YouTuber Anvesh: ఫేమస్ యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ.. త్వరలో భారత్‌కు రావాల్సిందే!
ఫేమస్ యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ చర్యతో అన్వేష్ ను త్వరలో భారత్‌కు రప్పించడం తేలిక అవుతుంది.

YouTuber Anvesh Lookout Notice | హైదరాబాద్: ఫేమస్ యూట్యూబర్ అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు తాజాగా నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ సర్క్యులర్ (Lookout Notice) జారీ చేశారు. గతేడాది డిసెంబర్‌లో నటి కరాటే కల్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్వేష్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం తెలిసిందే. సీతాదేవి, ద్రౌపదీ దేవి వంటి దేవతలను కించపరిచేలా వీడియోలు విడుదల చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉండటంతో, ఆయనను భారత్‌కు రప్పించి అరెస్టు చేసే దిశగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
ఈ వివాదంలో అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెటా సంస్థ ఇప్పటికే బ్లాక్ చేసింది. దీనిపై స్పందిస్తూ యూట్యూబర్ అన్వేష్ విడుదల చేసిన మరో వీడియోలో అసభ్యకర పదజాలాన్ని వాడటం మరింత దుమారం రేపింది. ఈ క్రమంలో ఆయనపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసిన పోలీసులు, అన్వేష్ ఆచూకీ కోసం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సంస్థలకు కూడా లేఖలు రాశారు. విశాఖపట్నానికి చెందిన అన్వేష్ గత కొన్నేళ్లుగా విదేశీ పర్యటనల వీడియోలతో గుర్తింపు పొందినప్పటికీ, ఇటీవల అన్వేష్ చేసిన మతపరమైన వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు దారితీశాయి. లుకౌట్ నోటీసుల జారీతో అతడు విమానాశ్రయాలకు చేరుకుంటే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఇన్‌స్టా అకౌంట్ బ్యాన్‌పై అన్వేష్ తీవ్ర వ్యాఖ్యలు
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిపివేతపై యూట్యూబర్ అన్వేష్ అత్యంత ఘాటుగా, వివాదాస్పద శైలిలో స్పందించాడు. ఖాతా పోయినందుకు తాను బాధపడుతున్నానని అనుకుంటే పొరపాటని, పైసా ఆదాయం రాని ఇన్‌స్టాగ్రామ్ ఉన్నా ఒకటే పోయినా ఒకటేనని బూతులతో విరుచుకుపడ్డాడు. తన సోషల్ మీడియా ఖాతాలను శరీర అవయవాలతో పోలుస్తూ.. చేతులు, కాళ్లు లాంటి అకౌంట్లు పోయినా, వీటన్నింటినీ నడిపించే తన 'తెలివైన బుర్ర' తన దగ్గరే ఉందని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశాడు. దమ్ముంటే తన తల తీయాలి తప్ప, ఇలాంటి నిషేధాలతో తనను ఆపలేరని ఛాలెంజ్ చేశాడు.
ఇన్‌స్టాగ్రామ్ వల్ల తనకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేదని, కేవలం యూట్యూబ్ నుండే నెలకు 8 లక్షల ఆదాయం వస్తోందని, బ్యాంకు వడ్డీ రూపంలో మరో 9 లక్షలు వస్తున్నాయని అన్వేష్ చెప్పుకొచ్చాడు. తనను వ్యతిరేకించే వారిని 'బత్తాయిలు' అని సంబోధిస్తూ, ఎవరినీ క్షమించే ప్రసక్తి లేదని, అందరికీ నరకం చూపిస్తానని హెచ్చరించాడు. వినాయకుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, రేపటి నుండి రోజూ వీడియోలు వస్తాయని, తన ఆరోగ్యం బాగున్నంత వరకు ఎవరికీ తలవంచనని స్పష్టం చేశాడు.
ఇన్‌స్ట్రాగ్రామ్ సంస్థకు పోలీసుల లేఖ
దేవతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అన్వేష్ ను ఇండియాకు రప్పించాలని, కఠినంగా శిక్షించాలంటూ మరోవైపు హిందూ సంఘాలు ఆందోళన చేయడం తెలిసిందే. నా అన్వేషణ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు ఐడీతోపాటు , వివాదాస్పద వీడియో కంటెంట్ లింక్ ల వివరాలు కావాలంటూ ఇన్ స్టాగ్రామ్‌కు పంజాగుట్ట పోలీసులు కొన్ని రోజుల కిందట లేఖ రాశారు. ఇన్ స్టాగ్రామ్ నుండి వారికి కావాల్సిన వీడియో అందించింది. కొన్ని రోజులకు ఇన్‌స్టాగ్రామ్ అన్వేష్ అకౌంట్ బ్యాన్ చేసింది. తాజాగా పోలీసులు భారత్‌కు రప్పించడంలో భాగంగా అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
























