Arvind Kejriwal: మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
Delhi Election Results 2025 | ఢిల్లీ ఎన్నికలలో ఆప్ ఓడటం మాత్రమే కాదు, కేజ్రీవాల్ సైతం ఎమ్మెల్యేగా ఓటమి చెందడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

Delhi Elections Results 2025 | కర్ణుడి చావుకు 100 కారణాలు ఉంటాయన్నట్లుగా.. ఢిల్లీలో నాలుగోసారి అధికారం చేజిక్కించుకోవాలనుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి సైతం చాలా కారణాలున్నాయి. కానీ ప్రధాన కారణం మాత్రం ప్రజలకు తెలుసు. ఏ అవినీతి నిర్మూలన అనే అజెండాతో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) 12 ఏళ్ల కిందట ఊపిరి పోసుకుందో.. ఆ పార్టీ మూడుసార్లు ఢిల్లీ ప్రజల మనసు గెలుచుకుంది. కానీ ఆ పార్టీతో పాటు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సైతం తాజా ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణం లిక్కర్ స్కామ్ లాంటి అవినీతి అరోపణలు రావడమే.
ఆప్, కేజ్రీవాల్ ఓటమికి కారణాలివే..
ఢిల్లీనే కాదు తన బలాన్ని పంజాబ్, గోవాలకు సైతం పెంచుకున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు తన పునాది అయిన ఢిల్లీని ఆప్ కోల్పోవటానికి కారణం కేజ్రీవాల్ ప్రభుత్వం మీద తుడుచుకోలేనంత బలంగా పడిపోయిన అవినీతి మరకలు. కేజ్రీవాల్ అవినీతి చేశారా లేదా అనేది ఇంకా తేలలేదు. ఢిల్లీ లిక్కర పాలసీ స్కామ్ లాంటి కేసులను కోర్టులే తేలుస్తాయి. కానీ లిక్కర్ స్కామ్ కేసు ఆప్ పార్టీని ప్రజల దృష్టిలో పలుచన చేసిందనే వాస్తవాన్ని మనం గమనించాలి.
ఓ సారి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) టైమ్ లైన్ చూడండి. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పై ఢిల్లీ ప్రజల్లో ఆదరణ గత 3 ఎలక్షన్స్ లో పెరిగింది కానీ ఎప్పుడూ తగ్గలేదు. 2013లో అప్పుడే పెట్టిన పార్టీ ఆప్ ఎన్నికల్లో పోటీ చేసి 28 స్థానాలు గెలిచి, కాంగ్రెస్ సాయంతో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అసలు ఏ పార్టీ పొత్తే అవసరం లేని రేంజ్‌కు వెళ్లిపోయింది. ప్రజలు సైతం ఆప్ వెంటే ఉన్నారు. 2015లో 70కి 67 స్థానాలు చీపురు పార్టీ ఆప్ ఊడ్చేసింది. 2020లో కూడా 70 స్థానాలకుగానూ 62 స్థానాల్లో గెలిపించి మూడోసారి పట్టం కట్టారు.
కానీ ఈసారి మాత్రం అలా కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా కీలక మంత్రితో పాటు ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్లడంతో ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి చేసిందనే అభిప్రాయాన్ని బీజేపీ నేతలు బలంగా తీసుకువెళ్లగలిగాయి. ఫలితమే ఏ అవినీతి నిర్మూలన సిద్ధాంతంతో రాజకీయాల్లోకి వచ్చి కొత్త చరిత్ర సృష్టించిన కేజ్రీవాల్.. ఇప్పుడు అదే అవినీతి మరకలతో గద్దె దిగాల్సి వచ్చింది.






















