Bandi Sanjay : అంబేద్కర్ జయంతి రోజు నుంచి రెండో విడత సంగ్రామ యాత్ర - ఇక తగ్గేదే లేదంటున్న బండి సంజయ్
పాదయాత్ర రెండో విడతకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు బండి సంజయ్. బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ ఓటు బ్యాంక్ పెరుగుతోందన్నారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో విడత పాదయాత్రకు ముహుర్తం ఖరారు చేసుకుకున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ప్రజా సంగ్రామ యాత్రకు సన్నద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని బీజేపీ అధ్యక్షుడు నిర్ణయించుకున్నారు. మొదటి విడత పాదయాత్ర 36 రోజులు పాటు సాగింది. రెండో విడతలో 200 రోజుల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు బండి సంజయ్. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రెండో విడత పాదయాత్ర చేసే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జోనల్ నేతల సమావేశంలో బండి సంజయ్ పార్టీ కేడర్‌కు కీలక సూచనలు చేశారు ఈ నెల 6 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామని తొలుత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ జనగామ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదన్నారు. అదే జనగామలోనే మార్చి నెలాఖరులో బీజేపీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ సత్తా చూపిస్తామని చాలెంజ్ చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన తప్పుడు అఫిడవిట్ పై ఫిర్యాదు చేసిన వారిని పోలీసులే కిడ్నాప్ చేయడం దారుణమని.. సీఎం కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలతో పోలీసులు ఫిర్యాదు దారులను పోలీసులే కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ మంత్రి తప్పుడు అఫిడవిట్ పై ఎన్నికల కమిషన్ విచారణ ముగిసే వరకుల 6 గురు ఫిర్యాదు దారులను జైళ్లో పెట్లడమే లక్ష్యంగా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.
చట్టబద్దంగా కొట్లాడే ధైర్యం లేని సీఎం అడ్డగోలుగా గెలిచి అవినీతికి పాల్పడుతున్న మంత్రికి వత్తాసు పలుకుతూ కిడ్నాప్ లు చేయించడం సిగ్గుచేటని బీజేపీ ఇలాంటి దారుణాలను అడ్డుకుని తీరుతుందని ప్రకటించారు. శ్రీనివాస్ గౌడ్ మంత్రి రాజీనామా చేసే వరకు పార్టీ పరంగా ఆందోళనలను కొనసాగిస్తామన్నారు. రాబోయే రోజుల్లో మంత్రులతోపాటు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉద్యమిస్తామని ప్రకటించారు. గత ఎన్నికలకు ముందు ఆయా నేతలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో చూపిన ఆస్తులను, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యాక సంపాదించిన ఆస్తులను బేరీజు వేసి వాటి ఆధారంగా విచారణ జరిగేదాకా ప్రజా క్షేత్రంలో పోరాడతామన్నారు.
బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలవల్లే బెంగాల్ లో బీజేపీ ఓట్ల శాతం 40 శాతం దాటిందని.. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతోందని గుర్తు చేశారు. హైదరాబాద్ సిటీలో బీజేపీ ఓటు బ్యాంక్ 60 శాతానికి పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. గత ఎన్నికల ఫలితాలతోపాటు వివిధ సర్వేల్లో వెల్లడైన ఫలితాలే నిదర్శనమన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియడంతో సీఎం కేసీఆర్ బోగస్ సర్వే ఫలితాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నరు. ఎప్పుడు ఎన్నికలెప్పుడొచ్చినా...బీజేపీ సిద్ధం.ఈసారి అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట పెరుగుతోందని భారత జాతి పతకాన్ని చూసి రష్యా, ఉక్రెయిన్ దేశాలు సైతం లేచి సెల్యూట్ చేసే పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు.