Romance in Jail: ఖైదీలకూ శృంగార బ్రేక్ - ప్రత్యేకంగా పర్మిట్ రూమ్ - ఇటలీ జైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు !
Italy: ఇటలీలో ఖైదీలూ ఉప్పూకారం తింటారని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. వారి శృంగారానికి ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేస్తోంది.

Italy Opens Its First Romance Room In Prison For Inmates: ఇటలీలో మొదటిసారిగా ఖైదీల కోసం " శృంగార గదిని" ఏర్పాటు చేశారు. 2024 జనవరిలో ఇటలీ రాజ్యాంగ కోర్టు ఖైదీలకు తమ జీవిత భాగస్వాములు లేదా దీర్ఘకాలిక భాగస్వాములతో "ప్రైవేట్ ఇంటిమేట్ మీటింగ్స్" ఏర్పాటు చేసుకునే హక్కు ఉందని తీర్పు చెప్పింది. ఈ తీర్పు ఇటలీ జైళ్లలో సంస్కరణలకు కారణం అవుతోంది. ఖైదీల హక్కులను మరింత గౌరవించే దిశగా ఒక అడుగుగా పరిగణించి ప్రభుత్వం ఇంటిమేట్ గదులు ఏర్పాటు చేస్తోంది.
శృంగారం కోసం కోర్టుకెళ్లిన వ్యక్తి
ఈ శృంగార రూమ్ మొదటిసారిగా 2025 ఏప్రిల్ 18న ఇటలీలోని మధ్య ఉంబ్రియా ప్రాంతంలోని టెర్ని జైలులో ప్రారంభమైంది. ఒక ఖైదీ తన మహిళా భాగస్వామితో ఈ ప్రత్యేక గదిలో శృంగారం ఆస్వాదించాడు. ఉత్తర ఇటలీలోని ఆస్టి జైలులో ఒక ఖైదీ తన భార్యతో సన్నిహిత సంబంధం కోరుతూ చేసిన పిటిషన్‌ను వేశాడు. అయితే ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ ఖైదీ తన కేసును రాజ్యాంగ కోర్టుకు తీసుకెళ్లాడు. రాజ్యాంగ కోర్టు అనుకూలంగా తీర్పు చెప్పింది.
రెండు గంటల పాటు బెడ్ సౌకర్యంతో రూమ్
ఇటలీ న్యాయ మంత్రిత్వ శాఖ ఈ ఇంటిమేట్ సందర్శనల కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. ఖైదీలకు బెడ్ , టాయిలెట్‌తో కూడిన ప్రైవేట్ గది ఇస్తారు. శృంగారానికి రెండు గంటల సమయం ఇస్తారు. అయితే గది తలుపు అన్‌లాక్ చేసి ఉంచాలి. లోపల ఏం చేస్తారన్నదానిపై నిఘా ఉండదు. నిజానికి ఇటలీనే ఇలాంటి సౌకర్యం అందిస్తున్న మొదటి దేశం కాదు. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, స్వీడన్, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాలు ఇప్పటికే ఖైదీలకు ఇలాంటి సౌకర్యాలను అందిస్తున్నాయి. ఇటలీ ఈ విషయంలో కొంత వెనుకబడి ఉందని, ఈ సంస్కరణ ఆలస్యంగా వచ్చినదని ఖైదీల హక్కుల సంఘాలు అంటున్నాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం చేపట్టిన "ప్రిజన్ హ్యూమనైజేషన్" సంస్కరణల్లో ఈ లవ్ రూమ్స్ ఓ భాగం.
Italy's first-ever sex room for prisoners went into operation on Friday, when an inmate was allowed a visit from his female partner in a special facility at a jail in the central Umbria region. https://t.co/8bheegcJJS pic.twitter.com/fuJILjM2md
— Reuters (@Reuters) April 19, 2025
ఇప్పటికే పలు యూరప్ దేశాల్లో ఈ సౌకర్యం
ఇటలీ జైళ్లు యూరప్‌లో అత్యధిక రద్దీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, దేశంలో 62,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు, ఇది జైళ్ల అధికారిక గరిష్ట సామర్థ్యం కంటే 21 శాతం అధికం. ఇటీవల జైళ్లలో ఆత్మహత్యల సంఖ్య కూడా పెరిగింది, దీని కారణంగా ఈ సంస్కరణలు ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది కూడా ఓ మార్గంగా భావిస్తున్నారు. ఖైదీల హక్కుల సంస్థలు, ఈ "లవ్ రూమ్స్" హెటెరోసెక్సువల్ మరియు గే జంటలకు కూడా అందుబాటులో ఉండాలని, అలాగే కుటుంబ సందర్శనలకు కూడా ఉపయోగపడాలని డిమాండ్ చేస్తున్నాయి.




















