Cm Revanth Reddy: 'కేసీఆర్ కు జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తా' - తుక్కుగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana News: కేసీఆర్ ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకోనని.. ఆయన్ను చెర్లపల్లి జైలులో పెడతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Sensational Comments on Kcr: తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎలా ఓడించారో.. బీజేపీని అలాగే ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని.. జూన్ 9న ఢిల్లీలో మువ్వన్నెల జెండా ఎగరాలని అన్నారు. హైదరాబాద్ తుక్కుగూడలో (Tukkuguda) ఆదివారం నిర్వహించిన 'కాంగ్రెస్ జనజాతర' సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని.. వారి కష్టం వల్లే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని పేర్కొన్నారు. 'కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు. వారు ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటాం అని కేసీఆర్ అనుకుంటున్నారు. అలా ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు.. రేవంత్ రెడ్డిని. ఎలా పడితే అలా మాట్లాడితే కేసీఆర్ ను జైల్లో పెడతాం. ఆయనకు చెర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపించడం ఖాయం. నువ్వు పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టివ్వలేదు. నేను మాత్రం నీకు తప్పకుండా చెర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తా. ఆయన కాలు విరిగింది. కూతురు జైలుకెళ్లారని జాలి చూపించాం. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి నిధులు కావాలంటే రాష్ట్రంలో 14 మంది ఎంపీలను గెలిపించాలి.' అని రేవంత్ పేర్కొన్నారు.
'ఏది కావాలో తేల్చుకోండి'
'గుజరాత్ మోడల్ పై 'వైబ్రెంట్ తెలంగాణ' ఆధిపత్యం చూపడం ఖాయం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు 17 నెలలు పోరాడారు. ఈ క్రమంలో 750 మంది రైతులు చనిపోయినా.. బాధిత కుటుంబాలను మోదీ పరామర్శించలేదు. దేశ ప్రజలకు ఏం చేశారని బీజేపీకి ఓటు వేయాలి?. సోనియమ్మ తెలంగాణకు 6 గ్యారంటీలు ప్రకటించిన గడ్డపైనే రాహుల్ గాంధీ దేశానికి 5 గ్యారంటీలు ప్రకటించారు. తెలంగాణ స్ఫూర్తితో కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొద్దాం. దక్షిణ భారతం, ఉత్తర భారతం మధ్య చిచ్చు పెట్టి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర చేస్తోంది. గతంలో హైదరాబాద్ వరదల్లో మునిగితే కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేదు. వంద రోజుల్లో మేం మంచి పరిపాలన అందిస్తే తెలంగాణలో 14 లోక్ సభ స్థానాలు గెలిపించండి. తెలంగాణ సమాజం అభివృద్ధికి భవిష్యత్ తో నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. గంటకో డ్రస్ మార్చే మోదీ కావాలో.. ప్రజల కోసం దేశమంతా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ కావాలో నిర్ణయించుకోండి. ఈ ఎన్నికల్లో ఈడీ, ఐటీ, సీబీఐల మోదీ కుటుంబం గెలుస్తుందో.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబం గెలుస్తుందో చూద్దాం.' అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మేనిఫెస్టో ప్రకటన
మరోవైపు, తుక్కుగూడ వేదికగా రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికలకు 5 గ్యారంటీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. ‘తెలంగాణలో కొన్ని నెలల కిందట రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం మేం 6 గ్యారంటీలను ఇక్కడే తుక్కుగూడ వేదికగా ఆవిష్కరించాం. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల కోసం న్యాయ పత్రం పేరుతో హామీల మేనిఫెస్టోను ఆవిష్కరించాం. మేం ఇక్కడ చెప్పినప్పుడు కాంగ్రెస్ గ్యారంటీలు. కానీ తరువాత అవి ప్రజల గొంతు వినిపించిన గ్యారంటీలుగా మారాయి. రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అయినా చెప్పినట్లుగానే అమలు చేసింది కాంగ్రెస్ ’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Also Read: Hyderabad బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతకు సెక్యూరిటీ పెంచిన కేంద్రం, వై+ కేటగిరి భద్రత