Andhra Pradesh: వైసీపీ రాజ్యసభ ఎంపీలు సిద్ధమా? చంద్రబాబు మళ్లీ ఆ తప్పు చేస్తారా?
YSRCP MPs: వైసీపీ రాజ్యసభ ఎంపీల గోడలు దూకేందుకు సిద్ధమవుతున్నారా లేకా చంద్రబాబును టార్గెట్ చేస్తూ జగన్ కొత్త రాజకీయానికి తెరలేపారా?
Chandra Babu: ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజార్టీతో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు పాలన వ్యవహారాలతో టీడీపీ అధినే చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడం, హామీల అమలుపైనే తన ప్రధాన ఫోకస్ అంతా ఉంది. ఈ పరిస్థితిలో వైసీపీ అధికారిక మీడియాగా చెప్పుకున్న ఓ పేపర్‌లో వార్త సంచలనంగా మారింది. నిప్పులేనిదే పొగరాదనే సామెతను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
వైసీపీ రాజ్యసభ ఎంపీలను కొనేందుకు చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని ఆ పత్రికలో వచ్చిన వార్త సారాంశం. ఇప్పటికిప్పుడు రాజ్యసభ ఎంపీలతో టీడీపీకి ఏంటి పని? గతంలో చేసిన తప్పును చంద్రబాబు మళ్లీ చేస్తారా? అచ్చిరాని రాజ్యసభ ఎంపీల జోలికి మళ్లీ వెళ్తారా అన్నది అనుమానంగా ఉంది.
ఈ విషయంపై టీడీపీ నేతలతో మాట్లాడితే... వైసీపీలో చాలా మంది నేతలు కూటమి పార్టీల్లోకి వచ్చేందుకు ఉత్సాహంతో ఉన్నారని అంటున్నారు. అలాంటివి నివారించేందుకు ముందస్తుగా ఇలాంటి స్టోరీలు వండుతున్నారని ఆరోపిస్తున్నారు. బురదజల్లే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. అయితే రాజ్యసభ ఎంపీలతో తమకు పని లేదని కొనేంత అవసరం కూడా తమకు లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. పూర్తి మెజార్టీతో ఉన్న ప్రభుత్వానికి వేరే పార్టీ నేతలతో పనేంటని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ నేతల వాదన వేరేలా ఉంది. 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న జగన్ ఎక్కడ రోడ్లపైకి వస్తారో అన్న భయంతో టీడీపీ ఉందని ఆరోపిస్తున్నారు. హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తిసిన చంద్రబాబు జనం దృష్టిని మరల్చేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారని అంటున్నారు. గతంలో కూడా కొనుగోలు జరిపారని గుర్తు చేస్తున్నారు. కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించలేదని అంటున్నారు.
ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా?
వైసీపీ వ్యవహారాలను ఒక్కసారి పరిశీలిస్తే... 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఒక్కసారిగా డీలా పడిపోయింది. గెలుస్తామని వందకు వంద శాతం నమ్మకంతో ఉన్న వాళ్లు ఫలితాలు చూసి నీరుగారిపోయారు. ఇప్పటికీ చాలా మంది బయటకు రావడం లేదు. ధర్మాన లాంటి వాళ్లు రాజకీయాలే వద్దని అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. రోశయ్య, మద్దాలి గిరి, సిద్ధారాఘవరావు, అలీ లాంటి వాళ్లు పార్టీకి రాజీనామా చేసి దణ్ణం పెట్టి వెళ్లిపోతున్నారు.
ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు కూడా అదే తీరుగా ఆలోచిస్తున్నారని టాక్ నడుస్తోంది. కొందరు జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యాపారాలు, ఉన్న కేసుల వ్యవహారాలు వారిని పక్క చూపులు చూసేలా చేస్తున్నాయి. అలాంటి వాళ్లు కూటమిలోని ఏదో పార్టీకి వెళ్లే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీలో కూడా లుకలుకలు ఉన్నాయని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. ఇన్ని రోజులు అధికారంలో ఉన్నందున ఆ విషయం పెద్దగా చర్చకు రాలేదు. అయితే ఈ మధ్య వెలుగు చూసిన ఓ అంశంపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. తన పార్టీ నేతలకి కూడా వార్నింగ్ ఇచ్చారు. తన వ్యక్తిత్వంపై బురదజల్లుతున్న వాళ్లు సొంతపార్టీ వాళ్లైనా సరే వదిలిపెట్టనని హెచ్చరించారు.
సమస్యలు ఉన్న పార్టీలో ఉండకూడదనే ఆలోచన కావచ్చు, లేదా అధినాయకత్వం వ్యూహం కావచ్చు కానీ కొందరు నేతలైతే మాత్రం పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని తెలుస్తోంది. మరికొందరు సైలెంట్‌గా ఉంటూ తమ పనులు కానిచ్చేస్తున్నారు.
పార్టీ ఎంపీలు ఎటు వెళ్తారు?
వైసీపీ రాజ్యసభ ఎంపీలు పార్టీ మారాలనే ఆలోచన చేస్తే మాత్రం కచ్చితంగా వాళ్ల చూపు బీజేపీవైపే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో రాజ్యసభలో బీజేపీ బలం పడిపోయిందని అందుకే వారికి కచ్చితంగా ఎంపీల అవసరం ఉంది. గతంలో టీడీపీ అనుసరించిన వ్యూహాన్నే వైసీపీ అనుసరించే ఛాన్స్ ఉందంటున్నారు. బీజేపీ భుజాన తుపాకీ పెట్టి చంద్రబాబుపై గురిపెట్టిందని చెబుతున్నారు. టీడీపీలో చేరితే చంద్రబాబు కొనుగోలు చేశారని... బీజేపీ, జనసేనలోకి వెళ్తే చంద్రబాబు మధ్యవర్తిత్వం వహించారనే ప్రచారానికి వైసీపీ తెరతీసింది.
టీడీపీ అదే తప్పు చేస్తుందా?
ఇప్పటికిప్పుడు రాజ్యసభ ఎంపీలను తీసుకునే ఆలోచన టీడీపీకి లేదని చెబుతున్నారు. అయితే రాజ్యసభలో సభ్యులు లేరని అనుకున్నా... అసలు ఆ అవసరం ఏంటని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు ఒకవిధంగా చూస్తే టీడీపీకి రాజ్యసభ ఎంపీలు అచ్చిరాదనే సెంటిమెంట్ ఉండనే ఉంది. ఆ పదవి ఇచ్చిన వాళ్లు ఎవరూ పార్టీతో ఎక్కువ కాలం ట్రావెల్ కాలేదు. చివరకు కీలకమైన నేతలుగా ఉన్న సుజనా, రమేష్ లాంటి వాళ్లు కూడా బీజేపీలోకి వెళ్లిపోయారు. ఏకంగా రాజ్యసభ పార్లమెంటరీ పార్టీనే విలీనం చేసేశారు.
అందుకే రాజ్యసభపై చంద్రబాబు అంత ఆసక్తి లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉన్న వారికి పదవులు సర్దలేక ఇబ్బంది పడుతుంటే కొత్త వారిని తెచ్చి ఏ పదవులు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు 2014 తర్వాత చాలా మంది ఇలా పార్టీలోకి వచ్చి వెళ్లిపోయారని గుర్తు చేస్తున్నారు. ఇది కూడా 2019లో ఓటమికి కారణమని అంటున్నారు. నేతలను తీసుకోవడంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న చంద్రబాబు అలాంటి తప్పు మళ్లీ చేస్తారని అనకోవడం లేదని పార్టీ నేతలు అంటున్నారు.