Agneepath Scheme: ఈ దేశాల్లోనూ అగ్నిపథ్ తరహా పథకం, అక్కడ ఎలా అమలు చేస్తున్నారో తెలుసా
అగ్నిపథ్ లాంటి పథకాలు విదేశాల్లోనూ అమలవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది.
అగ్నిపథ్ లాంటి పథకం అమలవుతున్న దేశాలివే..
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ గురించి నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో విదేశాల్లోనూ ఈ తరహా పథకాలు అమల్లో ఉన్నాయన్న చర్చ తెరపైకి వస్తోంది. అనవసరంగా దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని అంటోంది కేంద్ర ప్రభుత్వం. విదేశాల్లో ఇలా కాంట్రాక్ట్ పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేసుకుంటున్నారని వివరిస్తోంది. ఇంతకీ ఏయే దేశాల్లో ఈ తరహా పథకాలున్నాయి..? వాటిని ఎలా అమలు చేస్తున్నారు..? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
అమెరికా
2017 లెక్కల ప్రకారం అమెరికాలో 13 లక్షల మంది యాక్టివ్ ఆర్మీ ఉండగా, 8 లక్షల మంది రిజర్వ్ ఫోర్సెస్ సిబ్బంది ఉన్నారు. వాలంటరీ
పద్ధతిలో వేలాది మంది సైనికులను రిక్రూట్ చేసుకుంటోంది అగ్రరాజ్యం. రెండు ప్రపంచ యుద్ధాలు సహా, కొరియన్, వియత్నాం యుద్ధ సమయాల్లో పురుషులందరూ కచ్చితంగా మిలిటరీలో చేరాలన్న నిబంధన విధించింది. నాలుగేళ్ల కాలానికి సైనికులను రిక్రూట్ చేసుకునే విధానాన్ని ప్రస్తుతం అమెరికా అనుసరిస్తోంది. తరవాత వాళ్లు విధుల నుంచి తప్పుకుంటారు. అత్యవసర సమయాల్లో మళ్లీ వీరిని నియమించుకుంటారు. 20 ఏళ్ల పాటు సర్వీస్‌లో ఉన్న వారికి పెన్షన్ అందిస్తోంది అక్కడి ప్రభుత్వం. ముందుగానే విధుల నుంచి తప్పుకున్న వారికీ కొన్ని ప్రయోజనాలు అందిస్తోంది.
చైనా
చైనాలో 18 ఏళ్లు పైబడిన మగవాళ్లందరూ తప్పకుండా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో పని చేయాలని నిబంధన విధించారు. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ప్రతిపౌరుడూ సైన్యంలో పని చేయాలి. ఇదో బాధ్యతాయుతమైన పనిగా భావించి అందరూ ముందుకు రావాలి. మూడేళ్ల పాటు సైన్యంలో పని చేసి తరవాత విధుల నుంచి తప్పుకోవాలి. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మాత్రం తప్పకుండా నాలుగేళ్ల పని చేయాల్సిందే. గరిష్ఠంగా 12 ఏళ్లు మాత్రమే మిలిటరీలో పని చేయాలన్నది అక్కడి నిబంధన.
రష్యా
రష్యా సైనికుల్ని రిక్రూట్ చేసుకునే విషయంలో హైబ్రిడ్ విధానం పాటిస్తోంది. కేవలం ఓ ఏడాది మాత్రమే మిలిటరీలో పని చేసే అవకాశం కల్పిస్తోంది. 18-27 ఏళ్ల వయసున్న మగ వారంతా తప్పనిసరిగా ఓ ఏడాది పాటు మిలిటరీలోని సాయుధ బలగంలో పని చేయాలి. ఏడాదిలో రెండు విడతల వారీగా సైనికుల్ని ఎంపిక చేసుకుంటారు. ఏప్రిల్ 1 నుంచి జులై 15వ తేదీ వరకూ ఓ సారి, అక్టోబర్ 1 వతేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకూ మరో విడత ఎంపిక జరుగుతుంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఓసారి మొదలయ్యాక రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి రాలేదంటే వారికి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు.
ఇజ్రాయేల్
1948 నుంచే ఇక్కడ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. పురుషులు తప్పకుండా 30 నెలల పాటు, మహిళలు
24 నెలల పాటు సర్వీస్ చేయాలి. వీరిలో 10% మంది సిబ్బంది పర్మినెంట్ క్యాడర్‌లోకి ఎంపికవుతారు. ఏడేళ్ల పాటు తప్పకుండా విధుల్లో ఉండాలి. కనీసం 12 సంవత్సరాల సర్వీస్ ఉంటే పెన్షన్ అందిస్తారు. ఇజ్రాయేల్‌లోని అరబ్బులకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవు.
ఫ్రాన్స్
ఫ్రాన్స్‌లో ఆర్మీస్ ఫ్రాన్‌సెయిసెస్ పేరిట కాంట్రాక్ట్ తరహాలో సైనికులను రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏడాది పాటు తప్పకుండా పని చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ ఐదేళ్లకు కూడా పొడిగిస్తారు. మూడు నెలల పాటు శిక్షణనిస్తారు. 19ఏళ్ల పాటు సర్వీస్ అందించిన వారికే పెన్షన్ పొందే అర్హత ఉంటుంది.