China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!
China Plane Crash: చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదానికి పైలట్లే కారణమని తాజాగా దర్యాప్తులో తేలింది.
China Plane Crash: చైనాలో ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్య కాదని విమానాన్ని పైలట్లే ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి.
ఏం జరిగింది?
బ్లాక్‌బాక్స్ డేటా విశ్లేషణలో ఈ విషయం తెలిసినట్లు సమాచారం. విమానం ఎత్తు ఒక్కసారిగా తగ్గడాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గుర్తించి.. వెంటనే పైలట్లను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. కానీ, పైలట్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు తెలిపారు.
దీని ప్రకారం కాక్‌పిట్‌లో ఉన్న సిబ్బందే కావాలని విమానం ఎత్తును ఒక్కసారిగా కిందకు దించి కూల్చేసి ఉంటారని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై బోయింగ్, చైనా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
భారీ ప్రమాదం
2022 మార్చి 21న 132 మందితో వెళ్తున్న బోయింగ్ విమానం గువాంగ్షీ రాష్ట్రం, వూజౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో కూలిపోయింది. చైనా ఈస్టర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఇది. కున్మింగ్ నుంచి గువాంగ్ ఝౌకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
విమానం కూలినప్పుడు పర్వత ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వూజౌ నగరానికి నైరుతి దిక్కులో కొంతదూరం ప్రయాణించగానే విమానం నుంచి సిగ్నల్స్ రావడం ఆగిపోయింది. ఘటన జరిగిన సమయంలో విమానం 30వేల అడుగుల ఎత్తులో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు.
Also Read: Anil Baijal Resign: దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామా- ఇదే రీజన్!