The Diary of a Young Girl : హిట్లర్‌పై అసలైన గెలుపు ఈ చిన్నారిదే ! ఇది కథ కాదు
రెండో ప్రపంచయుద్ధ సమయంలో ప్రపంచాన్ని హిట్లర్ గడగడలాడించాడు. ప్రత్యక్షంగా ..పరోక్షంగా ఎన్ని కోట్ల ప్రాణాలను తీశాడో లెక్కలేదు. అలా నాజీల కారణంగా 15 ఏళ్ల బాలిక 1945లో చనిపోయింది.కానీ హిట్లర్‌ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది... తన డైరీ ద్వారా !
The Diary of a Young Girl : " చుట్టూ చిమ్మ చీకటి, అంతా పిన్ డ్రాప్ సైలెన్స్..ఏమీ లేకపోయినా అక్కడేదో కదులుతుందనే అనుమానం వస్తూ ఉంటుంది. దూరంగా ఎవరో వస్తున్నారనే భయం వేస్తూ ఉంటుంది. గడియారం శబ్దం కూడా పెద్దగా వినిపిస్తూ ఉంటుంది. ఒళ్లంతా చెమటలు పట్టి పోతూ ఉంటాయి. హఠాత్తుగా బాంబులు పేలిన శబ్దం ! తర్వాత ఏం జరుగుతుంది ?
మన జీవితంలో ఇలాంటి భయానక పరిస్థితుల్లో చాలా జరిగి ఉంటాయి. కాకపోతే కలల్లో. ప్రతి ఒక్కరికీ ప్రతీ రోజూ కాకపోయినా ఎప్పుడో సారి మన జీవితంలో అలా జరగకూడదని కోరుకునేంతటి దుర్భరమైన ఘటనలు కల్లోకి వస్తాయి. అలాంటిదే మనం పైన చెప్పుకున్నది. పెద్దవాళ్లయితే .. కలే కదా జరగదు.. జరగకుండా జాగ్రత్తపడదాం అనుకుంటారు.. కానీ పన్నెండేళ్ల పిల్లలయితే. భయపడిపోతారు. మానసికంగా ఇబ్బంది పడతారు. కానీ ఆ పాప మాత్రం ప్రపంచానికి మానవత్వం నేర్పే ప్రయత్నం చేసింది. అది ఆమె అంతటకు ఆమె చేయలేదు. ఆ పాప వ్యక్తిత్వం చేసింది. ఆ పాప చీకటి అలుముకున్న తన గదిలో.. తన జీవితంలో వెలుగుల కోసం రాసుకున్నరాతలే మానవత్వం అయ్యాయి. అలాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ రాకూడదని మనసులో అనుకుంది. డైరీలో రాసుకుంది. ఆ పాప పేరు అన్నీ ఫ్రాంక్. ఇందులో గుండెలు పిండేసే అసలు విషయం ఏమిటంటే.. పైన చెప్పింది కల కాదు.. నిజం. ఆ పాప జీవితంలో జరిగిన నిజం. పైగా ఒక రోజో.. రెండు రోజులో జరిగింది కాదు. దాదాపుగా రెండేళ్ల పాటు చూసిన నరకం. అంత భయానక పరిస్థితుల్లోనూ ప్రపంచం అంతా మంచే అనుకున్న ఆ పాప స్వచ్చమైన మనసు ఇప్పుడు ప్రపంచానికి శాంతి పాఠాలు చెబుతోంది.
75 ఏళ్ల క్రితం డచ్ లాంగ్వేజ్‌లో " ది అన్నెక్స్ " అనే పుస్తకం విడుదలయింది. ఎక్కడో డచ్ లాంగ్వేజ్‌లో విడుదలైన "ద అన్నెక్స్" ఇప్పుడు మనం తెలుగులో చెప్పుకుంటున్నామంటే ఆ పుస్తకంలో అంత జీవం ఉంది. జీవితం ఉంది. ప్రపంచ గమనానికి పాఠం ఉంది. అంతకు మించి ప్రపంచానికి కావాల్సిన మానవత్వ సారం ఉంది. అందుకే " ది అన్నెక్స్ " ఇప్పటికీ ఎందరి మనసుల్నో మార్చే పుస్తకంగా మారింది. డచ్ బాషలోని "ది అన్నెక్స్ " తర్వాత ఇంగ్లిష్ సహా ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని భాషల్లోకి అనువాదం అయింది. " ది డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్ " " ది డైరీ ఆఫ్ అన్నీ ఫ్రాంక్ " పేరుతో శాంతి కోరుకునే పాఠకుల మనసుల్లోకి చేరింది.
అన్నాలీస్ మేరీ ఫ్రాంక్ అనే యూదు బాలిక 1945లో తన పదిహేనో ఏట చనిపోయింది. అంతకు రెండేళ్లకుపైగా ఆ పాప ఓ ఇరుకు గదిలో వెలుతురు వస్తుందో లేదో తెలియని పరిస్థితిలో.. రాత్రో పగలో తెలియని కాలమానంలో.. దూరంగా బాంబు పేలుళ్లు.. దగ్గరగా తూటాల శబ్దాలతో భయానక పరిస్థితుల్లో గడిపింది. తల్లీ, తండ్రి అక్కతో కలిసి ఓ గదిలోనే ఆావాసం. ఆ సమయంలో ఆమె మనసంతా ఆ డైరీకి చెప్పుకుంది. హిట్లర్ గురించి ఈ తరానికి చాలా కొంతే తెలుసు. ఒక్క మాటలో నియంత అంటాం. కానీ ఆ నియంత చేష్టలు ఎలా ఉంటాయో తెలుసుకుంటేనే ఒళ్ల గగుర్పొడుస్తుంది. ఇక అనభవిస్తే..?
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంమలో హిట్లర్‌కు చెందిన నాజీ సేన నెదర్లాండ్స్‌ను హస్తగతం చేసుకుంది. యూదులపై మారణకాండ ప్రారంభించారు. ఆ సమయంలో అమ్‌స్టర్‌డామ్‌లో ఉంటున్న ఓ యూదు కుటుంబానికి నాజీ సేన నుంచి నోటీసు వచ్చింది. నాజీ క్యాంప్ లో హజరు కావాలని ఆ ఆదేశం సారాంశం. వెళ్తే ఏమవుతుందో తెలుసుకాబట్టి తన ఇద్దరు బిడ్డలతో ఆ యూదు కుటుంబం ఆ రాత్రికి రాత్రి ఓ తలా ఓ చిన్న బ్యాగుతో ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఓ ఫ్యాక్టరీలో రహస్య గదిలో ఆశ్రయం పొందారు. ఆ గదిలో గట్టిగా శబ్దం కూడా చేయకూడదు. మాట్లాడకూడదు. నిశ్శబ్దంగా ఉండాలి. అదే సమయంలో బయట మారణహోమం సూచనలు స్పష్టంగా కనిపిస్తూంటాయి. ఆ కుటుంబంలో చిన్న కుమార్తె పన్నెండేళ్ల అన్నా ఫ్రాంక్. ఆ పాప తన బ్యాగులో రెండు జతల దుస్తులతో పాటు తండ్రి బహుకరించిన డైరీని కూడా తెచ్చుకుంది. రెండేళ్ల 35 రోజుల పాటు వారు నాజీల కంట పడకుండా ఆ చీకటి గదిలో గడిపారు. ఆ సమయంలో తన డైరీలో తన మనసులో అనిపించినవన్నీ రాసింది అన్నీ ఫ్రాంక్. ప్రపంచంలో అందరి్కీ జీవించే హక్కు ఉందని అన్నీ ఫ్రాంక్ నమ్మకం. అంతేనా..చుట్టూ మారణహమం చూస్తున్నా.. మనిషి మంచివాడనే నమ్ముతుంది అన్నీ.
నవంబర్ 1, 1944న చీకటి గదిలో ఉన్న అన్నీ ఫ్రాంక్ కుటుంబాన్ని నాజీ సేనలు పట్టుకుని కాన్సన్‌ట్రేషన్ క్యాంపుకు తరలించారు. అది పేరుకు కాన్సన్ ట్రేషన్ క్యాంపే కానీ.. యూదులను అప్రకటితంగా మరణశిక్ష విధించే ప్రాంతం. ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే ఆ క్యాంప్‌లో మూడు నెలల్లో రోగాలతో చనిపోవాల్సిందే. అలా అన్నీ ఫ్రాంక్ తల్లిదండ్రులు..సోదరి చనిపోయారు. చివిరికి ఫ్రాంక్ కూడా పదిహేనేళ్ల వయసులో విష జ్వరంతో చనిపోయింది.
లేదు.. ఇంకా బతికే ఉంది. ఎందుకంటే ఆమె డైరీ బయట ప్రపంచానికి దొరికింది. అందులోని ఆమె మనసు ప్రపంచాన్ని కదిలించింది. అందుకే ఇంకా వందేళ్లయినా బతికే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆమె ఉనికి కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే రెండో ప్రపంచయుద్ధంలో యూదులు ఎదుర్కొన్న అణిచివేతను మాత్రమే అన్నీ ఫ్రాంక్ డైరీ గుర్తు చేయడం లేదు. అంతకు మించి ప్రపంచవ్యాప్తంగా ఏదో మూల ఏదో ఓ వర్గం అణిచివేత చోటు చేసుకుంటూనే ఉంది. అది చాలా సార్లు ఊచకోతలకు కారణం అవుతున్నాయి. అందుకే అన్నీ ఫ్రాంక్ పసి మనసు ఆవిష్కరించిన పుస్తకంలోని తెలుపుదనం ... ఆలా ఉంటే ఎంతో బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది. అందుకే అన్నీ ఫ్రాంక్ డైరీ చదివిన ప్రతి ఒక్కరికీ హిట్లర్ ఓడిపోయింది ఈ పాప చేతిలోనే అని అనిపిస్తుంది. మీక్కూడా అలాగే అనిపించింది ఉంటుంది !