Watch Video: అదే పనిగా టీవీ చూస్తోన్న చిన్నారి- వింత శిక్ష వేసిన తల్లిదండ్రులు!
అదే పనిగా టీవీ చూస్తోన్న ఓ చిన్నారికి తల్లిదండ్రులు వింత శిక్ష వేశారు.
Chinese Couple Punish Son: ఈ కాలం పిల్లలకు టీవీలు, స్మార్ట్ ఫోన్‌లు అంటే యమా క్రేజ్. ఎంత సేపు చూసినా వారికి తనివి తీరదు అన్నట్లు పిల్లలు వాటికి అతుక్కుపోతున్నారు. దీని వల్ల వారి కళ్లపై చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాకుండా వారి విద్య కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా టీవీలకు అతుక్కుపోయే చిన్నారులను వాటిని నుంచి తప్పించడానికి తల్లిదండ్రుల పాట్లు అన్నీఇన్నీ కావు. దీంతో విసిగిపోయిన చైనాలోని ఓ జంట.. తమ చిన్నారికి వింత శిక్ష వేసింది.
అదే పనిగా టీవీ చూస్తోన్న తమ చిన్నారిని సరైన మార్గంలో పెట్టేందుకు చైనాకు (China Couple) చెందిన ఆ జంట చాలా ఆలోచించింది. చివరికి ఓ వింత శిక్ష వేసింది. రాత్రంతా కూర్చొబెట్టి అతనితో బలవంతంగా టీవీ (Television) చూపించాలని డిసైడ్ అయింది.
ఇదీ జరిగింది
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో నివసిస్తోన్న ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల తల్లిదండ్రులు ఓ పనిమీద బయటకు వెళ్తూ.. హోంవర్క్ పూర్తి చేసుకుని.. రాత్రి 8.30కల్లా నిద్రపోవాలని బాలుడికి సూచించారు. అయితే వారు ఇంటికి ఆలస్యంగా తిరిగి రాగా.. చిన్నారి హోంవర్క్ పక్కన పెట్టేసి, అప్పటికీ టీవీ చూస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆగ్రహించిన తల్లి.. కుమారిడిని దారిలో పెట్టాలనుకుంది.
నిద్ర వస్తుందంటూ పడుకుంటున్న చిన్నారిని బలవంతంగా నిద్ర లేపింది. టీవీ ముందు కూర్చోబెట్టింది. టీవీ చూడాలని చిన్నారికి చెప్పింది. కుమారుడు నిద్రలోకి జారుకోకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టారు.
A couple in China forced the kid to watch television all night as punishment for sitting in front of the TV instead of doing homework. | via @philstarlifehttps://t.co/9SHZ3cjn0n
— The Philippine Star (@PhilippineStar) November 27, 2022
అలిసిపోయి
మొదట్లో ఆసక్తిగానే టీవీ చూసిన బాలుడు.. క్రమంగా అలసటతో కూర్చో లేకపోయాడు. మెలకువగా ఉండటం కష్టంగా మారింది. చివరకు ఏడుపు మొదలుపెట్టాడు. నిద్రపోతానంటూ వేడుకున్నాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇలా చిన్నారికి ఉదయం 5 వరకు వాళ్లు టీవీ చూపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అయింది. దీంతో ఆ తల్లిదండ్రులపై విమర్శలు వెల్లువెత్తాయి. పిల్లలకు ఇది చాలా కఠినమైన శిక్ష అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మానవహక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
కానీ తాము చేసిన పని చిన్నారిపై సానుకూల ప్రభావం చూపిందని ఆ తల్లి చెబుతోంది. ఇప్పుడు ఆ చిన్నారి.. టీవీ చూసే సమయం చాలా తగ్గించాడని ఆమె చెబుతోంది.
Also Read: FIFA World Cup 2022: అట్టుడికిన బెల్జియం- మొరాకో చేతిలో ఓటమితో ఫ్యాన్స్ ఆగ్రహం!