Costly Divorce : రూ. 6 లక్షల కోట్లు.. గేట్స్‌కి విడాకుల "బిల్" మోత మోగిపోతోంది..!
అధికారికంగా విడాకులు మంజూరు కావడంతో ఆస్తులను చట్ట ప్రకారం బదలాయిస్తున్నారు బిల్ గేట్స్. ఇప్పటికే 5.7 బిలియన్ డాలర్ల విలవైన షేర్లను మిలిండా పేరు మీదకు మార్చారు.
"అమెరికాలో బిలియనీర్ అవ్వాలంటే కష్టపడక్కర్లేదు.. బిలియనీర్‌ని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే చాలు" అనే ఓ జోక్ ఇంటర్నెట్‌లో సర్క్యూలేట్ అవుతూ ఉంటుంది. ఇది నిజం కూడా. ఇటీవల అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ విడాకులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విడాకులు ఇస్తున్న భార్యకు చట్ట బద్ధంగా ఆస్తి పంచి ఇవ్వాల్సి వచ్చింది. అందుకు గాను..మాజీ భార్య మెకంజీకి మొత్తం 38 బిలియన్ డాలర్ల ఆస్తులు రాసిచ్చాడు బెజోస్. అంటే ఈ మొత్తం దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల రుపాయలు. ఈ విడాకులతో ప్రపంచంలోనే నాలుగో అత్యంత ధనవంతురాలైన మహిళగా మెకంజీ నిలిచారు.
ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు బిల్ గేట్స్ దంపతులు విడాకులు తీసుకున్నారు. వారి విడాకులు కూడా అధికారికంగా మంజూరయ్యాయి. ఇప్పుడు అందరి దృష్టి మెలిండా దృష్టి పడింది. ఆమెకు.. బెజోస్ భార్య మెకంజీ కన్నా ఎక్కువే లభించనుంది. ఇప్పుడు అధికారికంగా విడాకులు మంజూరు కావడంతో ఆస్తుల పంపకాలు ప్రారంభించారు. బిల్ గేట్స్‌కు ఉన్న కంపెనీల నుంచి.. షేర్లను మిలిండా పేరు మీదకు మార్చడంప్రారంభించారు. ప్రస్తుతం 5.7 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను మిలిండా గేట్స్ పేరు మీదకు మార్చారు. మొత్తంగా మిలిండా గేట్స్‌కు 60 బిలియన్ డాలర్లు ఆస్తులు వస్తాయనే అంచనా ఉంది. 60 బిలియన్ డాలర్లు అంటే.. దాదాపుగా మన రూపాయల్లో ఆరు లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేయవచ్చు. అత్యంత ఖరీదైన విడాకుల్లో ఇదే మొదటి స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉంది.
అమెరికన్ చట్టాలు చాలా స్పష్టంగా ఉంటాయి. విడాకులు తీసుకోవాలని జంట నిర్ణయించుకున్న తర్వాత ఆస్తుల పంపకాల మీద వివాదాలు రావు. ఎవరికి ఎంత షేర్ అనే పట్టింపు అసలు ఉండదు. ఎందుకంటే.. ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత ఆస్తులు సంపాదిస్తారో.. అది మొత్తం చెరి సగం చెందుతుంది. జెఫ్ బెజోస్ అమెజాన్ నుప్రారంభించక ముందే మెకంజీని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ కంపెనీ లక్షల కోట్ల విలువైనదిగా మారింది. అందుకే... తన ఆస్తిలో సగం ఇచ్చేయాల్సి వచ్చింది. బిల్ గేట్స్ కూడా అంతే. 27 ఏళ్ల కిందటే.. మెలిండాను పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచి గేట్స్ సంపాదించిన ఆస్తిలో సగం ఇచ్చేయాల్సిందే. అందుకే మెలిండాకు కు ఇప్పుడు ఆరవై బిలియన్ డాలర్ల ఆస్తి సమకూరనున్నట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ ఆస్తి పంపకాల వ్యవహారం నడుస్తోంది. మొత్తంగా అన్నీ ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఆమెకు ఎంత మొత్తం దక్కుతుందో క్లారిటీ వస్తుంది. అయితే.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిల్ గేట్స్ తో విడాకులు అంటే.. ఖచ్చితంగా అదే రేంజ్‌లో పరిహారం కూడా వస్తుంది. అందుకే.. ఇలాంటి విడాకులు చరిత్రలో రావాలంటే మళ్లీ .. అలాంటి ధనవంతుడు విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది.