United Nations Report: భారత్‌లో 50 లక్షల మంది వలస వెళ్లారట, కారణమేంటో తెలుసా
వాతావరణ మార్పుల కారణంగా భారత్‌లో 50 లక్షల మంది అంతర్గతంగా వలస వెళ్లారని యూఎన్ నివేదిక వెల్లడించింది.
50 లక్షల మంది వలసపోయారట..
వాతావరణ మార్పులతో ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. సమయానికి రుతుపవనాలు రావటం లేదు. ఎండల తీవ్రత ఏటా పెరుగుతోంది. చలి కూడా తట్టుకోలేనంత స్థాయిలో ఉంటోంది. కర్బన ఉద్గారాలు మితిమీరి గాల్లో కలుస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ సమస్య వల్ల ఆర్థికంగానే కాక సామాజికంగానూ నష్టం కలుగుతోంది. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల కారణంగా 2021లో దేశవ్యాప్తంగా 50లక్షల మంది అంతర్గతంగా వలసలు వెళ్లారని తేల్చి చెప్పింది ఐక్యరాజ్య సమితి వెలువరించిన నివేదిక. ఆహార అభద్రత, అశాంతి, వాతావరణ మార్పుల కారణంగా గతేడాది ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది వేరే ప్రాంతాలకు తరలిపోయారని యూఎన్ రెఫ్యుజీ ఏజెన్సీ వెల్లడించింది. ఈ రిపోర్ట్‌లోనే భారత్ గురించి కూడా ప్రస్తావించింది.
ఆహార కొరత, ద్రవ్యోల్బణమే కారణాలు..
చైనాలో అత్యధికంగా 60 లక్షల మంది, ఫిలిప్పైన్స్‌లో 57లక్షల మంది, భారత్‌లో 50 లక్షల మంది వలస వెళ్లినట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. సొంత ఊళ్లను, ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వలస పోయే వారి సంఖ్య ఏటా పెరుగుతోందని, వారిలో కొద్ది మంది మాత్రమే మళ్లీ తమ స్వస్థలానికి వస్తున్నారని యూఎన్ ఏజెన్సీ వివరిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధమూ ఈ వలసలకు పరోక్ష కారణమైందని చెబుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఈ స్థాయిలో వలసలు నమోదైంది ఇప్పుడేనని అంటోంది. 2021 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 90 లక్షల మందికపైగా బలవంతంగా వలస వెళ్లాల్సి వచ్చిందని వారిలో అత్యధిక మంది నిరాశ్రయులే ఉన్నారని స్పష్టం చేసింది యూఎన్ నివేదిక. ఆహార కొరత, ద్రవ్యోల్బణం, వాతావరణ సంక్షోభం లాంటి సమస్యలు వలసలు పెంచుతున్నాయి. ఇరుగు పొరుగు దేశాల్లోకి వెళ్లి అక్కడే ఏదో ఓ పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న వాళ్లు లక్షల్లో ఉన్నారు.
వలస వెళ్లే వారంతా అసంఘటిత కార్మికులే..!
వాతావరణ మార్పుల వల్ల సరైన సమయానికి వర్షాలు కురవటం లేదు. ఈ కారణంగా వ్యవసాయ రంగం దెబ్బ తింటోంది. ఫలితంగా రైతులతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లోని కూలీలంతా పొట్ట పోషించుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు దేశంలో జరుగుతోంది అదే. లక్షలాది మంది వలస వెళ్తున్నారంటే కారణం..మూడు పూటలా తిండి తినే అదృష్టం లేకపోవటమే. వలస వెళ్లే వారంతా అసంఘటిత కార్మికులే. వీరి ఉపాధికి ఏ విధమైన భరోసా ఉండదు. రోజంతా కష్టపడితే తప్ప జేబు నిండదు. ఇలాంటి వారికి ఉపాధి దొరకని దుస్థితిలో పని కోసం వేరే చోటకు వెళ్లిపోతున్నారు. ఇలా ఏటా అంతర్గత వలసలు దేశంలో పెరిగిపోతున్నాయి.
Also Read: Agneepath Scheme: ఈ దేశాల్లోనూ అగ్నిపథ్ తరహా పథకం, అక్కడ ఎలా అమలు చేస్తున్నారో తెలుసా