Gupta Brothers Arrested In UAE: యూఏఈలో గుప్తా బ్రదర్స్ అరెస్ట్, తమకు అప్పగించాలంటున్న దక్షిణాఫ్రికా
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గుప్తా బ్రదర్స్‌ని అరెస్ట్ చేసిన యూఏఈ పోలీసులు.
యూఏఈలో గుప్తా సోదరులు అరెస్ట్
దక్షిణాఫ్రికాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, భారత మూలాలున్న గుప్తా బ్రదర్స్‌లో ఇద్దరు అరెస్టయ్యారు. యూఏఈ రాజేశ్ గుప్తా, అతుల్ గుప్తాను అరెస్టు చేసినట్టు దక్షిణాఫ్రికా మీడియా వెల్లడించింది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమా హయాంలో గుప్తా బ్రదర్స్ భారీస్థాయి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎప్పటి నుంచో ఈ అంశంపై వివాదం నడుస్తోంది. నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం యూఏఈ వీరిని దక్షిణాఫ్రికాకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా, యూఏఈ మధ్య ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు సౌతాఫ్రికా న్యాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో యూఏఈ ఏ సహకారం కోరినా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
దక్షిణాఫ్రికాకు అప్పగిస్తారా..?
రాజేశ్ గుప్తా, అతుల్ గుప్తా, అజయ్ గుప్తా...గుప్తా బ్రదర్స్‌గా ప్రాచుర్యం పొందారు. వీరు ముగ్గురూ అవినీతికి పాల్పడగా వీరిలో ఇద్దరు మాత్రమే అరెస్టయ్యారు. మూడో సోదరడు అజయ్ గుప్తా అరెస్ట్‌పై ఎలాంటి సమాచారమూ వెల్లడించలేదు. దక్షిణాఫ్రికా ప్రభుత్వ పరిధిలోని సంస్థల నుంచి భారీ మొత్తంలో కరెన్సీని కాజేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ గుప్తా బ్రదర్స్. ఈ విషయమై విచారణ కొనసాగుతుండగానే దుబాయ్‌కు పరారయ్యారు. అప్పటి నుంచి యూఏఈ పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు. వీరిని అరెస్ట్ చేయాలంటూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం యూఏఈని విజ్ఞప్తి చేసింది. వెంటనే యూఏఈ రెడ్ కార్నర్ నోటీస్‌లు జారీ చేసి వీరిని అరెస్ట్ చేసింది. 2021 ముందు వరకూ ఈ రెండు దేశాల మధ్య నేరస్థుల అప్పగింతపై ఎలాంటి ఒప్పందమూ లేదు. ఎప్పుడైతే గుప్తా బ్రదర్స్ దుబాయ్‌కు పారిపోయారో అప్పుడే ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు దక్షిణాఫ్రికా గట్టి ప్రయత్నాలే చేసింది. ఈ విషయమై ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది. చివరకు 2021 ఏప్రిల్‌లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఆ అగ్రిమెంట్‌కు అనుగుణంగా గుప్తా బ్రదర్స్‌ని అప్పగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
రూ. 7 వే కోట్ల అవినీతికి పాల్పడిన గుప్తా బ్రదర్స్
2009 నుంచి 2018 వరకూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఉన్నారు జాకబ్ జుమా. జుమాకు, గుప్తా బ్రదర్స్‌కు ఆ సమయంలో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పటికే దక్షిణాఫ్రికాలో బడా వ్యాపారవేత్తలుగా ఎదిగారు గుప్తా సోదరులు. అధ్యక్షుడితో స్నేహం బలపడ్డాక ఆ మైత్రిని తమ అవసరాలకు అనుగుణంగా వాడుకున్నారు గుప్తా సోదరులు. కేబినెట్ మంత్రుల నియామకంలోనూ వీరి హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. గుప్తా బ్రదర్స్‌పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాక 2018లో జాకబ్ జుమా తప్పని పరిస్థితుల్లో అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గుప్తా బ్రదర్స్ మొత్తంగా 7 వేల కోట్ల రూపాయలకుపైగా అవినీతికి పాల్పడినట్టు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.