Rameswaram Road Accident: తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం- ఏపీకి చెందిన నలుగురు అయ్యప్ప స్వాములు మృతి
Rameswaram Road Accident: తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. దీనిపై ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది.

Rameswaram Road Accident: శబరిమలలో అయ్యప్పను దర్శించుకొని తిరిగి వస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వాములు మృతి చెందారు. తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన రోడ్డు ప్రమాదం నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది. స్వామిని దర్శించుకొని వస్తూ వస్తూ నిద్ర వచ్చిందని మార్గ మధ్యలో కారు ఆపారు. అయితే ఆ రోడ్డులో వచ్చిన లారీ ఆ కారును ఢీ కొట్టింది.
ఈ దుర్ఘటనలో కారులో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెళ్లి చూసే సరికి నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. ఒకరు తీవ్ర గాయాలతో ఉన్నారు. ఆ వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి మృతదేహాలను స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో ఉంచారు. వాటిని స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రామేశ్వరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు స్వస్థలం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస కాగా, మరో వ్యక్తిది గజపతినగరం మండలం మరుపల్లి. గాయపడిన వ్యక్తిది కూడా ఆ ప్రాంతంగానే చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదంపై ప్రభుత్వం దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాదం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. వెంటనే అధికారులతో మాట్లాడి మృతదేహాలను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. గాయపడిన వ్యక్తి మెరుగైన చికిత్స అందివ్వాలని ఆదేశించారు.



















