Warangal Congress: కొండా దంపతులపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల తిరుగుబాటు - వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Telangana Congress: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలంతా కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారు పార్టీకి నష్టం చేస్తున్నారని అంటున్నారు.

Konda Vs Congress: వరంగల్ కాంగ్రెస్ పార్టీలో కొండా దంపతులు వర్సెస్ ఇతర నేతలన్నట్లుగా పరిస్థితి మారింది. మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళి స్వంత పార్టీ ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యల పై ఆపార్టీ ఎమ్మెల్యేలు, నేతలు హన్మకొండ లోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కొండా దంపతులను భరిస్తున్నామని, ఇక బరించలేమని నాయిని అన్నారు. త్వరలో పార్టీ ఇంచార్జి మీనాక్షి నరాజన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కొండ దంపతులు కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, పార్టీకి నష్టం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో సమావేశమైన వారిలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాగరాజ్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతోపాటు ముఖ్యనేతలు అన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన కొంతమంది నాయకులు పార్టీకి హాని చేస్తున్నారని కొండా మురళి అంటున్నారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్‌లో ఉండి కేటీఆర్‌కు "వెన్నుపోటు" పొడిచారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో "పెత్తనం" చేస్తున్నారని విమర్శించారు. బసవరాజు సారయ్య , రేవూరి ప్రకాష్ రెడ్డిలను కూడా పరోక్షంగా టార్గెట్ చేస్తూ, వారు పార్టీ ఐక్యతను దెబ్బతీస్తున్నారని ఆరోపణలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమార్తె సుష్మితా పటేల్ పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొండా మురళి ప్రకటించారు. అవసరమైతే "పైసలిచ్చి గెలిపిస్తాను" అని వివాదాస్పదంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలోని ఇతర నాయకులకు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి.
కొండా మురళి, తన భార్య కొండా సురేఖ నిర్వహిస్తున్న శాఖలకు నిధుల కేటాయింపు సరిగా జరగడం లేదని ఆ శాఖ డబ్బులు వచ్చేది కాదన్నారు. ఈ వివాదం వరంగల్ కాంగ్రెస్‌లో ఇప్పటికే ఉన్న అంతర్గత విభేదాలను మరింత తీవ్రతరం చేసింది. కొండా దంపతులు తమ కుటుంబ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి, ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో వారి కుమార్తెను అభ్యర్థిగా నిలపాలనే ప్రయత్నంలో ఉన్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కొండా దంపతులు ఒక వర్గానికి నాయకత్వం వహిస్తుండగా, కడియం శ్రీహరి , రేవూరి ప్రకాష్ రెడ్డి వంటి నాయకులు మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు.
కొండా మురళి వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలను "తారాస్థాయికి" చేర్చాయి. కొండా మురళీ వ్యాఖ్యలపై విచారణకు.. కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల్ని నియమించినట్లుగా చెబుతున్నారు. వారిచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆమె మంత్రి పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కొండా మురళి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.





















