3 Years of YSR Congress Party Rule : ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఏమిటి ? జగన్ విధానాలే నష్టం చేశాయా ?
ఏపీలో విద్యుత్ సంక్షోభం మూడేళ్ల జగన్ పాలన వల్లే ఏర్పడిందా ? రివర్స్ నిర్ణయాలతోనే కరెంట్ కొరత ఏర్పడిందా?
![3 Years of YSR Congress Party Rule : ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఏమిటి ? జగన్ విధానాలే నష్టం చేశాయా ? 3 Years of YSR Congress Party Rule : Was the power crisis in AP caused by the three-year Jagan rule? Was the current shortage caused by reverse decisions? 3 Years of YSR Congress Party Rule : ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఏమిటి ? జగన్ విధానాలే నష్టం చేశాయా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/27/e355f59415ff01da83cc734769c68c8b_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
3 Years of YSR Congress Party Rule : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సమస్య ఇప్పుడు ప్రజలకు అనేక కష్టాలను తెచ్చి పెడుతోంది. గంటల తరబడి కరెంట్ కోతలు ఉంటున్నాయి. అవన్నీ అనధికారిక కోతలే. లోడ్ రిలీఫ్ పేరిట కోత విధిస్తున్నారు. ఇటీవల నెరన్నర పాటు పవర్ హాలీడే ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వడం అసాధ్యమే. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి.
రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ మిగులు రాష్ట్రం ఏపీ !
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రం. అందుకే తెలంగాణకు అధిక కరెంట్ వాటా ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఏపీ కరెంట్ సంక్షోభంలో చిక్కుకుంది. ఏపీలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోందని దానికి తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి బొగ్గు ఉండటం లేదు. ఏపీ విద్యుత్ సంస్థలు సామర్థ్యం మేర విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదని సగం మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 8 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు బొగ్గు ఆధారిత ప్లాంట్లతో ఉన్న ఒప్పందాలను వినియోగించుకోలేకపోతున్నామని స్వయంగా సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు.
డిమాండ్ పెరిగేతే కరెంట్ కోతలే !
ఏపీలో డిమాండ్ పెరిగితే కరెంట్ కోతలు అనివార్యంగా మారాయి. ఏప్రిల్ నెలలో పల్లెల్లో 11-14 గంటలు, పట్టణాల్లో 5-8 గంటలు, నగరాల్లో 4-5 గంటలు చొప్పున అనధికార విద్యుత్ కోతలు అమలు చేశారు. 2014-19 మధ్య విద్యుత్ కోతల ప్రభావం పెద్దగా ఉండేది కాదు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసింది. యూనిట్ రెండు రూపాయిలకే గ్రీన్ ఎనర్జీనీ తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు కోల్ ఎనర్జీని రూ.12 పెట్టి కొనుగోలు చేస్తోంది. అయినా సమస్యలు తీరడం లేదు.
తెలంగాణలో లేని సమస్య !
రాష్ట్రం విడిపోతే తెలంగాణ విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోతుందని అప్పట్లో నిపుణులు విశ్లేషించారు. తర్వాత జరిగింది ఓ చరిత్ర. ఏపీలో విద్యుత్ సమస్యలు వస్తున్నాయి కానీ తెలంగాణలో మాత్రం రావడం లేదు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం తంటాలు పడుతోంది. నేడు.. రేపు అని వాయిదా వేస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం 24 గంటల విద్యుత్ వ్యవసాయానికి అందుతోంది. ఎక్కడా సంక్షోభంలో ఉన్న దాఖలాల్లేవు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు ఎక్కువగా ఏపీలో ఉన్నాయి. ఈ కారణంగా విద్యుత్‌ను జనాభా ప్రాతిపదికన కాకుండా అవసరాల ప్రాతిపదికన విభజన చట్టంలో పంచారు. తరవాత తెలంగాణ తీసుకుంటున్న కరెంట్‌కు డబ్బులివ్వలేదని ఆపేశారు. అయితే తెలంగాణ పట్టించుకోలేదు. విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుంది. వ్యూహాత్మకంగా విద్యుత్ రంగంలో నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఇప్పుడు తెలంగాణకు కరెంట్ కోరత అనే ప్రశ్న వినిపించడం లేదు.
ఉత్పత్తి తగ్గించి బయట కొనడం వల్లే సమస్య !
దేశంలో విద్యుత్ కొరతకు ప్రధానంగా బొగ్గు కొరత కారణంగా ఉంది. తెలంగాణలోనే సింగరేణి ఉంది. సింగరేణి ఉత్పత్తికి వచ్చిన కొరతేమీ లేదు. కానీ విద్యుత్ సంస్థలు డబ్బులు చెల్లించడం లేదు. రూ. ఐదు వేల కోట్ల వరకూ వివిధ రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలు సింగరేణికి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏపీ కూడా పెద్ద ఎత్తున చెల్లింపులు చేయాల్సి ఉంది. కానీ బొగ్గు అవసరం లేదన్నట్లుగా ఏపీ ప్రభుత్వం, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వ్యవహరించి బయట కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పరిస్థితి మారిపోయింది. అప్పట్లో తక్కువకే బయట దొరికిన విద్యుత్ ఇప్పుడు ఎంత పెట్టి కొన్నా దొరకని పరిస్థితి. బొగ్గు కొనకుండా ఉత్పత్తి నిలిపివేయడంతో ఇప్పుడు మరింత సమస్య పెరుగుతోంది. తాత్కాలిక లాభాలు చూసుకోకుండా ... దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముందడుగు వేసి ఉంటే కరెంట్ కష్టాలు వచ్చేవి కావు. ఇప్పటి వరకూ సొంత ఉత్పత్తి కేంద్రాల్లోనూ ఉత్పత్తి చేయకుండా బయట కొనడానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఫలితంగా ఇబ్బందులెదురవుతున్నాయి.
సాగుకు తొమ్మిది గంటలు కష్టమే !
వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని సీఎం జగన్ సంకల్పం. కానీ ఎక్కడా అమలు కావడం లేదు. అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతులు పొలాల్లోనే బోర్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి పగలే నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తామన్న హామీ కూడా ఉత్తదేనని తేలిపోయింది. ఇష్టారీతిన కోతలు పెడుతుండటంతో ఇటు ప్రజలు, అ టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల సబ్ స్టేషన్ల దగ్గర రైతులు కన్నీరు పెట్టుకుంటున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఉత్పత్తి మెరుగుపడకపోతే కరెంట్ కష్టాలు పెరుగుతాయన్న ఆందోళన ఉంది. ఈ విషయంలో జగన్ మూడేళ్ల పాలనలో ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని చెప్పక తప్పదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)