Kurnool: కర్నూలు నుంచి మంత్రి పదవి ఎవరికి? సామాజిక వర్గాల వారీగా ఎవరికి దక్కే ఛాన్స్ ఉందంటే
Kurnool జిల్లా వైఎస్ కుటుంబానికి ఎప్పుడు అండగానే నిలుస్తూ వస్తుంది. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.
AP Cabinet Reshuffle: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రి వర్గ విస్తరణపై క్లారిటీ ఇవ్వడంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాగైనా తాము మంత్రి కావాలనే ఉద్దేశంతో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో మంత్రి రేసులో ఉన్న వారిపై ప్రత్యేక కథనం.
కర్నూలు జిల్లా వైఎస్ కుటుంబానికి ఎప్పుడు అండగానే నిలుస్తూ వస్తుంది. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వలోని కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చాయి. ఆయన తరువాత 2014 లో టీడీపీ హయంలో కూడా 11ఎమ్మెల్యే స్థానాలు వైసీపీనే జిల్లాలో గెలుచుకుంది. వైఎస్ జగన్ పాదయాత్ర తరువాత 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లాను స్వీప్ చేసింది. 14కు 14కు ఎమ్మెల్యే స్థానాలు వైసీపీకే వచ్చాయి. రెండు పార్లమెంటు సీట్లు కూడా వైసీపీకే దక్కాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో శిల్పా మోహన్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేయగా, రోశయ్య మంత్రి వర్గంలో టీజీ వెంకటేష్, ఏర్రాసు ప్రతాప్ రెడ్డి మంత్రులుగా సేవలు అందించారు. టీడీపీ ప్రభుత్వంలో కేఈ కృష్ణమూర్తి మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం ప్రస్తుతం మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు.
రేసులో సీనియర్లు
ఈ ఉగాదికి కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తుండడంతో జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యేలు, కొత్త ఎమ్మెల్యేలు మంత్రి రేసులో పడ్డారు. కర్నూలు, నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి రేస్ లో ఉన్నారు. మరోవైపు నంద్యాల పార్లమెంట్ పరిధిలో శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి రేస్ లో ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి కర్నూలు పరిధిలో డా.సుధాకర్, నంద్యాల పరిధిలో నుంచి ఆర్థర్ ఉన్నారు. మైనారిటీకి ఇవ్వాలని చూస్తే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ లైన్ లో ఉన్నారు. అయితే వీరంతా మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన సీనియర్లకు ఇస్తారా లేదా సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా కొత్తవారికి మంత్రి పదవి ఇస్తారా అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.