Iran Israel Ceasefire: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసింది, డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
Iran Israel Ceasefire: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించారు. దీనిపై ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి అధికారిక స్పందన లేదు.

Iran Israel Conflict | వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగిపోయింది అని ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో యుద్ధం ముగిసిందని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు. అయితే, అమెరికా అధ్యక్షుడి ప్రకటనపై ఇప్పటివరకు ఇరాన్, ఇజ్రాయెల్ నుండి అధికారిక స్పందన రాలేదు. కాల్పులు విరమణ, సైన్యం దాడులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా రెండు దేశాలను ట్రంప్ అభినందించారు.
దౌత్యపరమైన చర్చలు జరుగుతాయా..
ఈ రెండు దేశాలు ప్రతిపాదిత కాల్పుల విరమణ పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉండవచ్చు. కాల్పుల విరమణ నిలిపివేసి, కొన్ని దౌత్యపరమైన చర్చలు లాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా ఇరాన్ కు చెందిన 3 అణు స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది. ఇజ్రాయెల్ తో తమ ఉద్రిక్తతల సమయంలో అమెరికా రంగంలోకి దిగి తమపై దాడులు చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
ఇరాన్ ప్రతీకార దాడుల తరువాత కాల్పుల విరమణ
సోమవారం రాత్రి అమెరికాకు చెందిన ఎయిర్ బేస్, సైన్యంపై మిస్సైల్స్ దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ ప్రతీకార దాడులు చేసిన కొన్ని గంటల తరువాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ముగిసిందని ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో మంగళవారం 3.32 గంటలకు పోస్టు చేశారు. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణపై ఆ రెండు దేశాలు ప్రకటన చేయనున్నాయి. యుద్ధం అధికారికంగా ముగియనున్నట్లు ఇరాన్, ఇజ్రాయెల్ ప్రకటిస్తాయని తెలిపారు.
’ఇరు దేశాలు యుద్ధానికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య 12 రోజుల ఉద్రికత్తలు ముగిశాయి. మరో ఆరు గంటల్లో కాల్పుల విరమణ, యుద్ధం నిలిపివేసే చర్యలు ప్రారంభం కానున్నాయి. మొదటగా ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. అనంతరం ఇజ్రాయెల్ సైతం సీజ్ ఫైర్ నిర్ణయానికి వచ్చింది. ఒక దేశం కాల్పుల విరమణకు వెళ్తే, మరో దేశం సైతం శాంతి మంత్రం పఠించాలి. అంతా అనుకున్నట్లే జరుగుతోంది. యుద్ధాన్ని నిలిపివేస్తున్న రెండు దేశాలకు నా అభినందనలు. ఈ యద్ధం మరింత కొనసాగితే కనుక పశ్చిమాసియా నాశనం అయ్యేది. ఈ దేశాలతో పాటు అమెరికాపై దేవుడి దయ ఉంటుంది’’ అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా సైనిక స్థావరాలపై దాడులు, ధ్యాంక్స్ చెప్పిన ట్రంప్
ఇరాన్ లోని 3 ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. దాంతో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. ఖతార్ సహా పలు దేశాల్లో అమెరికా వైమానిక స్థావరాలపై మిస్సైల్స్ తో విరుచుకుపడింది. ఇరాన్ దాడులను ట్రంప్ టెక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. దాడులు చేస్తామని ముందే చెప్పినందుకు ఇరాన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఇకనుంచి శాంతివైపు అడుగులు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ కు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ యుద్ధాన్ని ఆపిన క్రెడిట్ ట్రంప్ తన ఖాతాలో వేసుకుని, మరోసారి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని పలు దేశాల అధినేతలు భావిస్తున్నారు.






















