CM Jagan Political Meets : అధికారిక కార్యక్రమాల్లో రాజకీయం - విమర్శలను సీఎం జగన్ ఎందుకు లైట్ తీసుకుంటున్నారు ?
అధికారిక సభల్లో రాజకీయ విమర్శలు చేస్తున్నారు సీఎం జగన్ . ప్రజాధనంతో పార్టీ ప్రచారాన్ని చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ సీఎం జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు.
CM Jagan Political Meets : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో దాదాపుగా ప్రతి వారం ఓ సభ ఉండేలా చూసుకుంటున్నారు. ఏపీ వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. అయితే ఇవన్నీ అధికారిక సభలు. అంటే ప్రభుత్వ పథకాలను ప్రారభించడం లేదా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం వంటివి. అయితే సీఎం జగన్ ప్రతి సభలోనూ రాజకీయ ప్రసంగాలే ఎక్కువ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల్ని ఘాటుగా విమర్శిస్తున్నారు. దీంతో అవి రాజకీయ సభలా అనే డౌట్ అందరికీ వస్తోంది. దీనిపై విపక్ష పార్టీలు మండి పడుతున్నాయి. ప్రజాధనంతో సభలు పెట్టి రాజకీయ ప్రచారాలు చేయడం విపక్ష నేతల్ని దూషించడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. కావాలంటే పార్టీ పేరుతో బహిరంగసభలు పెట్టి ఏమైనా మాట్లాడవచ్చు కానీ.. ప్రభుత్వ కార్యక్రమానికి, పార్టీ కార్యక్రమానికి తేడా లేకుండా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ ప్రచార సభలుగా ప్రభుత్వ కార్యక్రమాలు!
అమ్మఒడి పథకానికి బటన్ నొక్కే కార్యక్రమానికి సీఎం జగన్ కురుపాం వెళ్లారు. ఆ సభకు పెద్ద ఎత్తున స్కూల్ పిల్లల్ని తరలించారు. ఎదురుగా అత్యధికులు పిల్లలే ఉన్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయన పెళ్లిళ్లు, పెళ్లాలు అంటూ మాట్లాడారు. దీనిపై సామాన్య ప్రజల్లోనూ విస్తృతమైన చర్చ జరిగింది. అసలు పిల్లలకు రాజకీయాలకు సంబంధం ఏమిటని.. ఇలా ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేత ప్రసంగించవచ్చా అన్న చర్చలు జరిగాయి. అయితే సీఎం జగన్ ఇలా అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడటం అదే తొలిసారి కాదు. మొదటి నుంచి అంతే. అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నా ప్రభుత్వ కార్యక్రమాలను వైఎస్ఆర్‌సీపీ ప్రచార సభలుగానే నిర్వహిస్తున్నారు.
పార్టీకి , ప్రభుత్వానికి మధ్య తేడా లేదని సీఎం భావిస్తున్నారా ?
పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనేది అందరూ అనుకుంటారు. అయితే సీఎం జగన్ పరిపాలన శైలి చూస్తే.. పార్టీ వేరు.. పరిపాలనా వేరు కాదని అనుకుంటున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా వైఎస్ఆర్‌సీపీ రంగులు ఉంటాయి. వేదికపై ఆ పార్టీ నేతలకు ప్రాధాన్యం లభిస్తుంది. ప్రసంగాలు కూడా పూర్తిగా రాజకీయ పరంగా సాగుతాయి. ఇదంతా తెలియక కాదని.. ఆ మాత్రం తెలియుకుండా ఉండదని.. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాలను నిర్వహించి.. సభలు పెట్టి విపక్షాలను ఎలా విమర్శించినా దానికో లెక్క ఉంటుంది. కానీ ఇలా అధికారిక సభల్లో విమర్శించడమే విమర్శలకు కారణం అవుతోంది.
ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాల్లోనూ వైఎస్ఆర్‌సీపీ ప్రచారాలు
సీఎం జగన్ పార్టీ నేతలతో సమావేశమై.. నియోజకవర్గంలో పరిస్థితులపై చర్చించారనుకుందాం. వైసీపీ మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలన్నది వారితో మాట్లాడతారనుకుందాం.. అప్పుడు అది ఏ కార్యక్రమం అవుతుంది. ఖచ్చితంగాపార్టీ కార్యక్రమం అవుతుంది. కానీ అది ఓ ప్రభుత్వ శాఖ పై జరిపిన సమీక్ష అన్నట్లుగా సీఎంవో సోషల్ మీడియా ఖతాల్లో పోస్ట్ చేస్తారు. దీనిపైనా ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గడం లేదు. ఇదే రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. అధికార దుర్వినియోగం అనే ఆరోపణలు వచ్చినా.. డోంట్ కేర్ అంటున్నారు.
క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, రీజినల్ కో ఆర్డినేటర్లతో సీఎం శ్రీ వైయస్.జగన్ సమావేశం. గడపగడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై వర్క్‌షాప్ నిర్వహణ. pic.twitter.com/LD4QXtfMPK
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 21, 2023