Principal Suspended: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడు - సస్పెండ్ చేసిన అధికారులు
Principal Suspended: పాఠాలు చెప్పి.. పిల్లలను ప్రయోజకులను చేయాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన అధికారులు అతగాడిని సస్పెండ్ చేశారు.
![Principal Suspended: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడు - సస్పెండ్ చేసిన అధికారులు Satya Sai District Principal suspended for misbehaving with girls Principal Suspended: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడు - సస్పెండ్ చేసిన అధికారులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/a31d5802461cfe9c4f6633c7ecf101e31678458206788519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Principal Suspended: విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలను సరైన మార్గంలో నడిపించే ప్రధానోపాధ్యాయుడే దారి తప్పాడు. బిడ్డల్లా భావించాల్సిన విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. వేధింపులు భరించలేక విద్యార్థినులకు సహనం తప్పింది. ఇక లాభం లేదనుకొని అంతా కలిసి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు అతగాడిని సస్పెండ్ చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
శ్రీసత్య సాయి జిల్లా తనకల్ల మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదినారాయణ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే అతను అక్కడ చదువుకుంటున్న అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. చాలా రోజుల పాటు విద్యార్థినులు కూడా భరిస్తూ వచ్చారు. కానీ సహనం తప్పిన అమ్మాయిలు తల్లిదండ్రులకు చెప్పారు. తీవ్ర ఆగ్రహానికి గురైన వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో జరుగుతున్న ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అయితే జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశంతో.. మండల విద్యాధికారులు, ఐసీడీఎస్ అధికారులు, స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు పాఠశాలలో విచారణ చేపట్టారు. బాలికల పట్ల ప్రధానోపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు విచారణలో తేలింది. వెంటనే అసభ్యంగా ప్రవర్తించిన సదరు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. శాఖపరమైన చర్యలతో పాటు ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాల్సిందని ఉన్నతాధికారులు ఆదేశించారు. మండల విద్యాశాఖ అధికారి ఫిర్యాదు మేరకు ఆదినారాయణపై కేసు నమోదు చేస్తామని తనకల్లు పోలీసులు తెలిపారు.
నెల్లూరులో స్కూల్ ముందు విద్యార్థిని తల్లి ధర్నా
నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని ఓ స్కూల్ లో ఓ అమ్మాయి తల్లి గొడవ చేసింది. స్కూల్ యాజమాన్యం తమకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది. స్కూల్ తో తన పాప కాపీ కొట్టిందనే నెపంతో టీచర్, వ్యాన్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించారని, తన కుమార్తెకు న్యాయం చేయాలని ఆమె స్కూల్ ముందు గతేడాది డిసెంబర్ లో ఆందోళనకు దిగారు. కరస్పాండెంట్ కారు కదలనీయకుండా రోడ్డుపైనే కూర్చున్నారు. తన కూతురితో స్కూల్ లో టీచర్, వ్యాన్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇక స్కూల్ యాజమాన్యం వాదన మరోలా ఉంది. విద్యార్థిని పరీక్షల్లో స్లిప్ పెట్టిందని, ఆ విషయం తల్లికి కూడా తెలుసని, కావాలనే ఇప్పుడు రాద్ధాంతం చేస్తోందని స్కూల్ కరస్పాండెంట్ చెబుతున్నారు. విద్యార్థినికి క్రమశిక్షణ నేర్పడమే తప్పా అని కరస్పాండెంట్ ప్రశ్నిస్తున్నారు. తాము క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని అంటున్నారామె.
నాలుగైదు నెలల క్రితం తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యoగా ప్రవర్తించాడు. విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో పాఠశాలకు వచ్చి టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు వెంకట రమణను తల్లిదండ్రులు చితకబాదారు. వెంకటరమణ మోడ్రన్ పబ్లిక్ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు.
"ఆ సార్ మాకు సైన్స్ చెబుతాడు. కారణంగా లేకుండా టచ్ చేస్తుంటాడు. నన్నే చూడండి అంటుంటాడు. చూసి నవ్వుతుంటాడు. ల్యాబ్ లో మార్కులు వేసేందుకు అభ్యంతకరంగా ప్రవర్తిస్తున్నాడు." - విద్యార్థిని
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)