పీవోకేలో పెల్లుబికిన ప్రజాగ్రహం- కారకోరమ్ హైవే దిగ్బంధం
POK: పీవోకేలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. కొన్ని రోజులుగా వేల మంది చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)లో కీలకమైన కారకోరమ్ హైవేను దిగ్బంధించారు

POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల కోసం వారు రోడ్లెక్కుతున్నారు. పీవోకేలోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతం తీవ్ర నిరసనలతో అట్టుడుకుతోంది. పాకిస్తాన్ ఈ ప్రాంతంలో అనుసరిస్తున్న ప్రాథమిక హక్కులను కాలరాయడం, ప్రజలపై అణిచివేత ధోరణి, అధిక పన్నుల వసూలు వంటి వాటిపై పీవోకేలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. గత మూడు రోజులుగా వేల మంది చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)లో కీలకమైన కారకోరమ్ హైవేను దిగ్బంధించారు. సీపెక్ ప్రాజెక్టులు తమ హక్కులను కాలరాస్తున్నాయని నిరసనకారుల ఆరోపణ.
గిల్గిట్-బాల్టిస్తాన్లోని గుల్మత్ నగర్ కేంద్రంగా నిరసనలు
ఈ నిరసనలు ప్రధానంగా పీవోకేలోని గిల్గిట్-బాల్టిస్తాన్లోని గుల్మత్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నిరసనలకు ముఖ్యంగా ఆల్ ఆజాద్ కాశ్మీర్ జాయింట్ అవామీ మూవ్‌మెంట్ నాయకత్వం వహిస్తోంది. ఆ సంస్థకు చెందిన ఇంజనీర్ సప్తార్ ఖాన్, జమాలుద్దీన్ వంటి ముఖ్య నాయకులు ఈ ఆందోళనను నడిపిస్తున్నారు. ఇందులో ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, వ్యాపార వర్గాలు ప్రముఖంగా పాల్గొంటున్నాయి.
వీరితో పాటు పాక్-చైనా ట్రేడర్స్ యాక్షన్ కమిటీ, గిల్గిట్-బాల్టిస్తాన్ ఇంపోర్టర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్, గుల్మత్ నగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర వాణిజ్య సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే కారకోరమ్ హైవేను దిగ్బంధిస్తామని ఇంతకు మునుపే వారు పాకిస్తాన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. పెద్ద ఎత్తున సాగుతున్న ఈ ఉద్యమాన్ని అదుపులోకి తెచ్చేందుకు పాకిస్తాన్ నానా తంటాలు పడుతోంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగింది.
నిరసనకారుల కీలక డిమాండ్లు ఇవే...
కారకోరమ్ హైవేను దిగ్బంధం చేసిన ఈ నిరసనకారులు పాకిస్తాన్ ప్రభుత్వం ముందు కీలకమైన ఐదు డిమాండ్లను ఉంచారు:
- మా వనరులు, మా భూములు మాకే:చైనా-పాకిస్తాన్ ప్రాజెక్టుల ద్వారా తమ ప్రాంతంలోని సహజ వనరులను అక్రమంగా ఉపయోగించుకోవడం నిలిపివేయాలని, తమ భూములను ఈ ప్రాజెక్టుల కోసం వినియోగించవద్దన్నది వీరి మొదటి డిమాండ్. తమ వనరులు తమకే దక్కాలని వీరు ఆందోళన చేస్తున్నారు. తమ వనరులను తరలిస్తూ, తమకు మాత్రం ఎలాంటి న్యాయం చేయడం లేదన్నది వీరి ప్రధాన డిమాండ్.
- పెట్టుబడుల్లో భాగస్వామ్యం, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి:ఉద్యోగ అవకాశాలు స్థానికులైన తమకు కల్పించాలని, పెట్టుబడుల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీపెక్ ప్రాజెక్టుల వల్ల తాము నష్టపోతున్నామని, కానీ తమకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని వీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా, సోస్ట్ డ్రై పోర్ట్‌లో చైనా నుంచి తాము దిగుమతి చేసుకున్న 257 కన్సైన్‌మెంట్లకు కస్టమ్స్ క్లియరెన్స్ గత ఏడాది డిసెంబర్ నుండి పాకిస్తాన్ ప్రభుత్వం వేధిస్తోందన్నది ఇక్కడి వ్యాపార వర్గాల ఆవేదన. దిగుమతి చేసుకున్న వస్తువులు చాలా వరకు పాడైపోయాయని చెబుతున్నారు. అయినా డ్రై పోర్టు ఛార్జీలు కట్టాల్సి వస్తుందన్నది వీరి ఆవేదన.
- మా ప్రాంతాన్ని మేమే పాలించుకుంటాం:తమను తామే పరిపాలించుకునే అవకాశం ఇవ్వాలని, స్థానిక ప్రభుత్వానికి మరిన్ని అధికారాలను పాకిస్తాన్ ప్రభుత్వం బదిలీ చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతానికి పూర్తి రాజకీయ స్వయం పాలన ఇస్తామన్న హామీ ఇవ్వాలని వీరు వీధుల్లో డిమాండ్ చేస్తున్నారు.
- ఆదాయం లేదు.. ధరలు నియంత్రించరా?తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేని పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తమ జీవితమే దుర్భరంగా మారిందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. తాము నిత్యం తినే గోధుమ పిండి ధరలు, విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల నియంత్రణ అనేది వీరి మరో డిమాండ్.
- మా జీవన ప్రమాణాలు పెంచరా?గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతాన్ని పూర్తిగా దోచుకుంటూ తమ జీవితాలను దుర్భరం చేస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ వంటి కనీస అవసరాలు తీర్చడం లేదని వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవన ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
వందలాది ట్రక్కులు హైవే పైనే
కారకోరమ్ హైవే దిగ్బంధం వల్ల చైనా-పాకిస్తాన్ మధ్య రవాణా నిలిచిపోయింది. వాణిజ్య సరకులతో నిండిన ట్రక్కులు హైవేపై ఆగిపోయాయి. ఓ సర్వే ప్రకారం రోజుకు నాలుగైదు వేల ట్రక్కులు ఈ మార్గం గుండా నడుస్తాయని చెబుతున్నారు. గత మూడు రోజులుగా ఇలా వేలాది వాణిజ్య ట్రక్కులు నిలిచిపోయిన పరిస్థితి. దీంతోపాటు విద్యుత్, టెలికమ్యూనికేషన్ సదుపాయాలు నిలిచిపోయాయి. గత జనవరిలో కూడా ఇదే రీతిలో పీవోకే ప్రజలు ఇదే రహదారిని దిగ్బంధించారు. దీనిని పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో వేచిచూడాలి.
పీవోకే ప్రజల స్పందన సముచితం అంటోన్న భారత్
పీవోకేలో జరుగుతున్న ఆందోళనపై మన దేశం స్పందించింది. పీవోకే భారత్‌లో భాగం. ఇక్కడి ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం న్యాయమైందేనని, ప్రాథమిక హక్కుల కోసం వారు గళమెత్తడం సమంజసమేనని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
పాకిస్తాన్పై తీవ్ర ఒత్తిడి
ఆపరేషన్ సింధూర్ తర్వాత పీవోకేలోని పరిస్థితులు పాకిస్తాన్‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. చైనా మద్దతుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులు స్థానికుల అవకాశాలను దెబ్బ తీస్తుండటం వల్ల అక్కడి ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఇది రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. రానున్న రోజుల్లో పాకిస్తాన్ వీరి డిమాండ్ల పట్ల ఎలా వ్యవహరిస్తుంది, ఇక్కడి ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై ఎలా ఉద్యమిస్తారో అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.






















