కాంగ్రెస్ లో 'వలస' vs 'ఒరిజినల్' లీడర్ల వార్: స్థానిక ఎన్నికల్లో టికెట్ల కోసం నేతల పోరు, గెలుపుపై ప్రభావం?
Telangana Congress: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తలనొప్పి తప్పేలా లేదు. పార్టీలోకి వచ్చిన వారు, మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు పోటాపోటీగా తమ వాళ్లను నిలబెట్టేందుకు ప్లాన్లు వేస్తున్నారు.

Telangana Congress: పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు స్థానిక సంస్థలకు సమాయత్తమవుతున్నాయి. అయితే అధికార పార్టీలో మాత్రం ఈ ఎన్నికలు గుబులు పుట్టిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు వర్గపోరు నడుస్తోంది. తామే ఒరిజనల్ కాంగ్రెస్ అని, వచ్చిన వారు వలస కాంగ్రెస్ నేతలు అన్న బేధాప్రాయాన్ని పాత కాంగ్రెస్ నేతలు తెస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకోవడానికి అటు వలస నేతలు, ఇటు ఒరిజినల్ నేతలు ఇప్పటి నుంచే పార్టీ పెద్దలపై తమ వారికే అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా రెండు వర్గాల నుంచి వస్తోన్న డిమాండ్లతో హస్తం పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఈ గొడవలు ఇలానే ముదిరితే పంచాయతీ ఎన్నికల్లో గెలుపుపై ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారు.
బలం చూపాలని వలస నేతలు, నమ్మి కాంగ్రెస్‌లో ఉన్నామని ఒరిజనల్ నేతలు
కాంగ్రెస్ పార్టీలో ఈ వర్గ పోరులో ఉన్నసమస్య ఏంటంటే పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో తమ బలం చూపించడం ద్వారా హైకమాండ్ మనసు గెల్చుకోవడం,తద్వారా తమ రాజకీయ భవిష్యతుకు మరిన్ని పెద్ద అవకాశాలు సృష్టించుకోవచ్చని ఆలోచిస్తున్నారు. ఈ దిశగా వచ్చే పంచాయతీ ఎన్నికల్లో తమ వ్యూహాలు, తమ బలంతో ఎక్కువ పంచాయతీలు గెల్చుకుని సత్తా చాటాలాని చూస్తున్నారు. ఇక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేతిలో దురదృష్టవశాత్తు శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినా, తమ ప్రభుత్వం అధికారంలో ఉందన్న ఆనందంలో ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. ఆ ఆనందానికి గండి కొడతూ, తమపైన గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో పాత నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ చేరికలు తమ రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తుందన్న ఆందోళనలో ఉన్నారు. వలస నేతలు వచ్చి పోతారని, తాము ఒరిజినల్ కాంగ్రెస్ నేతలమని, తమకు ప్రాధాన్యత లేకపోతే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో లేకపోయినా నమ్మి తాము ఇన్నేళ్లు కాంగ్రెస్‌లో ఉంటే ఇప్పుడు తమ భవిష్యత్తును నాశనం చేస్తారా అని పాత నేతలు అంటున్నారు. ఇలా రెండు వర్గాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేలా, తమను నమ్ముకున్న వారికి పంచాయతీ ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలన్న డిమాండ్ ను పార్టీ పెద్దల ఎదుటకు తెస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిన నియోజకవర్గల్లో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ నేతలు అన్న రీతిలో చీలికలు వచ్చాయి. కొత్త నేతల రాకను, పాత నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
జగిత్యాలలో సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి
జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ ఆపార్టీ సినియర్ నేత జీవన్ రెడ్డి మధ్య తీవ్రమైన విబేధాలు ఉన్నాయి. ఇటీవలే నియోజవర్గంలో వెలసిన ఫ్లెక్సీలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి ఫోటోలు ప్రముఖంగా పెట్టి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫోటో పెట్టకపోవడం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలోనే తాము ఒరిజినల్ కాంగ్రెస్ అని బ్యానర్లు జీవన్ రెడ్డి వర్గీయులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంజయ్ వర్గానికి ప్రాధాన్యత ఇస్తే, తాము తిరుగుబాటు చేస్తామని జీవన్ రెడ్డి వర్గీయులు ఇప్పటికే హెచ్చరికలు పంపుతున్నారు.
స్టేషన్ ఘన్పూర్ లో కడియం వర్సెస్ కొండా
స్టేషన్ ఘన్పూర్ లోను వర్గ విబేధాలు చోటు చేసుకున్నాయి. వరంగల్ జిల్లాలో పట్టును విడవ కూడదని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరిన కడియం శ్రీహరి తన పట్టును కోల్పోకూడదని భావిస్తున్నారు. ఇలా రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. కడియం రాకను కొండా మురళి రాజకీ అవకాశవాదంగా అభివర్ణించారు. ఇక మంత్రి కొండా సురేఖ తాను మంత్రి కావడాన్ని కడియం జీర్ణించుకోలేకపోతున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానించడం సంచలం సృష్టించింది. ఇలా రెండు వర్గాలు స్టేషన్ ఘన్పూర్ లో తమ రాజకీయ బలాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో తమ అనుచరులకే అవకాశాలు ఇప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించారు. రానున్న రోజుల్లో అంతర్గత పోరు ఎక్కడికి దారి తీస్తుందా అన్న ఆందోళనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు.
గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల వర్సెస్ జెడ్పీ ఛైర్మన్ సరిత
బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హస్తం పార్టీలో చేరికతో , జెడ్పీ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మధ్య వర్గ పోరు ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితం మంత్రి పొంగులేటి సమక్షంలోనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, సరితకు మద్దతు ఇస్తున్న నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే అధికార కార్యక్రమాలకు జెడ్పీ ఛైర్మన్ సరితను పిలవడం లేదని మల్లు రవి ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ జెడ్పీ ఛైర్మన్ సరిత వర్గం రాజకీయాలు చేస్తోంది. ఇలా రెండు వర్గాలు ఇక్కడ తయారయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎవరి వర్గం వారు వారి అనుచరులకు పంచాయతీ ఎన్నికల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
పఠాన్ చెరులో గూడెం వర్సెస్ నీలం అండ్ కఠారి
పఠాన్ చెరు నియోజవర్గం విషయానికి వస్తే ఇక్కడ మూడు వర్గాల మధ్య విబేధాలున్నాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నీలం మధు,కఠారి శ్రీనివాస్ గౌడ్ మధ్య మొదటి నుంచి విబేధాలున్నాయి. పార్టీ అవకాశాల కోసం ఇద్దరు ప్రయత్నిస్తున్నవారే. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో పఠాన్ చెరులో ఇప్పుడు మూడు వర్గాలయ్యాయి. అయితే నీలం మధు, కఠారి శ్రీనివాస్ గౌడ్ మహిపాల్ రెడ్డి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక కఠారి అనుచరులు అయితే ఒక అడుగు ముందుకేసి మహిపాల్ రెడ్డి కార్యాలయంపై దాడి చేశారు. అక్కడి ఫర్నీచర్, కుర్చీలను ధ్వంసం చేశారు. ఈ మూడు వర్గాలు నియోజకవర్గంలో తమ పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. తమ అనుచరులకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మూడు వర్గాలను సయోధ్య కుదర్చడం అంత సుళువేమి కాదని తెలుస్తోంది. ఒక వేళ ఇదే పరిస్థితి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం.
భద్రాచలంలో తెల్లం వర్సెస్ పొదెం
భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆయన వర్గం తెల్లం వెంకట్రావుకు వ్యతిరేక వర్గంగా ఏర్పడింది. ఇరు నేతలు నియోజకవర్గ పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకోనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వర్గం వారికి న్యాయం చేయాలని పార్టీ పెద్దలను డిమాండ్ చేస్తున్నారు.
బాన్సువాడలో పోచారం వర్సెస్ ఎనుగు రవీందర్ రెడ్డి
బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ లో అంతకు ముందు బీజేపీ నుంచి చేరిన ఎనుగు రవీందర్ రెడ్డి మధ్య వర్గపోరు నడుస్తోంది. పోచారం ఎమ్మెల్యేగా ఉండగా, ఎనుగు రవీందర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నారు. పోచారం చేరిక సమయంలోనే ఎనుగు రవీందర్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఆ తర్వాత కూడా ఆయన పోచారం పై పలు అవినీతి ఆరోపణలు బహిరంగంగానే చేయడం జరిగింది. ఇలా రెండు వర్గాలు ఈ స్థానిస సంస్థల ఎన్నికల్లో తమ అనుచరులకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
చేవెళ్లలో కాలే వర్సెస్ భీం
చెవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాలే యాదయ్య కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ పాత నేతలతో వర్గ పోరు మొదలైంది. అక్కడ బలమైన కాంగ్రెస్ నేతగా ఉన్న భీం భరత్ వర్గం కాలే యాదయ్య తీరును వ్యతిరేకిస్తోంది. కాలే యాదయ్య ను పార్టీలోకి తీసుకోవడం వల్ల పాత నేతలకు అన్యాయం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. పాత నేతలను పక్కన పెట్టి తమ అనుచురలకే కాలే యాదయ్య ప్రాధాన్యత ఇస్తున్నారని భీం భరత్ వర్గం ఆరోపిస్తుంది. వలస వచ్చిన నేతలకు కాకుండా, పార్టీని నమ్ముకున్న విధేయులకు స్థానిక సంస్థల్లో టికెట్ ఇవ్వాలని భరత్ వర్గం డిమాండ్ చేస్తుంటే, పార్టీని నమ్ముకుని వచ్చిన తమకు అన్యాయం చేయడం సరైంది కాదని ఎమ్మెల్యే వర్గం వాధిస్తోంది.
ఇలా తెలంగాణ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అంతర్గత పోరు నడుస్తోంది. ఇలా వర్గాల మధ్య సయోధ్య కుదర్చడం, రెండు వర్గాలకు న్యాయం జరిగేలా స్థానిక సంస్థల్లో వారు సూచించిన వారికి అవకాశాలు ఇవ్వడం కత్తిమీద సామే. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా మరో వర్గం నుంచి సహాయ నిరాకరణ తప్పదు. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఎన్నికల నాటికి ఈ పరిస్థితులను ఎలా మార్చుతారన్నది అటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






















