Budget 2025: బీమా ప్రీమియంలపై GST రద్దు, ప్రత్యేక పన్ను మినహాయింపులు - SBI రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
Term, Life Insurance: భారత బీమా నియంత్రణ & అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) పెట్టుకున్న "2047 నాటికి అందరికీ బీమా" లక్ష్యాన్ని సాధించడానికి తక్షణ చర్యలు అవసరమని SBI రిపోర్ట్ హైలైట్ చేసింది.

GST And Tax Exemptions On Insurance Premiums: ప్రజలు చెల్లించే ఆరోగ్య బీమా, జీవిత బీమా ప్రీమియంలపై GST, ఆదాయ పన్నులు తగ్గించాలని దేశవ్యాప్తంగా చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. బడ్జెట్ టైమ్ వచ్చిన ప్రతిసారీ దీనిపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, దేశంలో బీమా & ఆరోగ్య సంరక్షణ రంగాలను పునరుద్ధరించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన రిపోర్ట్‌లో సూచించింది. టర్మ్, ఆరోగ్య బీమా ప్రీమియంలపై GST & పన్నులను మినహాయించడం, ఆరోగ్య సంరక్షణ బడ్జెట్‌ను GDPలో 5 శాతానికి పెంచడం, వైద్య పరికరాలపై GST రేట్లను 5 శాతం -12 శాతానికి హేతుబద్ధీకరించడం వంటి విషయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణించాలని SBI పేర్కొంది.
"టర్మ్/ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా ప్రీమియంలపై GST/టాక్స్ ఉండకూడదు. NPS తరహాలో కొత్త/పాత పన్ను విధానాల్లో జీవిత/ఆరోగ్య బీమా కోసం ప్రత్యేక తగ్గింపు ఇవ్వాలి. APY, PM-SYM, PM-KMY, NPS వంటి అన్ని ప్రభుత్వ ప్రాయోజిత పెన్షన్ పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావచ్చు" అని రిపోర్ట్ సూచించింది.
బీమా పాలసీల స్వీకరణల్లో తగ్గుదల
మన దేశంలో, బీమా వ్యాప్తి FY23లో 4 శాతం & FY22లో 4.2 శాతంతో పోలిస్తే FY24లో 3.7 శాతానికి తగ్గింది. ఈ లోటును భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం బీమా ప్రీమియంల మీద GST, పన్నులు రద్దు చేయాలి లేదా కోత పెట్టాలి. ఇలాంటి ఆకర్షణీయమైన ప్రయోజనాలు కనిపిస్తేనే వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ప్రజలు ముందుకు వస్తారు.
ప్రజలను ప్రోత్సహించడానికి...
పాత & కొత్త పన్ను విధానాలలో జీవిత & ఆరోగ్య బీమా ప్రీమియంలకు ప్రత్యేక పన్ను మినహాయింపును ప్రవేశపెట్టడితే, ఆ ప్రయోజనాలు పొందడానికి ప్రజలు ముందుకు వస్తారు. రూ. 25,000-రూ. 50,000 వరకు ఇలాంటి ప్రయోజనాలను కల్పించవచ్చు. అటల్ పెన్షన్ యోజన (APY), ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (PM-SYM), ప్రధాన మంత్రి కిసాన్ మాన్-ధన్ (PM-KMY), & వ్యాపారుల కోసం జాతీయ పెన్షన్ పథకం వంటి ప్రభుత్వ ప్రాయోజిత పెన్షన్ పథకాలను ఒకే గొడుగు కిందకు చేర్చడం వల్ల వాటి లభ్యత & ప్రభావం పెరుగుతుంది.
భారతీయ కుటుంబాలకు సామాజిక భద్రత & ఆదాయ రక్షణను అందించడానికి MSME ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక బీమా కార్యక్రమం తీసుకురావాల్సిన కూడా అవసరం కూడా ఉంది. నియంత్రించలేని కారణాల వల్ల వచ్చే వ్యాపార నష్టాలను కవర్ చేసేలా MSME ప్రమోటర్ల కోసం ప్రత్యేక పథకం ఉండాలని కూడా SBI సిఫార్సు చేసింది.
ప్రభుత్వ వ్యయం రెట్టింపు కావాలి
ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ వ్యయం మరింత పెరగాల్సిన తరుణం వచ్చింది. 2025 నాటికి ఆరోగ్య సంరక్షణ కోసం GDPలో 2.5 శాతం కేటాయించాలని జాతీయ ఆరోగ్య విధానం 2017 లక్ష్యం. అయితే, యువ & వృద్ధాప్య జనాభా అవసరాలను తీర్చాలంటే దానిని 5 శాతానికి పెంచాలి.
ఆరోగ్య సంరక్షణ సెస్ నుండి వచ్చే ఆదాయాన్ని కేటాయించడం, పొగాకు & చక్కెర ఉత్పత్తులపై 35 శాతం GST స్లాబ్ విధించడం వల్ల వచ్చే డబ్బును ప్రజారోగ్య కార్యక్రమాలకు వినియోగించవచ్చని స్టేట్ బ్యాంక్ సూచించింది.
ఇక, వైద్య పరికరాలపై GST రేట్లను ప్రస్తుతమున్న 5-18 శాతానికి బదులుగా 5-12 శాతానికి మార్చడం వల్ల వాటి వినియోగం పెరుగుతుంది. తద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరిగి తయారీదారులు & పంపిణీదారుల ఖర్చులు తగ్గుతాయి. బడ్జెట్ ద్వారా ఈ చర్యలను అమల్లోకి తీసుకొస్తే, భారతదేశ బీమా & ఆరోగ్య సంరక్షణ రంగాలు బలోపేతం కావడంతో పాటు ప్రజలకు ఆర్థిక వృద్ధి & సామాజిక భద్రత పెరుగుతుందని SBI రిపోర్ట్ సూచించింది.
మరో ఆసక్తికర కథనం: విద్యా వ్యవస్థకు ఈ బడ్జెట్లోనైనా న్యాయం జరుగుతుందా.. నిపుణులు చేసిన కొన్ని సిఫార్సులు ఇవే





















