Jagan About Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన సీఎం జగన్, ఎలాంటి కక్ష లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు.
YS Jagan responds on arrest of Chandrababu:
విజయవాడ: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. చంద్రబాబును కక్షసాధింపుతో అరెస్టు చేయలేదని, తనకు ఎలాంటి కక్ష లేదన్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు అరెస్టు సమయంలో తాను దేశంలో లేనని, తాను లండన్‌లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిందని సీఎం జగన్ వివరించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన వైఎస్సార్ సీపీ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నా ఊళ్ళో ఉన్నా పెద్ద తేడా లేదన్నారు.
మాజీ సీఎం చంద్రబాబును ఎవరు కక్షసాధింపుతో అరెస్టు చేయలేదని చెప్పారు. ఒకవేళ అదే నిజమనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉన్నాడని గుర్తుచేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పుంధేశ్వరి, సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారుని జగన్ చెప్పారు. కేంద్రంలోని ఇన్‌కం ట్యాక్స్, కేంద్రంలోని ఈడీ చంద్రబాబుపై విచారణ జరిపి అవినీతిని నిరూపించి, దోషులను అరెస్టు కూడా చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోకి సీబీఐ, ఈడీ, ఐటీలను అడుగు పెట్టనివ్వలేదని గుర్తుచేశారు.
అవినీతి చేశారని ఆధారాలతో కోర్టులు రిమాండుకు పంపించినా చంద్రబాబు అమాయకుడని కొన్ని మీడియాలు దుష్ప్రచారం చేస్తున్నాయని జగన్ అన్నారు. అంటే అవినీతికి పాల్పడ్డారని రుజువైనా సరే చంద్రబాబును అరెస్ట్ చేయకూడదు అని వాదించడం విడ్డూరంగా ఉందన్నారు.
టీడీపీ, దత్తపుత్రుడి పార్టీ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాని, ఎంత మంది కలిసినా కూడా రెండు సున్నాలు కలిసినా వచ్చే రిజల్ట్ సున్నానేని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడు జీవితమంతా కూడా చంద్రబాబును భుజానికి ఎత్తుకోవడమేనని, చంద్రబాబు అవినీతిలో దత్తపుత్రుడు పార్ట్‌నర్ అని విమర్శించారు. అధికారంలోకి రావడం దోచుకోవడం, పంచుకోవడమే వీరికి తెలిసిన పాలిటిక్స్ అన్నారు.
నాలుగు కార్యక్రమాలను ప్రకటించిన సీఎం జగన్
వై ఏపీ నీడ్స్ జగన్ : ప్రజలకు మరింత మంచి చేయడానికి మళ్లీ జగన్ రావాలని, నవంబర్ 1 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపడతాం అన్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 10 వరకు కొనసాగుతుందని తెలిపారు.
25 నుంచి బస్సు యాత్ర : అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు వైసీపీ నేతలు బస్సుయాత్ర చేయనున్నారు. మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలో ఎమ్మెల్యేలు, సీనియర్ల ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. ఈ బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలుంటారు.
డిసెంబర్ 11 నుంచి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం : డిసెంబర్ 11 నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబురం జరగనుందని తెలిపారు. గ్రామస్థాయిలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తిస్తాం. భారత్‌లో వై నాట్ ఏపీ పరిస్థితి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పెద్ద క్రీడా సంబరం అన్నారు.
జనవరి 1 నుంచి పెన్షన్ పెంపు : జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ పెంపు కార్యక్రమం చేపడతాం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.3000 పెన్షన్ పెంపు అందిస్తాం అని జగన్ చెప్పారు. అవ్వాతాతలు, వితంతువులకు రూ.3వేల పెన్షన్. ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేల పెన్షన్ అందిస్తాం అన్నారు.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాక ముందు 39 లక్షల మందికి పెన్షన్లు. మేము అధికారంలోకి వచ్చాక 66లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని, నెలకు రూ.2వేల కోట్ల భారం భరిస్తున్నామని నేటి కార్యక్రమంలో వివరించారు.