మునుగోడులా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్న నియోజకవర్గంలో ఉపఎన్నిక అయితే ఇక ఆ ఖర్చుకు హద్దే ఉండదు. మునుగోడులో అదే జరుగుతోంది. ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చు ఓ ఎత్తు.. పోలింగ్ ముందు రోజు చేసే ఖర్చు ఓ ఎత్తు. అంటే ఓటర్లకు డబ్బులు పంచడం. రాజకీయ పార్టీలు..దీన్ని గౌరవంగా పోల్ మేనేజ్ మెంట్ అని పిలుచుకుంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే టీఆర్ఎస్, బీజేపీ ధన శక్తి ముందు కాంగ్రెస్ పోటీ పడలేకపోతోంది. చివరి క్షణంలో ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో కానీ ఇప్పుడైతే పోల్ మేనేజ్‌మెంట్‌లో టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి.
అన్ని పార్టీలకూ డూ ఆర్ డై ఎలక్షన్ !
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి బి.జె.పి.లో చేరడం వల్ల మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే సంవత్సరమే ఎన్నికలు వస్తూండడంతో ఈ ఉప ఎన్నికను రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఢిల్లీ నుండి బి.జె.పి. పెద్దలు కూడా తరలి వచ్చి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో బిజీగా వున్నారు. ఎవరెన్ని మాటలు మాట్టాడుతున్నా ఓటర్ల మనసులో ఏముందో, తన తీర్పు ఎలా ఇస్తారోననే భయం అందరిలోనూ వుంటుంది. రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడినప్పటికీ మునుగోడులో ప్రజల మద్ధతు తమకే వుందని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ కి గెలుపు అవసరం. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బి.జె.పి. కూడా మునుగోడులో గెలుపు ఫలాన్ని అందుకోవడం ద్వారా తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలనే తీవ్రమైన ప్రయత్నాల్లో వుంది. జాతీయ రాజకీయాల్లో జెండా పాతాలనే సంకల్పంతో బి.ఆర్.ఎస్.గా అవతరించిన టి.ఆర్.ఎస్.కి మునుగోడు గెలుపు అత్యంత ప్రధానమైన అంశం. ఒకవేళ ఓటమిపాలైతే ఇక్కడే గెలవలేనివారు జాతీయ స్థాయిలో ఏంచేయగలరనే విమర్శలు వెల్లువెత్తుతాయి.
ఉద్రిక్తతల మధ్య సాగిన ఎన్నికల ప్రచారం !
మునుగోడు ఉపఎన్నికల ప్రచారం తీవ్ర ఉద్రిక్తల మధ్య సాగింది. పలు చోట్ల దాడులు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలపై దాడులు జరిగాయి. చివరి రోజున ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. పోలీసులు పెద్ద ఎత్తున డబ్బులు పట్టుకున్నారు. మునుగోడులో దొరికిని కాకుండా.. మునుగోడు కు తరలించేందుకు హైదరాబాద్ నుంచి తీసుకెళ్తున్న వాటినీ పట్టుకున్నారు. అలాగే మునుగోడు ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ.. ఫామ్ హౌస్ కేసు నమోదవడం సంచలనం సృష్టించింది. ఇంత తీవ్ర స్థాయిలో జరిగిన పోరాటంతో.. మునుగోడు పోలింగ్ లో ఓటరు..మూడో తేదీన ఓటు ద్వారా విజేత ఎవరో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు.