Revanth Reddy : ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి - కేరళ సహా పలు రాష్ట్రాల్లో ప్రచారం !
Telangana Congress : కాంగ్రెస్ జాతీయ స్థాయి స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి మారారు. ఇతర రాష్ట్రాల్లో ఆయన జోరుగా ప్రచారం చేయబోతున్నారు.
Revanth Reddy has become a star campaigner of Congress at the national level : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టిన రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా ప్రముఖ నేత అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతో ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకునేందుకు షెడ్యూల్ ఖరారు చేస్తోంది. తాజాగా రెండు రోజుల పాటు కేరళలో ప్రచారం చేసేందుకు వెళ్తున్నారు. అక్కడి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారం చేయనున్నారు. మళ్లీ గురువారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ నెల 19వ తేదీన మహబూబ్ నగర్, మహబూబాద్ లో జరిగే బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
జాతీయ స్థాియలో గుర్తింపు తెచ్చుకున్న నేత రేవంత్ రెడ్డి
తెలంగాణలో నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ప్రచారంతో పాటు తమిళనాడుతో పాటు మొదటి మూడుదశల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నతర్వాత రేవంత్ రెడ్డికి పొరుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఇమేజ్ పెరిగిపోయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే రేవంత్ కు తెలుగువారిలో మంచి ఆదరణ ఉన్నందున.. కర్ణాటకలో ప్రాచరం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ రేవంత్ ప్రచారం చేయనున్నారు.
ఏపీలోనూ రేవంత్ రెడ్డి విస్తృత ప్రచారం ఉండే అవకాశం
ఇక ఏపీలో రేవంత్ రెడ్డి తెర వెనుక అయినా కీలకంగా వ్యవహిరంచి షర్మిలకు మద్దతుగా నిలవాల్సి ఉంది. ఇప్పటికే వైజాగ్ లో నిర్వహించిన బహిరంగసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కర్ణాటకలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగియగానే.. అక్కడి నేతలతో కలిసి ఏపీకి సీఎం రేవంత్ వస్తారని అంటున్నారు. నాలుగైదు సభలకు ఆయన హాజరుకావచ్చన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు.
హైకమాండ్ వద్ద పలుకుబడి పెంచుకున్న రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో ప్రముఖ నేతగా మారారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తెలుగువారు ఎక్కువగా ఉన్న చోట రేవంత్ రెడ్డితో ప్రచారం చేయించుకునే అవకాశం ఉంది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ స్థాయి అంతకంతకూ పెరుగుతున్న పరిణామాన్ని సూచిస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితునిగా పేరు పడిన రేవంత్ రెడ్డి.. లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి పదికిపైగా సీట్లు సాధించి పెడితే.. ఆయన పలుకుబడి హైకమాండ్ వద్ద మరింత గా పెరుగుతుంది.