కన్నా వ్యాఖ్యలపై స్పందించ వద్దు- పార్టీ నేతలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు!
బీజేపిలో సీనియర్ నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలో అత్యంత కీలకంగా ఉన్న రాష్ట్ర అధ్యక్షుడిని టార్గెట్ చేసి మరీ కన్నా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపిలో సీనియర్ నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్న వ్యాఖ్యలను పార్టి నేతలు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. కన్నా చేస్తున్న వ్యాఖ్యలపై ఎవరూ స్పందించ వద్దని పార్టీ రాష్ట్రనాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. దీంతో నేతలు ఆ కామెంట్స్‌పై తాము స్పందించలేమని చెప్పేస్తున్నారు.
బీజేపిలో సీనియర్ నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీలో అత్యంత కీలకంగా ఉన్న రాష్ట్ర అధ్యక్షుడిని టార్గెట్ చేసి మరీ కన్నా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన పని తీరు బాగోలేదని బహిరంగంగా అంటున్నారు. అంతే కాదు పవన్ కల్యాణ్ వ్యవహరంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వీర్రాజు సరైన రీతిలో స్పందించటం లేదని, ఆయన్ని సరిగా వాడుకోవటం లేదని గతంలో కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యలు చేశారు. తాజగా మరోసారి కన్నా వ్యాఖ్యలు పార్టీలో దుమారాన్ని రాజేశాయి.
బీజేపి జిల్లా అధ్యక్షుల మార్పును తప్పుబట్టిన కన్నా... కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని ఫైర్ అయ్యారు. అధ్యక్షుల మార్పు తనతో చర్చించలేదని... ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వాళ్లేనని కన్నా వెల్లడించారు. కోర్ కమిటి సమావేశం తప్ప పార్టీలో ఇతర ఏ సమాచారం తమకు తెలియడం లేదని, రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఉన్నప్పడు ఎంతో మందిని బిజేపిలో జాయిన్ చేశానని గుర్తు చేశారు. ఇప్పడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు.
తన వియ్యంకుడు బిఆర్ఎస్‌లో ఎందుకు చేరారో సోము వీర్రాజు ను అడగాలని కన్నా అన్నారు. ఎంపీ జివిఎల్ ఆలోచన స్థానిక బిజేపి కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని సహా అనేక అంశాల్లో జీవిఎల్ వైఖరిని కన్నా ప్రస్తావించారు. జగన్- కేసిఆర్ కుట్రలో భాగంగానే బిఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు వెళుతున్నారని కన్నా అభిప్రాయపడ్డారు.
కన్నా వ్యాఖ్యలపై స్పందించబోమంటున్న నేతలు
కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలపై తాము స్పందించలేమని పార్టీ అగ్ర నాయకత్వం పరిశీలిస్తుందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు అన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై తాము చర్చించుకుంటాం.. పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.