KCR Early Polls Plan : లేదు ..లేదంటూనే ముందస్తున్న సన్నాహాలు చేస్తున్నారా ? కేసీఆర్ అడుగులు అటు వైపేనా ?
మార్చి తర్వాత ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లవచ్చన్న ప్రచారానికి బలం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సారి కూడా ఆరు నెలల ముందుగానే ముందస్తు ఉంటుందని నమ్ముతున్నారు.
KCR Early Polls Plan : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవని ప్రకటించారు. కానీ పది నెలల్లో ఎన్నికలు ఉంటాయని..ఇక నుంచి అందరూ ప్రజల్లో ఉండాలని ఎమ్మెల్యేలకు చెప్పి పంపించారు. ఏడాది సమయం ఉంటే.. కేసీఆర్ రెండు నెలలు పదవీ కాలం తగ్గించి చెప్పారేమిటని ఎమ్మెల్యేలకు ఆలోచించుకునే అవకాశం ఇవ్వలేదు. కానీ కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు మాత్రం ముందస్తు ఎన్నికలకు సూచికలేనన్న అభిప్రాయం అటు టీఆర్ఎస్‌లోనూ.. ఇటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది.
ఆరు నెలలు ముందుగా వెళ్తే ముందస్తు కాదనేది కేసీఆర్ అభిప్రాయం !
ఆరు నెలలు ముందుగా వెళ్తే అది ముందస్తు కాదు.. అని గతంలో అసెంబ్లీని ఆరు నెలల ముందుగా రద్దు చేసినప్పుడు కేసీఆర్ ప్రకటించారు. ఎందుకంటే ఎన్నికల సంఘం.. అసెంబ్లీ గడువు ముగిసే ఆరు నెలల ముందు ఎన్నికలు నిర్వహించవచ్చని… అందుకే ఆరు నెలల్లోపు ఎన్నికలు జరిగితే అది ముందస్తు కాదని ఆయన విశ్లేషించారు. ఈ సారి కూడా అదే ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోందని టీఆర్ఎస్ నేతలు ఓ అంచనాకు వచ్చారు. మరోసారి ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్తారని..కార్యవర్గ భేటీలో సంకేతాలు వచ్చాయని అంటున్నారు. ఇంకా ఎన్నికలకు పది నెలల సమయం మాత్రమే ఉందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతల్లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సింది వచ్చే ఏడాది డిసెంబర్‌లో . అంట పదమూడు నెలల సమయం ఉంటుంది. కానీ కేసీఆర్ మూడు నెలల సమయం తగ్గించి… ఇక పది నెలలే ఉందని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు ఉండవని.. సమయానికే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ చెప్పారు కానీ.. ఆయన రెండు, మూడు నెలల ముందుగా ఎన్నికలన్నట్లుగా చెప్పడంతో ఎన్నికల మోడ్‌లోకి వెళ్లిపోవాలని టీఆర్ఎస్ నేతలు అంచనాకు వచ్చారు.
రెండు నెలల్లో సెక్రటేరియట్ ప్రారంభం .. వెంటనే కంటి వెలుగు ప్రోగ్రాం కూడా !
2018 ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు కేసీఆర్ అమలు చేసిన స్కీముల్లో కీలకమైనది కంటి వెలుగు . తెలంగాణలోని ప్రతి ఒక్కరి కళ్లను పరిశీలించి.. మందులో .. ఐ డ్రాప్సో.. లేకపోతే కళ్లద్దాలో.. ఇంకా తీవ్రమైతే ఆపరేషన్లో చేయించారు. దీంతో తమను చూసుకునే ప్రభుత్వం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో కల్పించారు. పాలనపై ఉన్న పాజిటివ్ వాతావరణంలో ఈ స్కీం వల్ల ప్లస్ బాగా ఉపయోగపడింది. ఇప్పుడు మరోసారి కంటి వెలుగు ప్రోగ్రాంను జనవరిలో ఏర్పాటు చేస్తున్నారు. 2018లోలాగే అందరికీ టెస్టులు చేసి.. ప్రజల్లో పాజిటివ్ భావన తెచ్చుకోవాలనుకునే ప్రయత్నం జరుగుతోందని అనుకోవచ్చు. అదే సమయంలో కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సచివాలయ నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది. మరో రెండు నెలల్లో ప్రారంభమవుతుందని కేటీఆర్ ప్రకటించారు. అంటే.. జనవరి నెలాఖరుకు సచివాలయం ప్రారంభమవుతుంది. దీంతో సెంటిమెంట్ ప్రకారం అందులో పాలన ప్రారంభించి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనుకుంటే బీజేపీ కూడా రెడీనే !
కేసీఆర్ పొలిటికల్ యాక్షన్‌ను డిసెంబర్ నుంచి నెక్ట్స్ స్టేజ్‌కు తీసుకెళ్తున్నారు. ఆ నెలలో బీఆర్ఎస్‌కు అధికారికంగా అనుమతి లభిస్తుంది. టీఆర్ఎస్ అంతర్ధానమైపోతుంది. బీఆర్ఎస్‌ను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించాలంటే.. ముందు తెలంగాణలో గెలవాలి… అందుకోసమే.. ఆరు నెలలకూ అటూ ఇటూగా ముందుకు వెళ్లొచ్చని ఆ పార్టీ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. మార్చిలో బడ్జెట్ పెట్టిన తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అయితే ముందస్తుకు వెళ్లాలంటే కేంద్రం సపోర్ట్ అవసరం. కానీ బీజేపీ కూడా ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమని ప్రకటనలు చేస్తోంది.కేసీఆర్ ఒక వేళ ముందస్తుకు వెళ్లాలనుకుంటే... బీజేపీ కూడా ఆపే అవకాశం ఉండదు. ఎందుకంటే బీజేపీ తాత్సారం చేస్తే భయపడిందని ప్రచారం చేస్తారు. అందుకే.. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి వచ్చే మార్చిలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయవచ్చని .. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు జోస్యం చెబుతున్నారు. అదే జరగవచ్చని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు.