నేను పార్టీ మారడంలేదు-వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ
నెల్లూరు జిల్లా వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ పుకార్లు వినిపించాయి. ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు ప్రసన్డి.
నెల్లూరు జిల్లా వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ పుకార్లు వినిపించాయి. అయితే ఆ పుకార్లకు మొదట్లోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. గడగ గడప కార్యక్రమంలో ఉన్న ఆయన, తాను పార్టీ మారడంలేదంటూ వివరణ ఇచ్చారు. తనపై కొంతమంది కావాలనే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ప్రసన్న.
పార్టీ మారుతున్నారంటూ కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అలాంటి దుష్ప్రచారాన్ని కోవూరు ప్రజలు నమ్మొద్దని చెప్పారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయపాలెంలో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తాను జీవితాంతం జగన్ తోనే ఉంటానని చెప్పారు. తన ప్రాణం పోయే వరకు జగన్ తోనే ఉంటానన్నారు ప్రసన్న.
అందులో నేనే ఫస్ట్..
ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అసలు తాను టీడీపీలో ఎందుకు చేరుతానంటూ ఎదురు ప్రశ్నించారు ప్రసన్న. చంద్రబాబుని తాను తిట్టినంతగా ఎవరూ తిట్టలేదని గుర్తు చేశారు. కొడాలి నాని కూడా ఆ విషయంలో తన తర్వాతేనన్నారు. గతంలో చంద్రబాబుని చెడామడా తిట్టేవారు ప్రసన్న. జగన్ పై చంద్రబాబు విమర్శలు చేసిన ప్రతి సారీ ప్రసన్న నుంచి గట్టిగా రియాక్షన్ ఉండేది. అయితే ఇటీవల కాలంలో ఆ స్థాయిలో ఇక్కడ కౌంటర్లు పడటంలేదు.
వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ తరపున అసెంబ్లీకి వెళ్లిన తొలి ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్ విజయమ్మ, ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేశారు ప్రసన్న. పార్టీ పెట్టిన తర్వాత గెలిచిన తొలి ఇద్దరు ఎమ్మెల్యేలలో తాను ఒకడినని అన్నారు. అలాంటి తాను పార్టీ మారతానని ఎలా అనుకున్నారని ప్రశ్నించారు. పార్టీకి తనకంటే నిబద్ధత కలిగిన వారు ఎవరూ లేరని, జగన్ తోపాటే కలకాలం ఉంటానని చెప్పారు ప్రసన్న కుమార్ రెడ్డి.
అసంతృప్తి లేదు..
వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే అయినా కూడా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. నెల్లూరు జిల్లానుంచి తొలిదఫా అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. రెెండో దఫా కాకాణి గోవర్దన్ రెడ్డికి పదవి లభించింది. రెండోసారి అయినా తనకు పదవి వస్తుందని ఆశించి భంగపడ్డారు ప్రసన్న. అయితే తనకు అసంతృప్తి లేదని ఆయన చెబుతున్నారు. మంత్రి పదవి రాలేదని కొంతమంది ఎమ్మెల్యేలు జగన్ దిష్టిబొమ్మల్ని తగలబెట్టారని, కానీ తన నియోజకవర్గంలో అలాంటివి జరగలేదని గుర్తు చేశారు ప్రసన్న. తాను పార్టీ మారుతున్నానన్నది వట్టి దుష్ప్రచారం అంటున్నారు.
ఇటీవల ఓ ఛానెల్ లో తాను పార్టీ మారుతున్నట్టు కథనాలు వేశారని, అవన్నీ అవాస్తవాలు అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడప కార్యక్రమంలో ఉన్నారు. గతంలో ఆయన నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమం పెద్దగా జరగడంలేదని జగన్ కు నివేదికలందాయి. వాటి ప్రకారం ఓసారి ప్రసన్నకు జగన్ తలంటారని సమాచారం. ఆ తర్వాత ఆయన గడప గడప కార్యక్రమంలో స్పీడ్ పెంచారు. జనంలోకి వెళ్తున్నారు.