Cricket in Olympics: సుదీర్ఘ స్వప్నం సాకారం అవుతుందా? - ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడబోతున్నామా?
2028 లాస్ ఏంజెల్స్ ఒలంపిక్స్‌లో క్రికెట్‌ను కూడా చేర్చే అవకాశం ఉంది.
Cricket Game In Los Angeles Olympics: క్రికెట్ అభిమానులకు శుభవార్త. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అవకాశం ఉంది. క్రికెట్‌తో పాటు ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్ బాల్, సాఫ్ట్‌బాల్‌లను కూడా చేర్చడంపై చర్చ జరుగుతోంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028లో జరగాల్సి ఉంది. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు ఆలోచిస్తున్నట్లు గార్డియన్ తమ కథనంలో పేర్కొంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) 141వ సెషన్‌లో ఈ విషయాన్ని ప్రకటించనున్నట్లు కూడా చెబుతున్నారు. ఈ సెషన్‌ను ముంబైలో నిర్వహించనున్నారు.
దాదాపు 128 ఏళ్ల తర్వాత
అయితే ఇంతకు ముందు ఒలింపిక్స్‌లో ఒకే ఒక్కసారి క్రికెట్ ఆడారు. 1900లో ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం అయింది. ఆ సంవత్సరం పారిస్‌లో ఇంగ్లండ్, ఫ్రాన్స్ మధ్య స్వర్ణ పతకం కోసం మ్యాచ్ జరిగింది. మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల పోటీలు టి20 ఫార్మాట్‌లో ఉంటాయి.
ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను భాగం చేయడం ద్వారా దక్షిణాసియా ప్రేక్షకులను కూడా ఆకర్షించాలని ఐవోసీ ప్రణాళికలు రచించింది. కేవలం దీనికి సంబంధించిన బ్రాడ్‌కాస్టింగ్ డీల్స్ నుంచే భారీ మొత్తాన్ని ఆర్జించగలదని తెలుస్తోంది.
ప్రసార హక్కుల ద్వారా భారీ లాభాలు
మీడియా నివేదికల ప్రకారం 2024 ఒలింపిక్స్ కోసం భారతదేశంతో ప్రసార ఒప్పందంలో ఐవోసీ 15.6 మిలియన్ పౌండ్లను (సుమారు రూ.150 కోట్లు) పొందుతుందని భావిస్తున్నారు. అయితే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చినట్లయితే, ఈ మొత్తం ఏకంగా 150 మిలియన్ పౌండ్లకు చేరుకునే అవకాశం ఉంది.
అంటే మనదేశ కరెన్సీలో రూ.1500 కోట్లకు పైమాటే. గతేడాది కామన్వెల్త్ క్రీడల్లోనే మహిళల క్రికెట్ అరంగేట్రం చేసింది. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల క్రికెట్ కూడా భాగం అయింది.
మరోవైపు ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి పోరులో అద్భుత విజయం సాధించిన టీమిండియా పాక్‌తో అక్టోబర్ 14వ తేదీన హై ఓల్టేజ్ మ్యాచ్‌లోనూ గెలుపొందాలని పట్టుదలగా ఉంది. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తో జరిగిన పోరులో భారత జట్టు నారింజ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. మరోసారి టీమిండియా ఈ జెర్సీతోనే బరిలోకి దిగుతుందని సామాజిక మాధ్యమాల్లో వార్త వైరల్‌గా మారింది.
ఈ వార్తలపై బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్ స్పష్టత ఇచ్చారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ బ్లూ కలర్ జెర్సీతోనే వాడుతుందని తేల్చి చెప్పారు. పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమ్ ఇండియా వేరే రంగు డ్రెస్ ధరిస్తుందన్న వార్తలను ఆయన ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని క్లారిటీ ఇచ్చారు.
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఇటీవలే జరగడం లేదు. ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో మాత్రమే భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. దీని కారణంగా పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించడం లేదు. 2016 సంవత్సరంలో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఇక్కడికి వచ్చిన పాకిస్తాన్ జట్టు తిరిగి ఏడేళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ కోసం భారత్‌లో అడుగుపెట్టింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial