(Source: ECI/ABP News/ABP Majha)
CAA Rules: అసలేంటీ పౌరసత్వ సవరణ చట్టం? కేంద్రం గెజిట్‌లో ఏముంది?
CAA Rules Explained: కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో పలు కీలక నిబంధనలున్నాయి.
What is CAA: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (Citizenship (Amendment) Act) నేటి నుంచే (మార్చి 11 2024) అమల్లోకి వస్తుందని కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు హోం శాఖ గెజిట్ కూడా విడుదల చేసింది. 1955 నాటి చట్టంలో సవరణలు చేసిన మోదీ సర్కార్ 2019 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఈ బిల్‌ని ప్రవేశపెట్టింది. ఆ తరవాత ఆమోదం లభించింది. 2020లో అమలు చేయాలని చూసినప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా తాత్కాలికంగా ఆ చట్టాన్ని పక్కన పెట్టింది. దాదాపు ఐదేళ్ల తరవాత ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం కీలకంగా మారింది.
చట్టంలో ఏముంది..?
పౌరసత్వ సవరణ చట్టం ప్రధాన లక్ష్యం శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడం. అయితే..ఈ విషయంలో కొన్ని నిబంధనలు విధించింది కేంద్ర ప్రభుత్వం. 2014 డిసెంబర్ 31వ తేదీ కన్నా ముందు హింసకు గురై భారత్‌కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించనున్నారు. అర్హులెవరో కూడా ఈ గెజిట్‌లో స్పష్టంగా చెప్పింది కేంద్రం. భారత్‌లో 11 ఏళ్ల పాటు ఉన్న శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పించేలా పాత చట్టంలో ఓ నిబంధన ఉంది. దాన్ని పూర్తిగా సవరించింది మోదీ సర్కార్. గత 14 ఏళ్లలో కనీసం ఐదేళ్ల పాటు లేదంటే ఏడాది కాలంగా భారత్‌లోనే నివసించిన వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే..ఇందులో గిరిజన ప్రాంతాలను మాత్రం మినహాయించింది. అసోం, మేఘాలయా, మిజోరం, త్రిపురను మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో ఉండడం వల్ల అసోంలోని కర్బీ అంగ్‌లాంగ్, మేఘాలయలోని గారో హిల్స్, మిజోరంలోని చమ్‌కా, త్రిపురలోని పలు గిరిజన ప్రాంతాలను చట్టం నుంచి మినహాయించింది. 2019 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఈ బిల్ పాస్ అయిన వెంటనే ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల ముందే ఈ చట్టాన్ని అమలు చేసి తీరుతామని గత నెలలో కేంద్రహోం మంత్రి అమిత్‌షా తేల్చి చెప్పారు. ఇప్పుడు అనుకున్న విధంగానే అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
నిజానికి 2020లోనే ఈ చట్టాన్ని అమలు చేయాలని గట్టిగానే ప్రయత్నించింది మోదీ సర్కార్. కానీ అదే సమయంలో కరోనా సంక్షోభం ముంచుకొచ్చింది. దాదాపు రెండేళ్ల పాటు ఆ వైరస్‌తోనే పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడా సమస్య కూడా తీరిపోయింది. అందుకే ఇక ఆలస్యం చేయకుండా అమలు చేయనున్నట్టు ప్రకటించింది కేంద్రం. "అప్పుడంటే కరోనా వచ్చి ఆగిపోయాం. కానీ ఈ సారి మాత్రం ఎవరూ ఈ చట్టం అమలు కాకుండా అడ్డుకోలేరు" అని ఇటీవలే ఘాటైన వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. పరోక్షంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చురకలు అంటించారు. కొంత మంది కావాలనే ముస్లింలను తప్పుదోవ పట్టించి సమస్యలు సృష్టించారని మండి పడ్డారు.