Mpox Vaccine: ఆఫ్రికాను వణికిస్తున్న ఎంపాక్స్ వైరస్‌కు టీకా తయారీ.. వ్యాక్సినేషన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ పచ్చ జెండా..!
WHO: ఆఫ్రికాను హడలెత్తిస్తున్న ఎంపాక్స్‌కు వ్యాక్సిన్ సిద్ధమైంది. బవేరియన్ నార్డిక్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సినియా అంకారా- బవేరియన్ నార్డిక్ టీకా అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌ఓ అనుమతులు.
Mpox Vaccine: ప్రపంచదేశాలను ముఖ్యంగా ఆఫ్రికాను గడగడలాడిస్తున్న ఎంపాక్స్‌కు వ్యాక్సిన్ రెడీ అయింది. డెన్మార్క్ దేశంలోని బవేరియన్ నార్డిక్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సినియా అంకారా- బవేరియన్ నార్డిక్ టీకా అత్యవసర వినియోగానికి వ్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు ఇచ్చింది. 18 సంవత్సరాలు నిండిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. రెండు డోసుల్లో వ్యాక్సినేషన్ జరగనుండగా.. రెండు డోసులకు మధ్య 4 వారాల విరామం ఉండాలని డబ్య్లూహెచ్‌ఓ సూచించింది. ఈ టీకా 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో 8 వారాల వరకు నిల్వ ఉంటుంది. ప్రస్తుతానికి పెద్దవాళ్లకు మాత్రమే ఈ టీకా ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చిన ఆరోగ్య సంస్థ.. వ్యాధి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చిన్నారులకు, గర్భిణీలకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో టీకా ఇచ్చేందుకు డబ్ల్యూహెచ్‌ఓ అనుమతించింది.
ఈ టీకా ప్రభుత్వాలు ఎలా పొందొచ్చు:
ఈ టీకాను డెన్మార్క్ ఫార్మా సంస్థ బవేరియన్ నార్డిక్ అభివృద్ధి చేస్తుండగా.. ప్రభుత్వాలు నేరుగా కొనుగోలు చేయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రభుత్వాలతో పాటు GAVI సంస్థ ద్వారా సేకరించేందుకు అనుమతులు ఉన్నట్లు పేర్కొంది. ఈ టీకాను ప్రస్తుతం ఒక్క సంస్థ మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా.. టీకా అత్యవసరమైన ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు WHO తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ఈ టీకా తొలి డోసులో 76 శాతం రెండో డోసు తీసుకున్న వారిలో 86 శాతం ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ఈ టీకాతో పాటు జపాన్ సంస్థ KM బయోలాజిక్స్ అభివృద్ధి చేసిన LC16 టీకాను కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరీక్షిస్తోంది. డెన్మార్క్ టీకా అందుబాటులోకి రావడంతో మంకీ పాక్స్‌పై యుద్ధంలో ఒక ముందడుగు పడ్డట్లు తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ .. ఈ ప్రాణాంతక వైరస్ కట్టడికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. ఇప్పటికే వైరస్‌తో అతలాకుతలం అవుతున్న కాంగోకు ఒక బ్యాచ్ వ్యాక్సిన్‌లు కూడా పంపినట్లు వెల్లడించింది.
DR Congo receives long-awaited mpox vaccine doses
— Camus (@newstart_2024) September 6, 2024
Democratic Republic of Congo received its first batch of mpox vaccines on Thursday, which health authorities hope will help curb an outbreak that has prompted the U.N. to declare a global public health emergency.
Source: FRANCE… pic.twitter.com/3z2MN9UjmU
అత్యధికంగా పిల్లలే ఎంపాక్స్ బాధితులు:
ఎంపాక్స్ వైరస్ ఎక్కువగా పిల్లల్లోనే విస్తరిస్తోంది. కాంగోలో గడచిన వారం రోజుల్లో నమోదైన ఎఁపాక్స్ కేసుల్లో 70 శాతం మంది బాధితులు 18ఏళ్లలోపు వారే. ఆఫ్రికా దేశాల్లో ఇదే వ్యవధిలో 3 వేల 160 మంది కొత్తగా ఎంపాక్స్ బారిన పడగా 107 మరణాలు నమోదయ్యాయి. 2024లో ఇప్పటి వరకూ 26వేల 543 అనుమానిత కేసులు నమోదు కాగా.. 5 వేల 732 మందిపై ఎంపాక్స్ తీవ్ర ప్రభావం చూపింది. వారిలో 724 మంది మృత్యువాత పడినట్లు ది ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ తెలిపింది. ఈ మహమ్మారి కట్టడికి పారిశుద్ధ్య చర్యలతో పాటు ముందస్తు గుర్తింపునకు టెస్టుల సంఖ్య పెంచాల్సి ఉందని వివరించింది. 15 ఆఫ్రికా దేళాల్లో ఈ కేసులు అధికంగా నమోదవతుండగా.. అందులో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారు 40 శాతంగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. మరణాల రేటు కూడా 2.83శాతంగా ఉందని.. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయడం ద్వారా ఈ వైరస్ విస్తరణను అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఈ వైరస్ .. కరోనా మాదిరి గాలి ద్వారా వ్యాప్తి చెందదని నిపుణులు వెల్లడించారు.
Also Read: ఇండియాకు వచ్చేసిన Mpox.. అశ్రద్ధగా ఉంటే వైరస్ వ్యాప్తి తప్పదు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే