Hyderabad బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతకు సెక్యూరిటీ పెంచిన కేంద్రం, వై+ కేటగిరి భద్రత
Y plus Security For Madhavi Latha: హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది.
Y plus Security For Hyderabad Lok Sabha BJP Candidate Madhavi Latha: హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు కేంద్రం సెక్యూరిటీ పెంచింది. మాధవీలతకు వై ప్లస్ భద్రత (Y Plus Security) కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మందికి పైగా CRPF భద్రతా సిబ్బంది ఆమె వెంట ఉంటారు.
ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి మాధవీలత బరిలోకి దిగుతున్నారు. అసదుద్దీన్ ఒవైసీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఎన్నికలు కావడంతో ముప్పు ఉంటుందని ఆమెకు పదకొండు మందితో కూడిన వై ప్లస్ భద్రతను కేంద్రం ఆమోదించింది. ఆరుగురు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు మాధవీలత వెంట ఉండి పహారా కాస్తారు. మరో ఐదుగురు భద్రతా సిబ్బంది బీజేపీ ఎంపీ అభ్యర్థి ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉంటారు.
ఎవరీ మాధవీ లత..
కోఠిలోని మహిళా కళాశాలలో కొంపెల్ల మాధవీ లత రాజనీతి శాస్త్రంలో ఎంఏ చదివారు. మాధవీ లత విరించి హాస్పిటల్స్ (Virinchi Hospitals) చైర్‌పర్సన్ గా సేవలు అందిస్తున్నారు. ఆమె ఒక ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్. తన పిల్లలకు హోమ్‌స్కూల్‌కు ఎంచుకున్నట్లు ఆమె చెబుతుండేవారు. ఆమె లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు. దాంతోపాటు మాధవీలత లతామా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా చాలా మందికి సుపరిచితురాలు.
హైదరాబాద్‌లోని తన లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో పలు ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార పంపిణీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా హింధూ ధర్మం, హిందూ సాంప్రదాయాలపై ఆమె మాట్లాడే మాటలు, ఇచ్చే ప్రసంగాలో ఎందరినో ఆకట్టుకున్నాయి. హైందవ సంస్కృతి, సాంప్రదాయాలపై ఆమె చేసే వ్యాఖ్యలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా అసదుద్దీన్ ను ఓడించి హైదరాబాద్ ఎంపీగా ప్రజలకు సేవలు అందిస్తానని ధీమా చెబుతున్నారు.