Stalin Letter : బాణసంచా నిషేధ బాటలో రాష్ట్రాలు .. ఆ పని చేయవద్దని సీఎం స్టాలిన్ లేఖలు !
కాలుష్యం పేరుతో నాలుగు రాష్ట్రాలు బాణసంచాను నిషేధించాయి. దీంతో టపాసుల పరిశ్రమ కేంద్రీకృతమైన తమిళనాడులో అక్కడి ప్రభుత్వం పరిశ్రమ మనుగడపై ఆందోళన చెందుతోంది.
దసరా పండుగ అలా పూర్తయిందో ఇలా దీపావళి పండుగపై చర్చ ప్రారంభమయింది. దీపావళి పండుగ సందర్భంగా ప్రతీ సారి దేశవ్యాప్తంగా టపాసులపై చర్చ జరుగతుంది. కొన్ని రాష్ట్రాలు బాణసంచాను కాలుష్యం పేరుతో నిషేధిస్తూ ఉంటాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా దీపావళి వేడకులు ప్రజలు పూర్తి స్థాయిలో చేసుకోలేదు. కరోనా ప్లస్ కాలుష్యం పేరుతో అనేక రాష్ట్రాలు నిషేధం విధిస్తూ వస్తున్నాయి. ఈ సారి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు తొలగిపోయాయి. కానీ పర్యావరణం పేరుతో దీపావళి టపాసుల అమ్మకాన్ని నిషేధిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు. ఇప్పటికి నాలుగు రాష్ట్రాలు బ్యానల్ చేశాయి. ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, హర్యానా ముఖ్యమంత్రులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. మరి కొన్ని రాష్ట్రాలు అదే తరహా ఆదేశాలిచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
Also Read : ఐసు పుల్లలతో దుర్గామాత ఐడల్... 275 ఐసు పుల్లలు... ఆరు రోజుల సమయం
బాణసంచా నిషేధం విధిస్తే ఎక్కువ గా నష్టపోయేది తమిళనాడే. అక్కడి నుంచే ఎక్కువగా దేశంలో నలుమూలలకు సరఫరా అవుతుంది. అందుకే సీఎం స్టాలిన్ ఏ మాత్రం ఆలోచించకుండా బాణసంచాపై నిషేధం విధించిన ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. టపాసుల తయారీపై దాదాపు 8 లక్షల మంది ఆధారపడి ఉన్నారని, వారి పొట్ట కొట్టొద్దని కోరారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి టపాసులను విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. కాలుష్యం కారణంగానే నిషేధం నిర్ణయం తీసుకున్నారని తెలుసని అయితే సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేకమైన బాణసంచాపైనే నిషేధం విధించిందని, గ్రీన్ క్రాకర్స్ ఇప్పుడు తయారు చేస్తున్నారని, అవి తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. ఇతర దేశాల్లోనూ ఎక్కడా నిషేధం లేదనన్నారు. ఇలాంటి నిషేధాన్నే ఇతర రాష్ట్రాలు కూడా విధించాయంటే మొత్తం పరిశ్రమనే మూసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: పీపీఈ కిట్లు ధరించి గార్భా డ్యాన్స్... కరోనాపై అవగాహన కోసం... మీరూ ఓ లుక్కేయండి
రెండేళ్లుగా బాణసంచాపై నిషేధం వల్ల ఏర్పడిన అనిశ్చితితో తమిళనాడులో 840 ఫ్యాక్టరీలు మూతపడినట్లుగా అక్కడి పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. లక్షల మంది ఉపాధికి దూరమయ్యారు. తమిళనాడులోని శివకాశి పట్టణం బాణసంచాకు ప్రసిద్ధి. గత రెండేళ్లుగా వ్యాపారం లేకపోవడంతో అక్కడ ప్రజలు ఎక్కువ మంది వలసలు పోయారు. నిషేధం విధిస్తున్న రాష్ట్రాలు తీవ్రంగా ఆలోచించి బాణసంచా పరిశ్రమను, లక్షలాది మంది కార్మికులను ఆదుకోవాలని తమిళనాడు ప్రభుత్వం కోరుతోంది. కార్మికుల జీవితాలనే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలన్నా బాణసంచా పరిశ్రమపై ఆంక్షలు ఎత్తివేయాలనిడీఎంకే కోరుతోంది. గ్రీన్ క్రాకర్స్ అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read: 25వేల బిస్కెట్లు... 24 అడుగుల మస్కట్... తయారు చేయడానికి 15 గంటల సమయం