Tamilnadu Sasikala : శశికళ చేతుల్లోకి అన్నాడీఎంకే ! బీజేపీ కూడా సానుకూలంగా ఉందా ?
అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకునే దిశగా శశికళ ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తున్నారు. ఆమెకు బీజేపీ కూడా సహకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తమిళనాట ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే లో ముసలం ప్రారంభమైంది. అన్నాడీఎంకే పార్టీకు ఆదివారంతో యాభై ఏళ్లు పూర్తవుతాయి ఈ సందర్భంగా జయలలిత సన్నిహితురాలు శశికళ తాను మళ్లీ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా సూచనలు పంపించారు. జయలలిత సమాధికి నివాళులు అర్పించి .. తనను అన్నాడీఎంకే నుంచి ఎవరూ దూరం చేయలేరని ప్రకటించారు. అన్నాడీఎంకే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని.. ఇక నుంచి అందరం కలిసి కాపాడుకుంటామని ప్రకటించారు. శశికళ వ్యాఖ్యలు తమిళ నాట హాట్ టాపిక్‌గా మారాయి. ఎందుకంటే అన్నాడీఎంకే నుంచి శశికళను ఎప్పుడో బహిష్కరించారు. ఆమెకు పార్టీలో చోటు లేదని అటు పన్నీరు సెల్వం.. ఇటు పళని స్వామి చాలా సార్లు ప్రకటించారు. శశికళ ప్రకటన తర్వాత కూడా అదే చెప్పారు. అన్నాడీఎంకేకు శశికళ సేవలు అవసరం లేదన్నారు
అన్నాడీఎంకే నేతలాగే శశికళ రాజకీయాలు !
అక్రమాస్తుల కేసులో జైలు శిక్షను పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరం అని శశికళ ప్రకటించారు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమె మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె ఎక్కడకు వెళ్లినా అన్నాడీఎంకే జెండాలతోనే కనిపిస్తున్నాయి. ఆమె కార్ల కాన్వాయ్‌కు అన్నాడీఎంకే జెండాలు ఉంటాయి. నిజానికి ఆమె ఆమె రాజకీయ వారసుడుగా పేరు తెచ్చుకున్న దినకరన్ కొత్త పార్టీ పెట్టారు. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ సక్సెస్ కాలేదు. దీంతో దినకర్న్‌ను దూరం పెట్టిన శశికళ అన్నాడీఎంకేలోనే రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నారు.
Also Read: బాణసంచా నిషేధ బాటలో రాష్ట్రాలు .. ఆ పని చేయవద్దని సీఎం స్టాలిన్ లేఖలు !
తాను వస్తున్నానంటూ తరచూ క్యాడర్‌లు లేఖలు.. సందేశాలు !
ఇటీవలి కాలంలో వరుసగా శశికళ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. "నేనొస్తున్నా" అంటూ కేడర్‌ను ఉద్దేశించి ఆమె ఓ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. చేశారు. అన్నాడీఎంకే అందరిదీ అని, ఇందులో అందరూ సమానమే అని గత వారం ఆమె చేసిన ప్రకటన చేశారు. పార్టీకి నేతృత్వం వహించే వారు తల్లితో సమానం అని, కేడర్‌ను బిడ్డల వలే చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రకటనలతో ఆమె ఎంట్రీ ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవడానికి కారణం అయింది.
Watch Video : ఒకే విమానంలో... తండ్రి పైలెట్‌గా... కూతురు ప్రయాణికురాలిగా
శశికళకు బీజేపీ సపోర్ట్ కూడా ఉందా ?
ప్రస్తుతం అన్నాడీఎంకేతో పొత్తులో ఉన్న బీజేపీ కూడా శశికళ అన్నాడీఎంకే బాధ్యతలు చేపట్టడానికి సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట పన్నీర్ సెల్వం, పళనీ స్వామి మోడీ, అమిత్ షాలతోసమావేశం అయ్యారు. ఆ సందర్భంగా అన్నాడీఎంకేలోకి శశికళను తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించాలని సూచించారని తమిళనాడు రాజకీయాల్లో ప్రచారం జరిగింది. ఆమె వస్తే తమ పరిస్థితి డమ్మీ అవుతుందని ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరూ అంగీకరించడం లేదు. అయితే శశికళ అన్నాడీఎంకేలోకి వస్తే ఆమె వర్గానికి చెందిన ఐదు శాతం ఓటు బ్యాంక్ కలసి వస్తుందని.. స్థానిక సంస్థల ఎన్నికలు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ అగ్రనేతలు నచ్చ చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే శశికళ గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. అందుకే ఏ క్షణమైనా అన్నాడీఎంకే శశికళ చేతుల్లోకి వెళ్లవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
Also Read: ఈ దంపతులు ఇంటికి తాళం వేయరు... చిప్‌తోనే ఇంటికి లాక్, అన్ లాక్