AP PCC New Chief Kiran : వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?
ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్ కుమార్‌రెడ్డిని నియమించే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సోనియాతో కిరణ్ కుమార్ భేటీ తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నియమించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆయనను ఢిల్లీ పిలిపించిన సోనియా గాంధీ బాధ్యతలు తీసుకోవాలని సూచించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలో ఒక నాడు వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దారుణమయిన స్దితిలో ఉంది. పార్టీకి కార్యకర్తలు కూడా లేరు. కొందరు నాయకులు మాత్రం ఇంకా కాంగ్రెస్ ను వెంట పెట్టుకొని ఉన్నప్పటికి వారు హైదరాబాద్ కు మాత్రమే పరిమితం అయ్యారు. దీంతో ఎపీలో మారుతున్న పరిస్దితులకు అనుగుణంగా పార్టీని తిరిగి ఫాం లోకి తీసుకువచ్చేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది.
పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం కిరణ్‌ను నియమించే అవకాశం !
ఇప్పటి వరకు సాకే శైలజానాధ్ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ,ఎలాగొలా పార్టీని లాక్కొస్తున్నారు. అయితే ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటంతో చేసేది లేక ఆయన కూడా చేతులు ఎత్తేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అధిష్టానం కూడ కాంగ్రెస్ పార్టీని ఎపీలో తిరిగి నిలబెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తెరమీదకు తీసుకువస్తుందనే ప్రచారం జరుగుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి. ఆయన కూడా విభజన ను వ్యతిరేకిస్తూ సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి చెప్పు గుర్తు పై పోటీ చేశారు.
రెడ్డి సామాజికవర్గానికి అవకాశం వెనుక ప్రత్యేక వ్యూహం !
విభజన తరువాత ఎన్నికలకు వెళ్లి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు.ఆ తరువాత కాలక్రమంలో ఆయన కూడ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, కాంగ్రెస్ హై కమాండ్ తో టచ్ లో ఉంటూ ఎపీ రాజకీయాలను దగ్గరగానే గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ బేస్ ఓటు బ్యాంక్ అయిన రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే దిశగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పిలుపుతో కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్దితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎపీలో తిరిగి పుంజుకోవటం చాలా కష్టం.
వైఎస్ఆర్‌సీపీతో పొత్తుల దిశగా తొలి అడుగేనా?
కాంగ్రెస్ ను విభేదించి బయటకు వచ్చిన జగన్ సొంతంగా అదే కాంగ్రెస్ పేరుతో పార్టిని పెట్టి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు జగన్ తో పొత్తు పెట్టుకోవటం ద్వారా ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ వ్యూహత్మకంగా ముందడుగులు వేస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఎక్కడ పొగొట్టుకుంటే, అక్కడే వెతుక్కోవాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉందని అనుకోవచ్చు.