Ukraine vs Russia : చీప్ డ్రోన్లతో రష్యా పరువు తీసేసిన ఉక్రెయిన్: ఎస్-400 వ్యవస్థపై సందేహాలు రేపిన ఉక్రెయిన్ దాడి
Ukraine vs Russia:రష్యన్ల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎస్-400, 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. బాలిస్టిక్ మిస్సైల్స్, క్రూయిజ్ మిస్సైల్స్, ఎఫ్-16, ఎఫ్-35 వంటి వార్ బాంబర్‌లు అడ్డుకోగలదు

Ukraine vs Russia : ప్రపంచంలో రష్యా అత్యంత పెద్ద సైనిక శక్తుల్లో ఒకటి. ఆ దేశంపై దాడి చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. రష్యా అణుశక్తి దేశం. చీమ చిటుక్కుమన్నా సమాచారం తెలుసుకునే కేజీబీ గూఢాచారులు, ఎలాంటి దాడులకైనాసై అనే బలమైన నేవీ, ఎయిర్ అండ్ మిలిటరీ ఫోర్స్ వారి సొంతం. ఇక రష్యా ఎయిర్ స్పేస్‌ను కాపాడేందుకు పలు డిఫెన్స్ వ్యవస్థలను కనిపెట్టిన మిలిటరీ టెక్నాలజీ వారి సొంతం. ఎస్-300, ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ప్రపంచ మిలిటరీ టెక్నాలజీలో ఓ సూపర్ ఆవిష్కరణ. మన దేశం కూడా ఇటీవలే రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 డిఫెన్స్ వ్యవస్థతో పాకిస్థాన్ డ్రోన్లను కూల్చివేసింది. దీంతో రష్యా టెక్నాలజీ సాయంతో ఇండియా సాధించిన విజయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఈ ప్రతిస్పందనలతో మీసం మెలేసిన రష్యన్లకు, మార్కెట్‌లో దొరికే చీప్ డ్రోన్లతో ఉక్రెయిన్ ఒక్కసారిగా గాలి తీసేసింది. ఎస్-300, ఎస్-400 వంటి అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఉన్న రష్యాపై ఉక్రెయిన్ ఎలా దాడి చేసి ఎయిర్ బేస్‌లను దెబ్బ తీసిందనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతిచోట వినిపిస్తున్నాయి. రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అసలు రష్యా డిఫెన్స్ సిస్టంను ఉక్రెయిన్ ఎలా ఏమార్చిందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఎస్-400 వ్యవస్థలకు పరిమితులు ఉన్నాయని రుజువు చేసిన ఉక్రెయిన్
ప్రపంచంలోనే శత్రుదుర్భేద్యమైన రక్షణ వ్యవస్థకు మారుపేరు రష్యా అభివృద్ధి చేసిన ఎస్-400. దీనికి అధికారిక రష్యన్ పేరు "ట్రియంఫ్", అంటే విజయం అని అర్థం. దీనిని నాటో "SA-21 గ్రోలర్(SA-21 Growler) " అని పిలుస్తుంది. ఇక మన దేశం ఈ ఎస్-400 వ్యవస్థను హిందూ పురాణాల్లో విష్ణు చక్రంతో పోల్చి "సుదర్శన చక్ర" అని నామకరణం చేసింది. ఈ ఎస్-400 వ్యవస్థను రష్యన్లు 1990లలో అభివృద్ధి చేశారు. దీనికి సంబంధించిన మిలిటరీ టెస్ట్‌లన్నీ 1999-2000 సంవత్సరాల మధ్య జరిగాయి. చివరగా అన్ని పరీక్షలను దాటుకొని, ఎస్-400 ఆగస్టు 6వ తేదీ, 2007న సేవలందించేందుకు అందుబాటులోకి వచ్చింది. సిరియాలో ఈ వ్యవస్థను రష్యా మొహరింపజేసింది. ఉక్రెయిన్ యుద్ధంలోనూ వాడుతోంది. ఇటీవలే మన దేశం ఆపరేషన్ సింధూర్‌లో పాక్‌ను ఓడించే విషయంలో ఎస్-400 కూడా కీలక పాత్ర పోషించింది. 2025 జూన్ 1వ తేదీన రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసి ఐదు ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేయడంతో ఇప్పుడు ఎస్-400 పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దుర్భేద్యం అనుకున్న S-400, ఉక్రెయిన్ డ్రోన్ల ముందు ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే?
రష్యన్ల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎస్-400, 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగలదు. ఇది బాలిస్టిక్ మిస్సైల్స్, క్రూయిజ్ మిస్సైల్స్, అమెరికా రూపొందించిన ఎఫ్-16, ఎఫ్-35 వంటి వార్ బాంబర్‌లను అడ్డుకోవడానికి దీన్ని రూపొందించడం జరిగింది. ఇందులో అమర్చిన ఎంగేజ్‌మెంట్ రాడార్, పనోరమిక్ డిటెక్షన్ రాడార్లు లక్ష్యాలను గుర్తించి, వాటి దిశ, ప్రయాణ తీరును గమనించి వాటిపైకి మిస్సైల్స్‌ను ప్రయోగించి గాల్లోనే తుత్తునీయలు చేస్తాయి. ఎస్-400 వ్యవస్థలో అమర్చిన ఎంగేజ్‌మెంట్ రాడార్ కచ్చితత్వంతో ట్రాకింగ్ చేస్తుంది. అయితే, ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ముఖ్యంగా అధిక ఎత్తులో, అత్యంత వేగంతో ప్రయాణించే స్ట్రాటజిక్ టార్గెట్స్‌ను గుర్తించడానికి తయారు చేశారు. అయితే, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను గుర్తించడంలో వీటికి చాలా పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను గుర్తించే ఉక్రెయిన్ స్మార్ట్ ప్లాన్‌తో రష్యా ఎయిర్ బేస్‌లపైకి దాడికి దిగింది.
చీప్ రాడార్లతో ఎస్-400 డిఫెన్స్ సిస్టంను బోల్తా కొట్టించిన ఉక్రెయిన్
ఉక్రెయిన్ రష్యాపై దాడి చేసిన డ్రోన్లు మిలిటరీ డ్రోన్లు కావు. మార్కెట్‌లో దొరికే ఫస్ట్ పర్సన్ వ్యూ (FPV) డ్రోన్లుగా యుద్ధ నిపుణులు చెబుతున్నారు. ఇవి తక్కువ ధరకు కస్టమ్ బిల్డ్ యూనిట్లుగా తయారు చేస్తారు. వీటి సైజు కూడా చాలా చిన్నగా ఉంటుంది. కొన్నిసార్లు ఇవి కేవలం 0.5 మీటర్ల నుంచి 2 మీటర్ల వరకు మాత్రమే ఉంటాయి. ఇవి తక్కువ రాడార్ క్రాస్-సెక్షన్ (RCS) కలిగి ఉంటాయి. రాడార్ క్రాస్ సెక్షన్ అంటే రాడార్ సిగ్నేచర్ అని కూడా అంటారు. తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ ఉంటే ఆ వస్తువును రాడార్ గుర్తించడం కష్టంగా మారుతుంది. అదే ఎక్కువ ఉంటే రాడార్ సులువుగా గాల్లో ఎగిరే వస్తువును గుర్తిస్తుంది. ఉక్రెయిన్ దాడులకు వాడిన డ్రోన్లు రాడార్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువ ఉన్నవి కావడంతో రష్యన్ రాడార్లు, ఎస్-400లో ఉన్న రాడార్లు గుర్తించలేకపోయాయి.
తక్కువ ఎత్తులో డ్రోన్లు ప్రయాణించడం వల్ల గుర్తించని ఎస్-400
ఉక్రెయిన్ ఇటీవల చేసిన డ్రోన్ దాడుల్లో ప్రయోగించిన డ్రోన్లు ఎస్-400కు అదృశ్య శక్తులుగా మిగిలాయి. అందుకు కారణం ఈ డ్రోన్లు భూ ఉపరితలానికి తక్కువ ఎత్తులో ఎగరడం మరో కారణం. రాడార్‌లో ఏర్పాటు చేసే ట్రాకింగ్ వ్యవస్థలు "భూమి వక్రత" (Earth's curvature), ఆ తర్వాత భూ ఉపరితలంపై ఉన్న అడ్డంకులు అంటే కొండలు గాని, ఎత్తైన భవనాలు ఉండటం వల్ల తక్కువ ఎత్తులో ఎగిరే వస్తువులను గుర్తించలేవు. దీనినే "రాడార్ హరిజన్" (Radar Horizon) అంటారు. దీన్నే లైన్ ఆఫ్ సైట్ పరిమితిగా కూడా అంటారు. ఎస్-400 వ్యవస్థల్లో భూమికి దగ్గరగా ప్రయాణించే లోహ వస్తువుల కోసం ప్రత్యేక రాడార్లను ఏర్పాటు చేసినా, అవి అన్ని సందర్భాల్లోనూ విజయవంతంగా ఆ తక్కువ ఎత్తులో ఎగిరే లోహ వస్తువులను కనుగొనడంలో పని చేయలేకపోయాయి.
రష్యా లోపలి నుంచే ప్రయోగించడం కీలకం
ప్రతీ దేశం తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తన దేశం వెలుపలి నుంచి వచ్చే దాడులను ఎదుర్కోవడానికి అనుగుణంగా సరిహద్దుల వద్ద మొహరింపజేస్తుంది. ఇదే రీతిలో రష్యా ఎయిర్ డిఫెన్స్‌లో హై-ఎండ్ వ్యవస్థ ఎస్-400. ఇది కూడా రష్యా వెలుపలి దాడులపై దృష్టి పెట్టింది. ఇది గుర్తించిన ఉక్రెయిన్ రష్యాలోకి దొడ్డి దారిన తన డ్రోన్లను పక్కా ప్లాన్‌తో పంపింది. అవి తాను టార్గెట్‌గా గుర్తించిన ఏరియాలకు దగ్గరగా తీసుకెళ్ళిన తర్వాత అనూహ్యంగా ఆ డ్రోన్లను ప్రయోగించింది. ఇవి అతి తక్కువ ఎత్తులో ఎగిరి, అతి తక్కువ దూరం నుంచే రష్యా ఎయిర్ బేస్‌లపై దాడి చేశాయి. ఈ దాడులను ఎస్-400 వ్యవస్థ గుర్తించలేకపోయింది. అందుకు కారణం రష్యా లోపల, అదీ దాడికి ఎంచుకున్న లక్ష్యాలకు అతి సమీపంగా, అతి తక్కువ ఎత్తులో ఎగరడం వంటి కారణాల వల్ల రష్యా ఈ దాడులను ఆపలేకపోయింది. ఎస్-400 వంటి హై-ఎండ్ ఆధునిక వ్యవస్థ కూడా సత్వరం ప్రతిస్పందించి ఈ డ్రోన్లను అడ్డుకోలేకపోయింది.
ఉక్రెయిన్ దాడులు, ఇండియాకు వార్నింగ్ సైరనే
రష్యాపై ఉక్రెయిన్ చేసిన వ్యూహాత్మక దాడులు వార్నింగ్ బెల్ లాంటివే అని చెప్పాలి. పాకిస్థాన్ ప్రయోగించిన ఎన్నో వందల డ్రోన్లను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుంది. అందులో ఎస్-400 సుదర్శన చక్రను వాడినట్లు మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. అయితే, పాక్ కూడా ఉక్రెయిన్ మాదిరి వ్యూహంతో దాడులకు దిగితే ఏం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు సుదర్శన చక్ర వంటి అద్భుతమైన, అధునాతనమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉందనుకున్న మన దేశానికి, ఉక్రెయిన్ దాడులు పలు సవాళ్లను ముందుకు తెచ్చినట్లయింది. ఈ దాడులు కేవలం మన దేశానికే కాకుండా ప్రతీ దేశానికి హెచ్చరిక అనడంలో సందేహం లేదు.






















