Iran About Ceasefire: ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనలో నిజం లేదు- 'చివరి రక్తపు బొట్టు వరకు...' అంటూ ఇరాన్ ఫస్ట్ రియాక్షన్
Iran Israel Conflict | ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని చెప్పారు. కానీ ట్రంప్ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.

Iran Israel Ceasefire: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. గత 12 రోజులుగా జరుగుతున్న ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిందని.. మరికొన్ని గంటల్లో ప్రకటన వస్తుందని ట్రంప్ చెప్పిన కొన్ని గంటల్లోనే అదంతా ఫేక్ అని ఇరాన్ కొట్టిపారేసింది. తమ అణు కేంద్రాలపై అమెరికా బీ2 స్పిరిట్ బాంబర్స్ తో దాడులు చేసి నేరుగా యుద్ధంలోకి దిగింది సైన్యం. దాంతో ఇరాన్ సైతం అటు ఇజ్రాయెల్, ఇటు అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైల్స్ దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంది. అమెరికాకు వ్యతిరేకంగా ఖతార్ రాజధాని దోహా సహా అమెరికా సైన్యం ఉన్న పలు ప్రాంతాల్లో ఇరాన్ దాడులకు పాల్పడింది.
ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ఘాటుగా స్పందించారు. “ఇరాన్ ప్రజలు, వారి చరిత్రను తెలిసిన వారికి ఇరాన్ దేశం లొంగిపోయే దేశం కాదని తెలుసు. ట్రంప్ పిచ్చి మాటలు ఇకనైనా కట్టిపెట్టాలని” సూచించారు. "ఇంకా కాల్పుల విరమణ ఒప్పందం జరగలేదు. ఇజ్రాయెల్ ప్రభుత్వం టెహ్రాన్ సమయం ఉదయం 4 గంటలలోపు ఇరాన్ ప్రజలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఆక్రమణలు ఆపాలి. ఆ తర్వాత కాల్పుల విరమణపై తుది నిర్ణయం తీసుకుంటాము" అని అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి అన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు ఇరాన్ సైన్యం పోరాటం కొనసాగిస్తుందని.. ప్రత్యర్థి తమ తప్పిదాన్ని అంగీకరించే వరకు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ గురించి ట్రంప్ ఏం చెప్పారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిందని, ఇరుదేశాలు కాల్పుల విమరణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. మరికొన్ని సంవత్సరాలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగి మొత్తం మధ్యప్రాచ్యం మొత్తం నాశనం అయ్యేది. కానీ అది జరగలేదు, ఎప్పటికీ జరగదు కూడా. దేవుడు ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు అమెరికాను దీవించాలి. మధ్యప్రాచ్యాన్ని దేవుడు దీవించాలని, మొత్తం ప్రపంచాన్ని కూడా ఆశీర్వదించాలని" ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు.
కాల్పుల విరమణపై ఏకాభిప్రాయం కుదిరిందా?
రాయిటర్స్ ప్రకారం, ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని నివారించడానికి ఖతార్, అమెరికా ద్వారా మధ్యవర్తిత్వం వహించడంతో కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇరాన్ అధినేతలు అంగీకరించారు. ఇరాన్‌పై మొదటగా దాడి చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ అణు బాంబును తయారు చేస్తోందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారి తీసింది. ఇజ్రాయెల్‌కు ఆపన్నహస్తం అందిస్తామని మొదట్నుంచీ చెబుతూ వచ్చిన అమెరికా కూడా యుద్ధంలోకి దూకింది. ట్రంప్ ఆదేశాలతో అమెరికా సైన్యం ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసింది. అందుకు ప్రతీకారంలో బాగంగా పలు దేశాల్లోని అమెరికా సైనిక కేంద్రాలపై ఇరాన్ మిస్సైల్స్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ తో పాటు అమెరికా సైతం తమ శత్రువుగా మారిందని ఖమేనీ వ్యాఖ్యానించారు. మరోవైపు ఖమేనీ ఫ్యామిలీ సురక్షితంగా బంకర్లలో తలదాచుకుందని సమాచారం.






















