Andhra Financial Crisis : ఐదునెలల్లో ఆదాయం కన్నా అప్పులే ఎక్కువ - రికార్డు స్థాయిలో లోటు ! ఏపీ సర్కార్ అర్థిక పరిస్థితి విషమంగా మారిందా ?
ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చలు ప్రారంభమయ్యాయి. కాగ్ విడుదల చేసిన ఐదు నెలల రిపోర్టులో ఆదాయం కన్నా ఖర్చు దాదాపుగా రూ. 60వేల కోట్లు ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది.
Andhra Financial Crisis : పదమూడో తేదీ వచ్చినా కొన్ని శాఖల్లో ఉద్యోగులకు జీతాలు, రిటైరైన వారికి పెన్షన్లు రాలేదని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ ప్రారంభమయింది. ఈ నెలలో రెండు మంగళవారాలు ప్రభుత్వం ఆర్బీఐ వద్ద అప్పు తెచ్చుకుంది. అయినా జీతాలు చెల్లించలేకపోయారా ?. ఇప్పుడే ఇలా ఉంటే... అప్పుల పరిమితి ముగిసిపోయినందున.. కొత్త అప్పులు దొరకకపోతే.. ఇక ముందు జీతాలు ఎలా చెల్లిస్తారు ? అనే సందేహం చాలా మందిలో ప్రారంభమయింది. ఈ ఆర్థిక సంవత్సంలో ఐదు నెలల కాగ్ ఆడిట్ రిపోర్టులను పరిశీలిస్తే... ఏడాది మొత్తం లోటు ఐదు నెలల్లోనే ఏర్పడింది. మరి మిగతా కాలం ఎలా నెట్టుకొస్తారనేది ఇప్పుడు ఆర్థిక నిపుణులకు సైతం ఊహకందని సస్పెన్స్‌గా మారింది.
ఆదాయానికి వ్యయానికి పొంతన లేని ఆర్థిక నిర్వహణ !
రాష్ట్ర ప్రభుత్వ ఖజానా తొలి ఐదు నెలల కాగ్ రిపోర్టులను చూస్తే.. ఆదాయానికి ఖర్చులకు పొంతనే ఉండటం లేదు. ఇప్పటికే నమోదైన లోటు ఆందోళనకరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తొలి ఐదు నెలల్లోనే రూ.44582.58 కోట్లు లోటుగా నమోదు అయింది. ఇది ఆర్థిక సంవత్స రం అంతానికి రూ.లక్ష కోట్లకుపైగా చేరుకునే ప్రమాదం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాదికి ఆదాయానికి, వ్యయానికి మధ్య అంతరం రూ.40 వేలకోట్ల వరకు ఉండగా, ఈ ఏడాది ఈ అంతరం ఐదు నెలలకే రూ. యాభై వేల కోట్ల వరకూ చేరింది. తాజాగా తెలిసిన వివరాల మేరకు తొలి ఐదు నెలల్లో రూ.44593కోట్లు సొంత ఆదాయం లభించగా, ఖర్చు ఏకంగా రూ.102490.41 కోట్లుగా ఉన్నట్లు తెలిసింది. ఇంత భారీ లోటు గత కొన్నేళ్లుగా ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఇంత భారీ లోటు ఉంటే ముందు ముందు భరించడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఓవర్ డ్రాఫ్ట్ మీదనే అధికంగా ఆధారపడుతున్న ప్రభుత్వం !
అక్టోబరు నుంచి ప్రారంభమైన రెండో అర్ధ సంవత్సరం ఓవర్‌డ్రాఫ్ట్‌తోనే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్‌లో తొలుత రూ.1900 కోట్లు వరకు ఓడి ఉండగా, తరువాత అది రూ.2,975 కోట్లకు చేరిపోయింది. నాలుగో తేదీన రిజర్వు బ్యాంకు నుంచి సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రూ.2 వేలకోట్లు రుణం వెంటనే ఓడి కింద రిజర్వు బ్యాంకు జమచేసుకున్నట్లు చెబుతున్నారు. తరువాత మరికొంత ఓడికి వెళ్లడంతో తాజాగా ఇంకా రూ.1,635 కోట్ల వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌లో ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితి లోనే నిధుల లేమితో ఇంకా కొంతమంది ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు అందలేదని, పింఛనుదారులు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
మరోసారి పూర్తి లెక్కలు అడిగిన కేంద్రం !
మరో వైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవహారాలపై నిఘా పెడుతోందన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని.. వివరించాలని కేంద్రం నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు ఓ లేఖ అందినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలంలో ఆస్తుల కల్పన, వాటి నిర్వహణకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వివరాలను పంపాలని పేర్కొంది. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన వివరాలు కూడా కోరింది. 2018-19 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలు చెప్పాలని అడిగినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర పథకాల నిర్వహణపైనా వివరాలు కోరింది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, వాటికి కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర వాటా నిధులు, ఈ పథకాలను నిర్వహిస్తున్న ప్రభుత్వ సంస్థ, నిధులను నిల్వచేసిన సింగిల్ నోడల్ ఏజెన్సీ బ్యాంకు పేరు, సెప్టెంబరు వరకు వచ్చిన నిధుల వివరాలు కూడా చెప్పాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
అదనపు అప్పుల కోసం ఏపీ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు!
ఈ ఏడాది అప్పుల పరిమితి ముగిసిపోయింది. కొన్ని అదనపు అప్పులు కూడా చేశారు. ఇంకా పర్మిషన్ ఉందో లేదో తెలియదు. అయితే అదనపు అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బ్యాంకుల నుంచి కూడా తీసుకునేలా చూస్తోంది. అయితే పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. ఈ నెలలో ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చుకున్నా... ఇంకా జీతాలు ఇస్తూనే ఉన్నారు. ఒక వేల ఆర్బీఐ నుంచి అప్పు రాకపోతే పరిస్థితి ఏమిటన్నది ఉద్యోగులనూ ఆందోళనకు గురి చేస్తున్న ప్రశ్న.