Delhi Elections Results 2025 | Delhi గద్దె Arvind Kejriwal దిగిపోయేలా చేసింది ఇదే | ABP Desam
కర్ణుడి చావుకు వంద కారణాలు అంటారు. అలా ఢిల్లీలో నాలుగోసారి అధికార పీఠం ఎక్కాలనుకున్న కేజ్రీవాల్ ఓటమికి వంద కారణాలున్నాయి. కానీ ప్రధాన కారణం మాత్రం చెప్పుకోవాలి. ఏ అవినీతి నిర్మూలన అనే అజెండాతో ఆమ్ ఆద్మీ అనే పార్టీ 12ఏళ్ల క్రితం ఊపిరి పోసుకుందో..మూడుసార్లు ఢిల్లీ ప్రజల మనసు గెలుచుకుందో ఆ పార్టీ ఇప్పుడు ఓడిపోవటానికి కారణం అదే అవినీతి అరోపణలు. ఎస్ ఢిల్లీనే కాదు తన బలాన్ని పంజాబ్, గోవాకు పరుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ..ఇప్పుడు తన పునాది అయిన ఢిల్లీని కోల్పోవటానికి కారణం కేజ్రీవాల్ మీద తుడుచుకోలేనంత బలంగా పడిపోయిన అవినీతి మరకలు. కేజ్రీవాల్ అవినీతి చేశాడని మేం చెప్పట్లేదు. ఆ విషయాన్ని కోర్టులే తేలుస్తాయి. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజల దృష్టిలో పలుచన చేసిందనేది మాత్రం వాస్తవం. ఓ సారి ఆమ్ ఆద్మీ పార్టీ టైమ్ లైన్ చూడండి. కేజ్రీవాల్ పై ప్రజల్లో ఆదరణ గత మూడు ఎలక్షన్స్ లో ఎప్పుడూ తగ్గలేదు. 2013లో అప్పుడే పార్టీ పెట్టి ఎలక్షన్స్ లోకి దిగి పోయిన 28 స్థానాలు ఇచ్చి..కాంగ్రెస్ సాయంతో అధికార పీఠాన్ని కట్టబెట్టిన ప్రజలు..2015, 2020ల్లో మాత్రం అసలు ఏ పార్టీ పొత్తే అవసరం లేని స్థాయి మేండేట్ ను ఇచ్చారు. 2015లో 70కి 67 స్థానాలు చీపురు పార్టీనే ఊడ్చేసింది. 2020లో కూడా 70కి 62 స్థానాలతో మూడోసారి పట్టం కట్టబెట్టింది. కానీ ఈసారి మాత్రం అలా కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా లాంటి మంత్రి, ఆఖరకు సీఎంగా ఉన్న కేజ్రీవాల్ కూడా జైలు పాలు కావటంతో ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి చేసిందనే అభిప్రాయాన్ని ప్రతిపక్షాలు బలంగా తీసుకువెళ్లగలిగాయి. ఫలితమే ఏ అవినీతి నిర్మూలన సిద్ధాంతంతో రాజకీయాల్లోకి వచ్చి ఓ కొత్త మార్పును కేజ్రీవాల్ తీసుకువచ్చారో ఇప్పుడు అదే అవినీతి మరకలు కేజ్రీవాల్ కు గద్దె దింపి తాత్కాలిక విరామాన్ని ఇచ్చాయి.





















