Many Countries are going extinct:మరో 50 ఏళ్లలో అంతరించిపోనున్న సగం దేశాలు - ఎలాన్ మస్క్ హెచ్చరిక - ఇది వంద శాతం నిజం !
Population crisis: ప్రపంచంలో సగం దేశాలు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యాబై ఏళ్ల తర్వాత సగం దేశాలు అంతరించి పోతాయని ఎలాన్ మస్క్ జోస్యం చెబుతున్నారు.
Many Countries are going extinct: పిల్లల్ని కనండి ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పదహారు మందిని కనండి అని పిలుపునిచ్చే రాజకీయ నేతలు మన చుట్టూ కనిపిస్తున్నారు. నిజానికి మన దేశ నేతలుకాస్త ముందుగా మేలుకుని ఈ పిలుపునిస్తున్నారు. ప్రజలు పాటిస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే .. ఇప్పుడు ఇలాంటి పిలుపు తాము ఎప్పుడో ఇవ్వనందుకు ప్రపంచంలో సగం దేశాలు చింతిస్తున్నాయి. తమ దేశం అంతరించి పోతుందని కంగారు పడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పిలుపునిచ్చిన ఆయా దేశాల ప్రజలు స్పందించడంలేదు. జనాభా తగ్గిపోతోంది.
జనాభా సంక్షోభంలో ఎన్నో దేశాలు !
రష్యాలో జనాభా తగ్గిపోతోందని బలవంతంగా పిల్లల్ని కనే స్కీమ్ ను అమలు చేయాలని పుతిన్ భావిస్తున్నారు. జపాన్, చైనా, బ్రెజిల్, సింగపూర్, దక్షిణ కొరియా అలా అనేక దేశాల్లో ఇదే పరిస్థితి. జనాబా సంక్షోభంలో మునిగిపోతున్నాయి. సింగపూర్ లో బేబీ క్రైసిస్ ఏర్పడి అంతరించి పోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఓ న్యూస్ పై టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ స్పందించారు. సింగపూర్ మాత్రమే కాదని ఎన్నో దేశాలు అంతరించిపోబోతున్నాయని తేల్చేశారు.
Singapore (and many other countries) are going extinct https://t.co/YORyakBynm
— Elon Musk (@elonmusk) December 5, 2024
పెరిగిపోతున్న వృద్ద దేశాలు !
ప్రపంచంలో ఆసియా, యూరప్ దేశాల్లో అత్యధిక వృద్ధులు నివసిస్తున్నారు. 65 ఏళ్లకు మించిన వయసున్న వారు జపాన్ జనాభాలో 28 ఉంటే, 23 శాతం వృద్ధ జనాభాతో ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఆయుర్దాయం పెరిగిపోవడం, జననాలు తగ్గిపోవడంతో జపాన్, ఇటలీల్లో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోవడం వల్ల సమస్యలు అవుతున్నాయి. 2025-40 మధ్య కాలంలో జపాన్‌లో పనిచేసే ప్రజలు అంటే 20-64 ఏళ్లు కోటి మందికి పడిపోతుందని తేల్చారు. అంటే పని చేసేవారు తగ్గిపోతారు. వృద్ధులు పెరిగిపోతారు. ఇప్పుడున్న జననాల రేటు ప్రకారం చూస్తే ఆ కోటి ముంది కూడా తగ్గిపోతారు. ఇలాంటి సంక్షోభం అనేక దేశాల్లో ఉంది. అవన్నీ అంతరించి పోతాయని ఎలాన్ మస్క్ జోస్యం చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే అందులో వింత ఏమీ లేదని అనుకోవచ్చు.
భారత్‌కూ గడ్డు పరిస్థితి !
1950లో దేశంలో సంతానోత్పత్తి రేటు 6.18గా ఉండేది. అధిక జనాభా కారణంగా ఆహార కొరత వంటి సమస్యలు తలెత్తడంతో 1951 నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఇద్దరిని మించి కనవద్దని అవగాహన కల్పించారు. దీంతో క్రమంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వచ్చింది. భారత్‌లో సంతానోత్పత్తి ఇలాగే కొనసాగితే 2050 నాటికి 1.29కు పడిపోతుంది. అంటే దేశంలో వృద్ధుల జనాభా భారీగా పెరగడంతో పాటు మొత్తం జనాభా సంఖ్య తగ్గిపోనున్నది. ఇదే జరిగితే దేశానికి బలంగా ఉన్న శ్రామిక శక్తి తగ్గిపోయి ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది. వృద్ధుల జనాభా పెరగడం వైద్య సేవలు, పింఛన్ల వ్యవస్థపై భారం పెంచుతుంది. భారత్‌లో ఇప్పటికీ యువ జనాభా ఎక్కువ కాబట్టి వెంటనే అప్రమత్తమైతే భవిష్యత్తులో తలెత్తే సంక్షోభాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే రాజకీయ నేతలు సలహాలు ఇస్తున్నారు.