Ukraine Attacks Russia: రష్యా వైమానిక స్థావరాలపై "ఆపరేషన్ స్పైడర్ వెబ్" పేరుతో డ్రోన్ దాడులు, ఉక్రెయిన్ ప్లాన్ ఏంటి?
"ఆపరేషన్ స్పైడర్ వెబ్"ను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ అత్యంత పకడ్బందీ వ్యూహ రచనతో సాగించింది. దీని కోసం అవసరమైన వార్ డ్రోన్లను ట్రక్కులలో రష్యా భూభాగంలోకి రహస్యంగా తరలించారు.
గత రెండున్నరేళ్లుగా తూర్పు ఐరోపాలో జరుగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధం అనూహ్య మలుపులు తీసుకుంటోంది. నెల రోజుల్లో ఉక్రెయిన్‌ను రష్యా లొంగదీసుకుంటుందని చర్చలు సాగాయి. కానీ రష్యా దాడులకు ఉక్రెయిన్ చేస్తోన్న ప్రతీకార దాడులు యుద్ధ నిపుణులను సైతం నివ్వెరపరుస్తున్నాయి. సైనిక పరంగా ప్రపంచంలో రష్యా రెండో స్థానంలో ఉండగా, యుద్ధానికి ముందు ఉక్రెయిన్ 22వ స్థానంలో ఉంది. యుద్ధంలో పాశ్చాత్య దేశాల సైనిక సహాయంతో అది 10వ స్థానానికి చేరుకుంది. అయినప్పటికీ, రష్యా దళాలను ఉక్రెయిన్ సైన్యం ముప్పతిప్పలు పెడుతోంది. రష్యా వ్యూహాత్మక తప్పిదాలు, అలసత్వం, సరైన ప్రణాళిక లేకపోవడం వంటి కారణాలతో ఉక్రెయిన్ చేతిలో ఎదురుదెబ్బలు తింటోంది. ఈ రెండున్నరేళ్లలో రష్యాపై ఉక్రెయిన్ చేసిన కీలక దాడులు ఏంటో తెలుసుకుందాం.
రష్యా వైమానిక స్థావరాలపై "ఆపరేషన్ స్పైడర్ వెబ్" పేరుతో డ్రోన్ దాడులు
రష్యాపై జూన్ 1, 2025న ఉక్రెయిన్ చేసిన దాడులు అతి పెద్ద దాడిగా చెప్పవచ్చు. రష్యాలోని వ్యూహాత్మక కీలక వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ మెరుపు దాడులు జరిపింది. "ఆపరేషన్ స్పైడర్ వెబ్"గా చేపట్టిన ఈ కీలక ఆపరేషన్ విజయవంతమైంది. సైబీరియాలోని ఒలెన్యా, బెలయాతో పాటు ఇవనోవో, డ్యాగిలెవో వైమానిక స్థావరాలు ఉన్నాయి. ఈ స్థావరాలు ఉక్రెయిన్‌కు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వీటిని నాశనం చేయడం ఉక్రెయిన్ యుద్ధ సామర్థ్యం పెంచుకున్న తీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ (S.B.U.) పకడ్బందీ ప్రణాళిక
"ఆపరేషన్ స్పైడర్ వెబ్"ను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ అత్యంత పకడ్బందీ వ్యూహ రచనతో సాగించింది. దీని కోసం అవసరమైన వార్ డ్రోన్లను ట్రక్కులలో రష్యా భూభాగంలోకి రహస్యంగా తరలించారు. ఇందుకోసం 18 నెలల నుంచి పకడ్బందీగా వ్యూహం సాగించినట్లు సమాచారం. ఆ డ్రోన్లు అనుకున్న నిర్దిష్ట ప్రదేశానికి చేరగానే, ఆ ట్రక్కుల్లో ఉన్న చెక్క క్యాబిన్‌లు పైకి తెరుచుకున్నాయి. అవి తెరుచుకోగానే ఉక్రెయిన్ ఆ డ్రోన్లను రిమోట్ సాయంతో గాల్లోకి లేచేలా చేసింది. అవి రష్యా వైమానిక స్థావరాలపై దాడికి దిగాయి. అత్యంత పటిష్టమైన S-400 రక్షణ వ్యవస్థలకు దొరక్కుండా రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడులు చేశాయి. ఈ దాడిలో రష్యాకు చెందిన 40 స్ట్రాటజిక్ బాంబర్ విమానాలైన Tu-95, Tu-22M3లు, A-50 నిఘా విమానం ధ్వంసమైనట్లు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ విమానాలు రష్యా అణు బాంబులు మోసుకుపోయే విమానాలుగా చెబుతున్నారు. అంతేకాకుండా, ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులు చేసినవి ఇవే విమానాలు. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల వైమానిక స్థావరంలోని విమానాలు కాలి బుగ్గి అయ్యాయి. దాదాపు రెండు బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో లక్షన్నర కోట్ల రూపాయలు) ఆర్థిక నష్టం జరిగిందని అంచనా. బెలయా ఎయిర్‌ఫీల్డ్ పూర్తిగా ధ్వంసమైనట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇది అతి పెద్ద దాడిగా చెప్పవచ్చు.
రష్యా ప్రతిష్టాత్మక యుద్ధ నౌకను ముంచివేసిన ఉక్రెయిన్
రష్యాకు చెందిన బ్లాక్ సీ ఫ్లీట్‌కు చెందిన "మోస్క్వా" అనే యుద్ధ నౌకను ఏప్రిల్ 14, 2022న ఉక్రెయిన్ ముంచివేసింది. ఇది గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్. రష్యా నౌకాదళంలో "ఫ్లాగ్‌షిప్"గా మోస్క్వాను చెప్పాలి. అత్యంత శక్తివంతమైన నౌకల్లో ఇది ఒకటి. ఉక్రెయిన్ ఈ నౌకను "నెప్ట్యూన్" అనే యాంటీ షిప్ మిస్సైల్‌తో దాడి చేసి ముంచివేసింది. అయితే దీన్ని రష్యా ఖండించింది. నౌకలో మందుగుండు సామగ్రి పేలిపోవడం లేదా తుపాను కారణంగా మునిగిపోవచ్చని చెప్పుకొచ్చింది. కానీ అంతర్జాతీయ మీడియా మాత్రం ఈ నౌకను ముంచివేసింది ఉక్రెయిన్ అని బలంగా విశ్వసిస్తోంది. ఈ నౌకను కోల్పోవడం వల్ల రష్యాకు అపారమైన సైనిక నష్టం జరిగింది. అంతేకాదు, నైతికంగా రష్యా ప్రతిష్టకు దెబ్బతగిలింది.
క్రిమియాకు కనెక్టివిటీ బ్రిడ్జిని పేల్చేసిన ఉక్రెయిన్ దళాలు
రష్యాకు - క్రిమియాను కలిపే కెర్చ్ బ్రిడ్జిని "క్రిమియా బ్రిడ్జ్"గా కూడా వ్యవహరిస్తారు. ఈ బ్రిడ్జ్ రష్యాకు అత్యంత వ్యూహాత్మకమైంది. సైనిక సరఫరాలకు, ఇతర సేవలకు ఇది లాజిస్టికల్‌గా కీలకమైంది. రష్యా ఆక్రమిత క్రిమియాకు కలిపే ప్రధాన మార్గం కూడా. ఈ బ్రిడ్జిని ఉక్రెయిన్ 2022 అక్టోబర్ 8వ తేదీన పేల్చేసింది. ఈ బ్రిడ్జికి అనుసంధానంగా ఉన్న రోడ్డు, రైలు మార్గం దెబ్బతింది. ట్రక్కు బాంబుతో ఈ బ్రిడ్జిని పేల్చివేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఉక్రెయిన్ పేల్చిందని బయటకు ప్రకటించకపోయినప్పటికీ, దీని వెనుక ఉక్రెయిన్ దళాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇది రష్యాకు ఓ అవమానకరమైన సంఘటనగా ఈ యుద్ధంలో మిగిలింది. దీని వల్ల రష్యా దళాలకు సరఫరా చేసే వ్యవస్థను ఉక్రెయిన్ దెబ్బతీసినట్లయింది. రష్యా దళాలు దీని వల్ల యుద్ధంలో ఇబ్బందుల పాలయ్యాయి. రష్యా భద్రతా వ్యవస్థలలో ఉన్న లోపాలను ఈ సంఘటన ఎత్తి చూపింది. అంతర్జాతీయంగా రష్యా ప్రతిష్ట కొంత మేర మసకబారింది.
రష్యా నుంచి ఖేర్సన్ను విముక్తి చేసిన ఉక్రెయిన్
ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడి 2022 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభించింది. అతి కొద్ది రోజుల్లో అంటే మార్చి 2వ తేదీన ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఇది ఈ యుద్ధంలో రష్యాకు అతి పెద్ద విజయం. రష్యా ఆక్రమించిన ప్రావిన్షియల్ క్యాపిటల్ సిటీ ఇది. ఖేర్సన్ డ్నీపర్ నది ముఖద్వారం వద్ద నల్ల సముద్రాన్ని అనుసంధానించే చోటు. డ్నీపర్ నది ఉక్రెయిన్‌లో అతి పెద్ద నది, దేశం మధ్య ప్రాంతం నుండి ప్రవహించే నది. ఖేర్సన్ ఆక్రమణ వల్ల డ్నీపర్ నదిపై రష్యా నియంత్రణ సాధ్యమవుతోంది. నల్ల సముద్రంలో నౌకాదళ కార్యకలాపాలకు కీలకమైనది. ఖేర్సన్ ఉత్తర క్రిమియన్ కాలువకు కీలక ప్రదేశం. రష్యా ఆక్రమిత ప్రాంతం క్రిమియాకు నీటి సరఫరా చేస్తుంది. రష్యా 2014లో క్రిమియాను విలీనం చేసుకున్న తర్వాత ఉక్రెయిన్ ఈ కాలువను మూసివేసింది. ఈ కారణాలతో ఖేర్సన్‌ను రష్యా ఆక్రమించుకుంది. అంతేకాకుండా, రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాకు బ్రిడ్జిని కలిపే ప్రాంతం ఖేర్సన్. క్రిమియాకు రష్యా తన సైనిక సామగ్రిని తరలించేందుకు ఉపయోగపడుతుంది. ఇలా ఖేర్సన్ చాలా వ్యూహాత్మక ప్రాంతంగా గుర్తించి రష్యా యుద్ధం ప్రారంభమైన తొలి నాళ్లలోనే ఆక్రమించుకుంది. అయితే ఖేర్సన్‌ను రష్యా నుంచి తిరిగి 2022 నవంబర్ 11న ఉక్రెయిన్ దళాలు ఎదురుదాడి చేసి స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఉక్రెయిన్ సాధించిన మరో అతి పెద్ద విజయం. రష్యా సేనల వ్యూహాత్మక తప్పిదాలను ఎత్తి చూపినట్లయింది. ఉక్రెయిన్ దళాల్లో నైతిక బలాన్ని పెంచిన విజయంగా చెప్పవచ్చు.






















