Dharmavaram Politics: ధర్మవరంలో పొలిటికల్ హీట్ - ఇండిపెండెంట్ గా నిలబడేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే
Andhrapradesh Politics: అనంతపురం జిల్లా ధర్మవరంలో పొలిటికల్ హీట్ నెలకొంది. టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ ఇండిపెండెంట్ గా నిలబడతానని తెలిపారు.
Political Heat In Dharmavaram: అనంతపురం జిల్లా ధర్మవరం (Dharmavaram) నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. నువ్వా నేనా అన్నట్లుగా నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ధర్మవరం పీఠం దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ధర్మవరం రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారబోతోంది.
బరిలో ఆ అభ్యర్థి
మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ కూటమి అభ్యర్థిగా ధర్మవరం టికెట్ ఆశించి బంగపడ్డారు. తొలుత టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జీ పరిటాల శ్రీరామ్ అభ్యర్థి అని అంతా అనుకున్నారు. అయితే, టీడీపీ - బీజేపీ - జనసేన పొత్తులో భాగంగా.. బీజేపీ 6 పార్లమెంట్ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు కోరింది. అలాగే, ధర్మవరం అసెంబ్లీ స్థానం కోసం కూడా బీజేపీ పట్టుబట్టింది. కూటమి నేతలు కూడా ధర్మవరం నియోజకవర్గాన్ని బీజేపీకే కేటాయించారు. దీంతో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ (Gonuguntla Suryanarayana) పోటీ దాదాపుగా ఖరారైంది. అలాంటి తరుణంలో అనుకోని పరిణామాలతో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను ధర్మవరం కూటమి అభ్యర్థిగా ప్రకటించారు.
'ఎన్నికల బరిలో నిలబడతా'
ధర్మవరం టికెట్ ఆశించిన ఆఖరి నిమిషంలో మరొకరికి కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ ఇండిపెండెంట్ గా బరిలో నిలిచేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఆదివారం నియోజకవర్గంలోని తన కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. టికెట్ రాకుండా కొందరు నేతలు కుట్రలు పన్నారని సమావేశంలో చర్చించారు. పరోక్షంగా పరిటాల కుటుంబ సభ్యులు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. గతంలో కూడా 2009 ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ రాకుండా అడ్డుకున్నారని నాడు కూడా నేటి పరిస్థితే ఎదురైందని గుర్తు చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచి 44 వేల ఓట్లు సాధించామని అన్నారు. ప్రస్తుతం కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవాలని గోనుగుంట్ల భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగా నియోజకవర్గంలో కార్యాచరణ కూడా ప్రారంభించినట్లు సమాచారం.
'ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహించను'
'2009 ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మవరం నియోజకవర్గం ఇంఛార్జీగా నన్ను నియమించారు. అనంతరం కొందరు ఉద్దేశపూర్వకంగా నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలను రెచ్చగొట్టారు. ఆ ఫ్యాక్షన్ రాజకీయాల్లో ధర్మవరం నియోజకవర్గంలో 10 హత్యలు కూడా జరిగాయి. చంద్రబాబు ఆశీస్సులతో 2014 ఎన్నికల్లో ధర్మవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిచాను. గెలిచిన అనంతరం మొట్టమొదటిగా నియోజకవర్గంలో ఫ్యాక్షన్ ను రూపుమాపేందుకు పటిష్ట చర్యలు చేపట్టాను. ఫ్యాక్షన్ రాజకీయాల ద్వారా కుటుంబాలు రోడ్డున పడతాయి తప్ప బాగుపడవని అర్థం అయ్యేలా వివరించి ధర్మవరంలో ఫ్యాక్షన్ రాజకీయాలను రూపు మాపాను. 2014 ఎన్నికల అనంతరం ధర్మవరం నియోజకవర్గాన్ని రూ.4,500 కోట్లతో అభివృద్ధి చేశా.' అని గోనుగుంట్ల వివరించారు. నా ప్రాణం ఉన్నంతవరకు ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని చెప్పారు. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ కుట్రలు, కుతంత్రాలను అధిష్టానానికి తెలియజేశానని.. ధర్మవరం టికెట్ పై అధిష్టానం పునరాలోచిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలా కాని పక్షంలో ధర్మవరం ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు ఎన్నికల బరిలో నిలుస్తానని.. ఎమ్మెల్యేగా కూడా గెలుస్తానని గోనుగుంట్ల సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Nara Lokesh: 'జెడ్' కేటగిరీ భద్రతలో నారా లోకేశ్ - కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు