Marriage at Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌లో సీఆర్పీఎఫ్ అధికారిణి పెళ్లి - ప్రత్యేకంగా అనుమతి ఇచ్చిన ద్రౌపతి ముర్ము - కారణమేంటో తెలుసా?
Viral News: రాష్ట్రపతి భవన్ ఓ పెళ్లి వేడుకకు వేదిక కానుంది. సీఆర్పీఎఫ్ కమాండెంట్ గా పని చేస్తున్న మహిళా అధికారికి రాష్ట్రపతి ముర్ము ఈ అవకాశం ఇచ్చారు.

Rashtrapati Bhavan will be the venue for a wedding ceremony: రాష్ట్రపతి భవన్ అంటే దేశంలోని అత్యున్నత నిలయం. దేశాధ్యక్షురాలి నిలయం. సాధారణంగా అక్కడ జరిగే కార్యక్రమాలకు ఓ రేంజ్ ఉంటుంది. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారంతో పాటు ఇతర దేశాల అధ్యక్షులతో సమావేశాలు, వారి గౌరవార్థం విందులు ఏర్పాటు చేస్తూంటారు. కానీ ఈ సారి అక్కడ వినూత్నమైన వేడుక జరగనుంది. అది ఓ పెళ్లి.
రాష్ట్రపతి కుటుంబంలోని వ్యక్తులదో లేకపోతే మరో ఉన్నత స్థాయి వ్యక్తులదో కాదు. అయినా ఇలాంటి వేడుకలకు రాష్ట్రతి భవన్ ఆహ్వానం ఇవ్వదు. కానీ ద్రౌపది ముర్ము ఓ ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఈ అవకాశం కల్పించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పూనమ్ గుప్తా పెళ్లి రాష్ట్రపతి భవన్ లో జరగనుంది. ఈ అమ్మాయికి ప్రత్యేకంగా ద్రౌపతి ముర్ము అవకాశం ఇచ్చారు. ఆ అమ్మాయి అడగలేదు.. స్వయంగా ముర్మునే రాష్ట్రపతి భవన్ లోనే పెళ్లిచేసుకోవాలని ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే ఈ పూనమ్ గుప్తా సామాన్యురాలు కాదు..ఎంతో ధైర్య సాహసాలున్న యువతి. రాష్ట్రపతి భవన్ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న ఆఫీసర్ కూడా.
ప్రస్తుతం పూనమ్ గుప్తా సీఆర్పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పీఎస్ఓ హోదాలో ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను సేవలు నచ్చడంతో పలుమార్లు ప్రశంసించారు. ఇటీవలే జరిగిన గణతంత్ర దినోత్స వేడుకల్లో జరిగిన పరేడ్‌లో సీఆర్పీఎఫ్ మహిళా దళానికి పూనమ్ గుప్తానే సారథ్యం వహించారు. ద్రౌపతిముర్ము ఆమె సిన్సియారిటీని, సేవలను మెచ్చారు. పూనమ్ గుప్తాకు.. జమ్ము కశ్మీర్‌లోని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా సేవలు అందిస్తున్న అవ్నీష్ కుమార్‌తో పెళ్లి ఖరారు అయింది. ఫిబ్రవరి 12వ తేదీనే వీరి వివాహం జరగబోతుంది.
పూనమ్ గుప్తా చిన్న తనం నుంచి ఎంతో దైర్యవంతురాలు. పూనమ్ గుప్తా నవోదయ విద్యాలయంలో చదువుకున్నారు. పూనమ్ గుప్తా గణితంలో గ్రాడ్యుయేషన్, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. గ్వాలియర్‌లోని శివాజీ విశ్వ విద్యాలయంలో బీఈడీ చేశారు. 2018లో జరిగిన యూపీఎస్‌సీ సీఏపీఎఫ్ పరీక్షల్లో పూనమ్ గుప్తాకు 81వ ర్యాంకు వచ్చింది. CRPFలో అసిస్టెంట్ కమాండెంట్ పదవిని పొందారు. ఆమె సిన్సియారిటీ రాష్ట్రపతిని మెప్పించింది. అందుకే చరిత్రలో ఎవరికీ లభించని అరుదైన అవకాశం లభిస్తోంది.





















