Andhra News: జనవరి 4 నుంచి 'జయహో బీసీ' - బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామన్న నారా లోకేశ్
Nara Lokesh: వైసీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని, అధికారంలోకి రాగానే వారికి న్యాయం చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
Nara Lokesh Comments on Jayaho BC Meet: రాష్ట్రంలో జనవరి 4 నుంచి 'జయహో బీసీ' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఈ కార్యక్రమ వివరాలను శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో వెల్లడించారు. సీఎం జగన్ (CM Jagan) బీసీల ద్రోహి అని, వైసీపీ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయాలపై వారిలో చైతన్యం కల్పించేందుకే ఈ కార్యక్రమం అని చెప్పారు. 2 నెలల పాటు 'జయహో బీసీ' (Jayaho BC) కొనసాగుతుందని, తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బటన్ నొక్కితే బీసీ సర్టిఫికెట్ అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బీసీలకు అవసరమైన ఇన్ పుట్ సబ్సిడీ, వారికి అనుకూల విధానాలు రూపొందిస్తామన్నారు.
వైసీపీ హయాంలో బీసీలకు ఇబ్బందులే
వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ సోదరులను తీవ్ర ఇబ్బందులు పెట్టినట్లు నారా లోకేశ్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించడంతో 16 వేల మంది బీసీలకు అవకాశం లేకుండా చేసిందని మండిపడ్డారు. 8 వేల ఎకరాల బీసీల అసైన్డ్ భూములను వెనక్కు తీసుకుందని, 'ఆదరణ' పథకాన్ని రద్దు చేసిందని అన్నారు. పాదయాత్రలో 'ఆదరణ' పథకం ద్వారా పనిముట్లు అందలేదని పలువురు తన దృష్టికి తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పినా, నిధులు విధుల్లేవని ఎద్దేవా చేశారు. జీవో 117 ద్వారా ప్రభుత్వం మత్స్యకారుల వెన్నెముక విరగ్గొట్టిందని విమర్శించారు. పట్టు రైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు. బీసీల కోసం పోరాడుతున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి, వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడులపై అక్రమ కేసులు పెట్టారని, ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడు నందం సుబ్బయ్యను చంపేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దుకాణం ధ్వంసం చేశారని శ్రీకాళహస్తి పర్యటనలో ఓ మహిళ చెప్పిందని తెలిపారు.
బీసీలకు ప్రత్యేక నిధి
బీసీలు బలహీనులు కాదు, బలవంతులన్నదే టీడీపీ నినాదమని నారా లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశమేనని గుర్తు చేశారు. ఇప్పటికే మినీ మేనిఫెస్టోలో బీసీలకు రక్షణ చట్టం పేరిట ప్రాధాన్యమిచ్చామని, టీడీపీ అధికారంలోకి వచ్చాక వారికి శాశ్వత కుల ధ్రువీకరణ పత్రం అందిస్తామని హామీ ఇచ్చారు. బీసీ ఉపకులాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వారికే ఖర్చు చేస్తామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించే వర్క్ షాప్ ద్వారా 'జయహో బీసీ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టి క్షేత్రస్థాయిలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు వెళ్తామని పేర్కొన్నారు.
Also Read: YSRCP Leaders on Jagan: వంశీకృష్ణ, రాంబాబు తర్వాత పార్థసారథి-వైసీపీలో పెరుగుతున్న అసంతృప్త స్వరాలు