Top Headlines Today: ఆరు నెలలు లీడర్లకు ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసిన జగన్- నేడు తెలంగాణలో అమిత్‌షా టూర్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today
ఆరు నెలలు జనాల్లోనే
రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పని చేస్తున్నారు. వరుస కార్యక్రమాలతో పార్టీ నేతలంతా ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే ఆరు నెలలు శాసనసభ్యులు, మండలి సభ్యులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఇళ్లకు పరిమితం కావొద్దని సీఎం జగన్ హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, 52 నెలల పాటు సువర్ణాక్షరాలతో లిఖించదగిన పాలన అందించామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నిరుద్యోగుల్లో నిరాశ
తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం కోటి ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ ఏడాదైనా ఉద్యోగాలు పొందాలన్న వారి కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ పక్క పరీక్షల నిర్వహణ చేతకాక డీలాపడిపోయిన టీఎస్‌పీఎస్సీ, మరోపక్క పోలీసు ఉద్యోగాల నియామకాల్లో కోర్టు కేసులు వెరసి.. నిరుద్యోగ యువత ఓర్పును పరీక్షిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు రద్దయింది. పేపర్ లీక్ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ షెడ్యూలు మారాయి. గ్రూప్-2 పరీక్ష వాయిదాపడింది. గ్రూప్-4 ఫలితాలు వచ్చే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి చేరింది. దీంతో ఉద్యోగార్థులో నిరుత్సాహం, అసహనం పెరిగిపోతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆదిలాబాద్‌లో పవన్ పర్యటన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకుడు డా. ధారావత్ నరేంద్ర నాయక్ అన్నారు. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం (అక్టోబరు 9) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు డా. ధారావత్ నరేంద్ర నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉంటుందని తెలిపారు. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ "వారాహి యాత్ర" ఖానాపూర్ నియోజకవర్గానికి రానున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చంద్రబాబు అరెస్టుపై జగన్ స్పందన
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. చంద్రబాబును కక్షసాధింపుతో అరెస్టు చేయలేదని, తనకు ఎలాంటి కక్ష లేదన్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు అరెస్టు సమయంలో తాను దేశంలో లేనని, తాను లండన్‌లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిందని సీఎం జగన్ వివరించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన వైఎస్సార్ సీపీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నా ఊళ్ళో ఉన్నా పెద్ద తేడా లేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నేడు అమిత్‌షా రాక
బీజేపీ ఎన్నికల శంఖారావం ఆదిలాబాద్ నుంచే ప్రారంభం అవుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఎంపి సోయం బాపురావ్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సభ ప్రాంగణాన్ని వేరు వేరు సమయంలో పర్యవేక్షించారు. సాయంత్రం బిజేపి రాష్ట్ర ప్రధనకార్యదర్శి గుజ్జుల ప్రెమేందర్ రెడ్డి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గాలికి వదిలేసి కేవలం తమ కుటుంబానికే అంతం అయిన తెలంగాణ పాలనను అరికట్టేందుకు ఆదిలాబాద్ జన గర్జన సభ నిర్వహిస్తున్నామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మొదటి రోజే ఝలక్
తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైందో లేదో ఇక అక్రమంగా డబ్బులు, విలువైన వస్తువుల రవాణా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. షెడ్యూల్ విడుదల కాగానే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తున్నందున పోలీసులు కూడా దానిపై ఫోకస్ చేశారు. నాయకులు ఓటర్లకు పంచేందుకు డబ్బులు, గిఫ్టులు, విలువైన వస్తువులు తరలిస్తుండగా వాటిని పోలీసులు పట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో నగదు, బంగారం, వెండిని ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకపోవడం వల్లే వీటిని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ప్రమాదకరంగా న్యూజిలాండ్
నెదర్లాండ్స్‌ను 99 పరుగుల తేడాతో ఓడించిన తర్వాత న్యూజిలాండ్... ఈ ప్రపంచ కప్‌లో భారత్ సహా ఇతర జట్లను హెచ్చరికలు పంపించింది. వాస్తవానికి ప్రస్తుతం న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఆడటం లేదు. అయితే ఈ మైనస్ ఉన్నప్పటికీ కివీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ మంచి నీళ్లు తాగినంత సులభంగా ఓడించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కివీస్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఒలింపిక్స్‌లో క్రికెట్
క్రికెట్ అభిమానులకు శుభవార్త. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అవకాశం ఉంది. క్రికెట్‌తో పాటు ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్ బాల్, సాఫ్ట్‌బాల్‌లను కూడా చేర్చడంపై చర్చ జరుగుతోంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028లో జరగాల్సి ఉంది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు ఆలోచిస్తున్నట్లు గార్డియన్ తమ కథనంలో పేర్కొంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) 141వ సెషన్‌లో ఈ విషయాన్ని ప్రకటించనున్నట్లు కూడా చెబుతున్నారు. ఈ సెషన్‌ను ముంబైలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ట్రెండీ కాస్ట్యూమ్స్‌తో కింగ్ అట్రాక్షన్
కింగ్ అక్కినేని నాగార్జున 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. హోస్ట్‌గా ఇప్పటికే నాలుగు సీజన్లను సక్సెస్ ఫుల్‌గా నడిపిన నాగ్.. ఇప్పుడు 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 7'తో అదరగొడుతున్నారు. తప్పు చేసినప్పుడు కంటెస్టెంట్స్ మీద ఫైర్ అవుతూ, హౌస్‌లో వాతావరణాన్ని హీట్ ఎక్కిస్తున్నారు. అలానే ఫన్నీ గేమ్స్‌తో తన సరదా మాటలతో వారిని నవ్విస్తూ బ్యాలన్స్‌గా షోని నిర్వహిస్తున్నారు. వీకెండ్ ఎపిసోడ్స్‌లో మంచి టీఆర్పీ రేటింగ్స్ నమోదయ్యేలా చేస్తున్నారు. ఇక నాగార్జున ఈ సీజన్లో ట్రెండీ కాస్ట్యూమ్స్‌తో అట్రాక్ట్ చేస్తున్నారు. కానీ ఆయన స్టైలింగ్‌ను ఫాలో అవ్వాలనుకునే వారు మాత్రం, వాటి రేట్లు తెలుసుకొని నోళ్లు వెళ్లబెడుతున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆహాలో ‘సర్వం శక్తిమయం’ వెబ్ సిరీస్
100 శాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టిన ప్రాంతీయ ఓటీటీ 'ఆహా'. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను అందిస్తూ, అనతి కాలంలోనే విశేష ఆదరణ దక్కించుకుంది. బ్లాక్ బస్టర్ చిత్రాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీసులు, డబ్బింగ్ చిత్రాలతో పాటుగా స్పెషల్ షోలను స్ట్రీమింగ్ చేస్తూ వ్యూయర్ షిప్ పెంచుకుంటూ వెళ్తోంది. దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కు ధీటుగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ‘సర్వం శక్తిమయం’ అనే వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి