Delhi Elections 2025: ‘బీజేపీని మళ్లీ గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్’.. కేటీఆర్ పోస్ట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘బీజేపీని మరోసారి గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్’ అంటూ పోస్ట్ పెట్టారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘బీజేపీని మరోసారి గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్’ అంటూ పోస్ట్ పెట్టారు. దీనికి రాహుల్ గాంధీ గురించి ఆయన గతంలో మాట్లాడిన ఓ వీడియోను ట్యాగ్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలోనే కేటీఆర్ ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.
బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనే..
మరోసారి బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పోస్ట్‌కు గతంలో తాను ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూను కేటీఆర్ జతచేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవరైనా ఉంటే అది రాహుల్ గాంధీనే అని ఎద్దేవా చేశారు.
బీజేపీని నిలువరించే సత్తా రాహుల్‌కు లేదు
ఆ వీడియోలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీకి బీజేపీని నిలువరించే సత్తా లేదు. ఒకవేళ ఆయనకు ఆ దమ్ము ఉంటే వెళ్లి ఉత్తర్‌ప్రదేశ్‌లో, గుజరాత్లో, బిహార్‌లో ఆ పార్టీతో కొట్లాడాలి. కానీ అలా చేయకుండా తెలంగాణకు వచ్చి బీజేపీని నిలువరించే సత్తా ఉన్న నేతలతో పోరాడతానంటారు. దేశంలో మోదీకి ఉన్న అతి పెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనే. ఆయన లాంటి వ్యక్తి ఉన్నంతకాలం నరేంద్ర మోదీ ఏమైనా చేయలరు. ఎంతకాలమైనా దేశాన్ని పాలించగరు’ అని అన్నారు.
అస్త్రసన్యాసం చేసే రాహుల్ గాంధీ అసలు నాయకుడేనా?
ప్రస్తుతం దేశంలో బీజేపీని నిలువరించేవి అవి కేవలం రీజినల్ పార్టీలు, స్ట్రాంగ్ లీడర్లైన కేసీఆర్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ స్టాలిన్ లాంటి వారు మాత్రమేనన్నారు. దేశమంతా భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ గుజరాత్లో ఎందుకు చేయలేదని అడిగారు. మ్యాచ్ ఫిక్సింగా లేక మోదీ అంటే రాహుల్‌కు భయమా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అస్త్రసన్యాసం చేసే రాహుల్ గాంధీ అసలు నాయకుడేనా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి నేత ముందుండి నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ మోదీని ఏం ఎదుర్కొంటుంది, బీజేపీని ఎలా ఓడిస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
బీజేపీ 45.. ఆమ్ ఆద్మీ 5
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 36 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. బీజేపీ 45 స్థానాల్లో లీడింగ్‌లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు ఇంకా ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం.
వెనుకబడ్డ కేజ్రీవాల్, సీఎం ఆతిషీ
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖులు కూడా వెనుకంజలో ఉండడం గమనార్హం. ఆ ఆప్ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి ఆతిషీతోపాటు మరికొందరు మంత్రులు కూడా కౌంటింగ్‌లో వెనుకబడిపోయారు. మరి కొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

